- వరకట్న వేధింపులు తగ్గినా..పెరిగిన రేప్‌లు, మర్డర్లు
- హత్యలు 241, అత్యాచారాలు 2,945, ఆత్మహత్యలు 379
- 9.87% పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేటు
- పోయినేడు 2,13,121 కేసులు.. ఈసారి 2,34,158
- 43.33 శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్
- 2024 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయి. వరకట్న వేధింపులు కొంతమేర తగ్గినప్పటికీ.. హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. మహిళలపై నేరాలు పోయినేడాదితో పోలిస్తే ఈసారి 4.78 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. పోయినేడాది మొత్తం 19,013 కేసులు నమోదు కాగా, ఈసారి 19,922 కేసులు రికార్డయ్యాయి. ఇందులో హత్యలు 241 ఉండగా, అత్యాచారాలు 2,945 ఉన్నాయి. మరోవైపు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు కూడా 8.71 శాతం పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి 2024 వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ ఆదివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో విడుదల చేశారు.
డిజిటల్ స్పేస్‌లో చిన్నారుల భద్రత ఎలా అనే అంశంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా వరకు రేప్ కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రేమ వ్యవహారాలు, టీనేజ్ రిలేషన్ షిప్స్ ఇతరత్రా కారణాలతో రేప్ కేసులు పెరిగాయని చెప్పారు. బాధితుల్లో 15 ఏండ్లలోపు వాళ్లు 87 మంది, 15 నుంచి 18 ఏండ్ల లోపు వాళ్లు 1,970 మంది, 18 ఏండ్లకు పైబడిన వాళ్లు 888 మంది ఉన్నారని వివరించారు.
తగ్గిన క్రైమ్ రేట్..
పోయినేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేటు ఈసారి 9.87 శాతం పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. పోయినేడాది 2,13,121 కేసులు నమోదు కాగా.. ఈసారి 2,34,158 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. లగచర్ల సహా ఒకట్రెండు ఘటనలు మినహా ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది నాలుగుసార్లు ఎదురుకాల్పులు జరగ్గా,మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలిపారు.
మరో 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, ఇంకో 41 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పారు. ఈసారి డయల్ 100 ఎమర్జెన్సీ నంబర్‌కు మొత్తం 16,92,173 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఈసారి కన్విక‌్షన్ రేట్ (శిక్షల శాతం) స్వల్పంగా తగ్గినట్టు పేర్కొన్నారు. పోయినేడాది 39,371 కేసుల్లో కోర్టులు శిక్షలు విధించగా.. ఈసారి 28,477 కేసుల్లోనే శిక్షలు పడినట్టు వెల్లడించారు.
1,942 డ్రగ్స్ కేసులు..
ఎప్పటిలాగే సైబర్ నేరాలు ఈసారి కూడా పెరిగాయని డీజీపీ జితేందర్ తెలిపారు. పోయినేడాదితో పోలిస్తే ఈసారి 43.33 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. పోయినేడాది 17,571 కేసులు నమోదు కాగా.. ఈసారి 25,184 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఛేదించలేని కేసులను కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించిందని చెప్పారు. సైబర్ నేరగాళ్లకు చేరకుండా రూ.247 కోట్లు సీజ్ చేశామని, అందులో రూ.180 కోట్లు బాధితులకు రీఫండ్ చేశామని వివరించారు.
సైబర్ నేరాలతో లింకైన 14,984 సిమ్‌కార్డులతో పాటు 9,811 ఐఎంఈఐ నంబర్స్‌ను బ్లాక్ చేశామన్నారు. అలాగే 1,825 వెబ్‌సైట్/యూఆర్‌ఎల్ బ్లాక్ చేశామన్నారు. ఇక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 1,942 డ్రగ్స్ కేసులు నమోదు చేయగా.. 4,682 మందిని అరెస్టు చేశామని తెలిపారు. రూ.142.95 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం, సైబర్ నేరాల కట్టడికి పోలీస్ శాఖ కృషి చేస్తున్నదన్నారు. డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నదని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇందులో కొంతమంది నిందితులకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ సీబీఐ చేస్తున్నదని చెప్పారు. ఇంటర్‌పోల్ వ్యవహారం కాబట్టి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం.
పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. 2014లో కేవలం 4 శాతం మంది వాహనదారులే హెల్మెట్ పెట్టుకునేవారు. ప్రస్తుతం 80 శాతం మంది హెల్మెట్ ధరిస్తున్నారు” అని వెల్లడించారు. పోయినేడాది 23,491 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. ఈసారి 20,702 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 6,541 మంది చనిపోయారని చెప్పారు.
సమావేశంలో అడిషనల్ డీజీ (లా అండ్‌ఆర్డర్) మహేశ్ భగవత్, ఇంటిలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయల్, డీజీలు సంజయ్‌కుమార్ జైన్, విక్రమ్‌సింగ్ మాన్, ఐజీలు ఎం.రమేశ్, సుమతి, సుధీర్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి,సత్యనారాయణ, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.