వరంగల్​ కమిషనరేట్ లో 3.21 శాతం తగ్గిన క్రైమ్​రేట్​

వరంగల్​ కమిషనరేట్ లో 3.21 శాతం తగ్గిన క్రైమ్​రేట్​
  • పెరిగిన చోరీలు..  రెట్టింపైన నార్కోటిక్ డ్రగ్ కేసులు
  • సైబర్ నేరాలతో రూ.24.7 కోట్లు గల్లంతు
  • కేసుల డిటెక్షన్, రికవరీలో వెనుకబాటు
  • రోడ్డు యాక్సిడెంట్లు, డెత్​లు స్వల్పంగా డౌన్

హనుమకొండ/ వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్​లో మూడేండ్లుగా పెరుగుతూ వచ్చిన క్రైమ్​రేట్​ఈసారి తగ్గింది. గతేడాది అన్నీ కలిపి 14,731 కేసులు నమోదు కాగా, ఈసారి 14,406 కేసులు నమోదయ్యాయి. వరంగల్ పోలీస్​ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో ఓవరాల్​గా క్రైమ్​రేట్​3.21 శాతం తగ్గింది. కమిషనరేట్​యాన్యువల్​ క్రైమ్​ రిపోర్టును వరంగల్​ సీపీ అంబర్​ కిశోర్​ ఝా శనివారం విడుదల చేశారు. సమావేశంలో ఈస్ట్​జోన్‌‌‌‌ డీసీపీ రవీందర్‌‌‌‌, ఏఎస్పీ మన్నన్‌‌‌‌ భట్, అడిషనల్​డీసీపీ రవి, ఏసీపీలు జితేందర్‌‌‌‌ రెడ్డి, డేవిడ్‌‌‌‌ రాజు, సీఐలు శ్రీనివాస్‌‌‌‌, కరుణాకర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. 

స్వల్పంగా తగ్గిన మర్డర్ కేసులు..

వరంగల్ కమిషనరేట్​లో గతేడాదితో పోలిస్తే ఈసారి మర్డర్లు స్వల్పంగా తగ్గాయి. నిరుడు 48 మర్డర్ కేసులు రిపోర్ట్​ కాగా, ఈసారి 40 హత్యలు జరిగాయి. మర్డర్​అటెంప్ట్​ కేసులు 129 నమోదైతే, ఈసారి 107 నమోదయ్యాయి. కమిషనరేట్​లో 2023లో 188 కిడ్నాపింగ్​ కేసులు ఫైల్​అయితే, ఈ ఏడాది 174 కేసులు రిపోర్టయ్యాయి. నిరుడు జరిగిన 460 రోడ్డు ప్రమాదాల్లో 499 మంది చనిపోగా, 1,398 మంది గాయాలపాలయ్యారు. ఈ సంవత్సరం 417 రోడ్డు యాక్సిడెంట్లు జరగగా, 439 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,395 మంది గాయాల బారినపడ్డారు. డ్రంకెన్​డ్రైవ్​ కేసులు ఈసారి 20,338 నమోదు కాగా, 96 మందికి జైలు శిక్ష పడింది. మొత్తంగా రూ.1.82 కోట్ల జరిమానా కూడా విధించారు.

డ్రగ్, గంజాయి కేసులు పెరిగినయ్..​

కమిషనరేట్​ఎన్​ఫోర్స్​మెంట్​ఆధ్వర్యంలో నిరుడు నార్కొటిక్​ డ్రగ్​ కేసులు 75 నమోదు కాగా, 171 మందిని అరెస్ట్​ చేసి, రూ.3.39 కోట్ల విలువైన నగదు, సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 147 కేసులు నమోదు చేసి 331 మందిని అరెస్ట్​ చేశారు. రూ.2.63 కోట్లు నగదు, సరకు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్​పోలీసులు నిరుడు 302 కేసులు పట్టుకోగా, ఈసారి 590 కేసులు పట్టుకున్నారు. వివిధ కేసుల్లో మొత్తంగా 1,145 మందిని అరెస్ట్​ చేసి రూ.10.77 కోట్ల నగదు సీజ్​చేశారు. ఇందులో అత్యధికంగా 58 గంజాయి కేసులే ఉండగా, రూ.2.02 కోట్ల నగదు పట్టుకోవడం గమనార్హం. రూ.1.39 లక్షల విలువైన గుట్కా, రూ.1.56 కోట్ల విలువైన పీడీఎస్​ రైస్​ను టాస్క్ ఫోర్స్​పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రికవరీలో వెనకబాటు..

గతంతో పోలిస్తే వరంగల్ కమిషనరేట్​ఈసారి దొంగతనాలు పెరిగాయి. నిరుడు 927 చోరీలు జరగగా, రూ.9.9 కోట్ల వరకు ప్రాపర్టీ లాస్​జరిగింది. అందులో పోలీసులు 584 కేసులు సాల్వ్​చేసి, రూ.4.19 కోట్లు రికవరీ చేశారు. ఈసారి రాయపర్తి బ్యాంక్​రాబరీ కేసు సహా ఇతర చోరీలు కలిపి ఓవరాల్​గా 948 దొంగతనాలు జరగగా, మొత్తంగారూ.24.6 కోట్లు వరకు దోపిడీ జరిగింది. ఇందులో 519 కేసులు ఛేదించి, రూ.7.1 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. 

అంటే 54.7 శాతం కేసులు డిటెక్ట్​కాగా, రికవరీ 29.10 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఈ సారి సైబర్​నేరాలు 772 నమోదయ్యాయి. పోలీసులు 114 కేసులు మాత్రమే ట్రేసౌట్​ చేసి, 85 మంది అరెస్ట్ చేశారు. సైబర్​ నేరగాళ్లు ఓవరాల్​ గా రూ.24.7 కోట్ల వరకు కొల్లగొట్టగా, పోలీసులు రూ.1.29 కోట్లు అంటే 5.2 శాతం మాత్రమే రికవరీ చేశారు. దీంతోపాటు తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిలో ఈసారి కేవలం ఇద్దరిపై పీడీ యాక్టులు నమోదు చేయడం గమనార్హం. 

142 మంది మిస్సింగ్..​

నిరుడితో పోలిస్తే కమిషనరేట్ లో ఈ ఏడాది మహిళలపై దాడులు, నేరాలు దాదాపు 11 శాతం తగ్గాయి. నిరుడు ఇవే కేసులు 1269 కేసులు నమోదు కాగా, ఈసారి 1,141 కేసులు నమోదు అయ్యాయి. కమిషనరేట్​వ్యాప్తంగా 1.270 మిస్సింగ్​ కేసులు నమోదు కాగా, అందులో 1,128 మందిని పోలీసులు ట్రేస్​చేశారు. కానీ, ఇంకో 142 మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. కాగా ఆచూకీ లభ్యం కాని జాబితాలో 13 మంది బాలికలు, ముగ్గురు బాలురు ఉండగా, 61 మంది మహిళలు, 65 మంది పురుషులు ఉండటం గమనార్హం. 

ట్రాఫిక్​ కంట్రోల్, విమెన్​ సేఫ్టీపై ఫోకస్..

వరంగల్ కమిషనరేట్​లో జరిగిన లోక్​సభ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేశాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న కమిషనరేట్​లో ప్రధానంగా ట్రాఫిక్​కంట్రోల్, విమెన్​సేఫ్టీపై ఫోకస్​పెట్టాం. పోలీసుల చర్యలతో క్రైమ్​రేట్​ కొంతమేరకు తగ్గింది. ట్రేసింగ్, రికవరీ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. క్రైమ్, లా అండ్​ఆర్డర్, ట్రాఫిక్​విభాగాలపై దృష్టి పెట్టి నేరాలను తగ్గించాం. మున్ముందు నేరాల నియంత్రణకు తగిన చర్యలు చేపడతాం.

అంబర్​కిశోర్​ ఝా, వరంగల్ సీపీ