యాదాద్రిలో పెరిగిన క్రైమ్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీస్​ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసి క్రైమ్​ రిపోర్ట్​లో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే అత్యాచారాలు.. పోక్సో కేసులు, దొంగతనాలు, గంజాయి సహా మత్తు పదార్థాల రవాణా, డ్రంకెన్​డ్రైవ్​ కేసులు పెరిగాయి.  హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.   వివిధ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు సక్సెస్​ అయ్యారు. 

పెరిగిన అత్యాచారాలు

గతేడాదిలో 56 మంది మహిళలు అత్యాచారానికి గురికాగా ఈసారి ఆ సంఖ్య 59కి చేరింది. పోస్కో కేసులు గతేడాది 40 నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 68కి పెరిగింది.  అయితే ఈసారి హత్యలు తగ్గాయి. గతేడాది 14 మంది హత్యకు గురికాగా, ఈఏడాదిలో 12 హత్య కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు సాల్వ్​ చేశారో వెల్లడించలేదు.  అయితే ఈసారి క్రైమ్​ రిపోర్ట్​లో ఆత్మహత్యలు, కిడ్నాప్​ వివరాలు వెల్లడించలేదు. 

తగ్గిన రోడ్డు ప్రమాదాలు 

జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గింది. 591 ప్రమాదాలు జరగగా 218 మంది చనిపోయారు. ఈ ఏడాది 565 ప్రమాదాలు జరగగా ఎంతమంది చనిపోయారో మాత్రం వెల్లడించలేదు. దొంగతనాల సంఖ్య పెరిగింది. గతేడాది 407 దొంగతనాలు జరగగా, ఈసారి 467 దొంగతనాలు జరిగాయి. రూ. 3.55 కోట్ల విలువైన వస్తువులు, నగదు చోరీ చేశారు. అయితే 263 కేసులను చేధించి రూ. 2.04 కోట్లు రికవరీ చేశారు. 

పెరిగిన గంజాయి రవాణా

జిల్లా మీదుగా గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల రవాణా పెరిగింది. గతేడాది గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా కేసులు 26 నమోదు కాగా 1583 కిలోల గాంజా, 9 లీటర్ల హాష్​ ఆయిల్, 10.35 గ్రాముల ఎంఎండీఏను స్వాధీనం చేసుకున్నారు  ఈ ఏడాది 29 కేసులు నమోదు కాగా 1781.148 కేజీల గాంజా, 3.5 లీటర్ల హాష్​ ఆయిల్, 41 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు.  గేమింగ్​ యాక్ట్​ కింద 29 కేసులు  నమోదు కాగా 169 మందిని అరెస్ట్​ చేసి రూ. 11.63 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

 డ్రంకెన్​​ డ్రైవ్​ కేసులు 2145 

డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. 2021లో డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు 2145 నమోదు కాగా రూ. 46, 61,707 ఫైన్​ విధించారు. 2022లో ఆ సంఖ్య 3653కు పెరగగా రూ. 88,81,980 ఫైన్​ విధించారు. ఈ ఏడాది 4235 కేసులు నమోదు కాగా రూ. 68.45 లక్షల ఫైన్​ విధించారు.

25 మందికి యావజ్జీవం

న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు పడే విధంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు.  ఈ ఏడాది పలు కేసుల్లో 25 మంది  యావజ్జీవ శిక్ష పడింది. ఒకరికి 25 ఏండ్లు, ఇద్దరికి 20 ఏండ్ల శిక్ష పడింది. ఒకరికి 11 ఏండ్లు, నలుగురికి పదేండ్లు, ఐదుగురికి ఐదేండ్ల  శిక్ష, మరో 43 మందికి ఐదేండ్ల లోపు శిక్షలు పడ్డాయి.