అదే దృశ్యం.. మళ్లీ: కళ్లకుకట్టే క్రైమ్​ రీ కన్​స్ట్రక్షన్​

నేరం ఎలా జరిగిందో కళ్లకుకట్టే క్రైమ్​ రీ కన్​స్ట్రక్షన్​

దోషులను పట్టుకోడానికి ఇదో టెక్నిక్​

‘వందమంది తప్పించుకున్నా పరవాలేదు, కానీ ఒక్క అమాయకుడైనా శిక్షకు గురి కావద్దు’ అనేది సహజ న్యాయసూత్రం.  అలాగే, ఎంత ప్రొఫెషనల్​ క్రిమినల్​ అయినా ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాడన్నది ఇన్వెస్టిగేషన్​ థియరీ. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పక్కాగా కేసు షీటును కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నేరం జరిగిన తీరుతెన్నుల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నాన్ని ‘క్రైమ్​ సీన్​ రీకస్ట్రక్షన్​’ అంటారు. నేరం జరిగిన తీరు మొత్తాన్ని సైంటిఫిక్​ పద్ధతిలో నిర్ధారించడానికి వీలవుతుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘జస్టిస్ ఫర్ దిశ’ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న మాట… ‘క్రైమ్ సీన్ రీ కన్ స్ట్రక్షన్’. ఆమెపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించి చాలా తక్కువ ఆధారాలు దొరికాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు పూర్తిగా సీన్ రీకన్​స్ట్రక్షన్​ పైనే ఆధారపడి నలుగురు నిందితుల్ని తీసుకెళ్లారు. అక్కడ  ఎన్​కౌంటర్ జరగడంతో అసలు క్రైమ్​ రీకన్​స్ట్రక్షన్​ అంటే ఏమిటన్న ఆసక్తి ఏర్పడింది. చటాన్​పల్లిలో దిశ డెడ్​బాడీని దహనం చేసిన స్థలంతో పాటు ఎన్​కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్లంతా దీని గురించే చర్చించుకున్నారు. వాళ్లకు ఏదైనా కేసుకు సంబంధించి ఎఫ్​ఐఆర్, ఛార్జ్ షీట్, జడ్జిమెంట్ లాంటి పేర్లు మాత్రమే తెలుసు. సీన్ రీకన్​స్ట్రక్షన్​ అంటే ఏంటో తెలీదు. గతంలో ఎన్నారై జయరాం హత్యకేసును, హాజీపూర్​ సైకో రేపిస్ట్​ శ్రీనివాస్​రెడ్డి దారుణాల్ని ఈ పద్ధతిలోనే పోలీసులు ఒక కొలిక్కి తీసుకురాగలిగారు.

సాధారణంగా ఏదైనా నేరం జరిగితే ఆ ఏరియా పోలీసులు ముందుగా ఎఫ్​ఐఆర్ నమోదు చేస్తారు. ఆ తరువాత కేసు తీవ్రతను బట్టి డిటెక్టివ్ పోలీసులతో ‘సీన్ ఆఫ్ అఫెన్స్ (ఘటనా స్థలం)’లో తనిఖీలు చేస్తారు. పోలీస్ స్టేషన్​లో కేసు రిజిస్టరైన నాటి నుంచి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్తి బాధ్యతలు తీసుకుంటారు. దర్యాప్తులో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్​లో సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు బాధితులు, సాక్షుల స్టేట్​మెంట్స్​ని పోలీసులు రికార్డ్ చేస్తారు. ఇలా సేకరించిన ఎవిడెన్స్​లను ఛార్జ్ షీట్​తో పాటు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. క్లూస్ టీమ్ సేకరించే ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్​ను ఫోరెన్సిక్ ల్యాబ్​కి పంపించి సైంటిఫిక్ ఎవిడెన్స్​ సేకరిస్తారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్​లో కీలకం

ఈ క్రమంలో సీన్ ఆఫ్ అఫెన్స్​లో పోలీసులు నిర్వహించే ‘క్రైమ్ సీన్ రీకన్​స్ట్రక్షన్​’కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేరస్తులు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. భారీ చోరీలతో పాటు హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు తప్పనిసరిగా క్రైమ్ రీకన్​స్ట్రక్షన్​ చేస్తుంటారు. కేసు దర్యాప్తులో భాగంగా ‘నేరం జరిగిన ప్రాంతం (క్రైమ్ సీన్)’​ని పోలీసులు ముందుగా తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆ ప్రాంతంలోకి అనుమానితులు, నిందితులు మినహా ఇతరులను అనుమతించరు. ఆ పరిసర ప్రాంతాల్ని సీజ్ చేసేస్తారు. నిందితుల్ని ఘటనా స్థలంలోకి తీసుకెళ్లి నేరం జరిగిన విధానాన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విచారిస్తారు.

శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్

ఆ తరువాత ఇన్వెస్టిగేషన్ అధికారుల సమక్షంలో సీన్ ఆఫ్ అఫెన్స్​లో నిందితులతో అదే నేరాన్ని మరోసారి అమలు చేయిస్తారు. దీన్నే ‘క్రైమ్ సీన్ రీకన్​స్ట్రక్షన్​‌’గా పిలుస్తారు. ఇందులో నిందితులు ఏ విధంగా నేరం చేశారనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. శాస్త్రీయ పద్దతులు, ఫొటోగ్రఫీ, ఫోరెన్సిక్ నివేదికల ద్వారా నిరూపించేందుకు సీన్ రీకన్​స్ట్రక్షన్​ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో ఇచ్చిన స్టేట్​మెంట్స్​ ఆధారంగా కేసు తీవ్రతను గుర్తిస్తారు. సీన్ ఆఫ్ అఫెన్స్​లో నిందితులతో డెమో చేయిస్తారు. చోరీ కేసుల్లోనైతే తాళాలు బ్రేక్ చేసే స్టయిల్​ని, హత్య కేసులోనైతే హంతకులు వాడిన ఆయుధాలు దగ్గర్నుంచి ప్లాన్ అమలు చేసినంతవరకు పూర్తి వివరాలు రాబడతారు.

ఇలాంటి కేసుల్లో క్రైమ్ సీన్​ని పూర్తిగా వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేస్తారు. మృతదేహాలు లేదా అఫెన్స్ జరిగిన ప్రాంతాన్ని నిందితులు చెప్పిన విధంగా స్కెచ్ వేస్తారు. స్పాట్​లో వాటిపై సంతకాలు,వేలిముద్రలు తీసుకుంటారు. నేరం జరిగిన చోట సేకరించే క్లూస్​తో… నిందితులు చెప్పిన వివరాల్ని పోల్చుకుంటూ స్పాట్​లోనే పరిశీలిస్తారు. ఇలా సేకరించిన అన్ని ఆధారాలతో కేసు దర్యాప్తు మరింత సులభం అవుతుంది. దీంతో పాటు సైంటిఫిక్ ఆధారాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ద్వారా నిందితులను దోషులుగా నిరూపించేందుకు ప్రాసిక్యూషన్​కు బలమైన సాక్ష్యాధారాలు లభిస్తాయి. దోషులకు శిక్షలు పడే అవకాశాలు పెరుగుతాయి.

టాప్ -డౌన్ లాజిక్​గా సీన్ రీకన్​స్ట్రక్షన్​

ఈ విధానాన్ని ‘టాప్- డౌన్ లాజిక్’ అని కూడా పిలుస్తారు. సమగ్రమైన డాక్యుమెంటేషన్, ఫోరెన్సిక్ నివేదికలకు సీన్ రీకన్​స్ట్రక్షన్​ ఉపయోగపడుతుంది. నిందితులు నేరం ఎలా చేశారో, పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఎలాంటి ప్లాన్ చేశారో ముందుగానే పోలీసులు అంచనా వేస్తారు. ఒకవేళ నిందితులు ఇచ్చే సమాచారం కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందనే అనుమానం తలెత్తితే  సీన్ రీకన్​స్ట్రక్షన్​ ద్వారా నివృత్తి చేసుకుంటారు. సీన్ ఆఫ్ అఫెన్స్​లో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్​కి కావలసిన కీలక ఆధారాలు సేకరించడమే లక్ష్యంగా ‘క్రైమ్ సీన్ రీకన్​స్ట్రక్షన్​’ జరుగుతుంది.

– శ్రీనివాస్, క్రైమ్ రిపోర్టర్

పోలీసు పరిభాషలో…

క్రైమ్​ రీకన్​స్ట్రక్షన్​ : దీనినే క్రైమ్​ సీన్​ రీకన్​స్ట్రక్షన్​, టాప్- డౌన్ లాజిక్ అని కూడా అంటారు. నిందితుల్ని ఘటనా స్థలంలోకి తీసుకెళ్లి నేరం జరిగిన విధానాన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విచారిస్తారు.

సీన్ ఆఫ్ అఫెన్స్ : నేరం జరిగిన ఘటనా స్థలం. దీనినే క్రైమ్​ సీన్​ అనికూడా అంటారు. ఆ ప్రాంతంలోకి అనుమానితులు, నిందితులు మినహా ఇతరులను అనుమతించరు. ఆ పరిసర ప్రాంతాల్ని సీజ్ చేసేస్తారు.

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ : పోలీస్ స్టేషన్​లో కేసు రిజిస్టరైన నాటి నుంచి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంతవరకు బాధ్యతలు నిర్వహించే అధికారి.

సైంటిఫిక్ ఎవిడెన్స్ : క్లూస్ టీమ్ సేకరించే ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్​ను ఫోరెన్సిక్ ల్యాబ్​కి పంపించి సైంటిఫిక్ ఎవిడెన్స్ రూపొందిస్తారు.

ప్రాసిక్యూషన్​ ఎవిడెన్స్​ : కేసును అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్​ చేసి, తగిన కీలక సాక్ష్యాధారాలతో పక్కాగా రూపొందించి కోర్టుకు సబ్మిట్​ చేసేవి.