- ఆత్మహత్యలు, రోడ్ యాక్సిడెంట్స్ మృతులు ఎక్కువే
- 1289 కేసులు నమోదు, రూ.8.44 కోట్ల సొత్తు నష్టం
- ఇప్పటికీ ఆచూకీ తెలియని 138 మంది పెద్దలు, 10 మంది పిల్లలు
- ఏడాదిలో డయల్100కు 61 వేలకు మించి ఫోన్‌కాల్స్
నిజామాబాద్, వెలుగు: జిల్లా పోలీస్ కమిషనరేట్పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య బాగా పెరిగింది. కొందరు పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు వివాదం రాజేయగా లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న 14 మంది ఆఫీసర్లకు ఫోకల్పోస్టింగ్లు ఇవ్వొద్దని ఏకంగా డీజీ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎలక్షన్ టైంలో సీపీగా బాధ్యతలు తీసుకున్న కల్మేశ్వర్ సింగనెవార్అక్టోబర్లో అనూహ్యంగా ట్రాన్స్ఫర్అయ్యారు.
అప్పటి నుంచి కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఇన్చార్జి సీపీగా వ్యవహరిస్తున్నారు. కొత్త పోలీస్‌బాస్ లేని లోటును స్పష్టంగా తెలుస్తోంది. నిరంతర అజమాయిషీలేక పోలీస్ వ్యవస్థ గాడితప్పగా, ప్రజల ఆస్తులకు రక్షణ కరువవుతోంది. కేసుల దర్యాప్తు లో స్పీడ్లేక బాధితులకు తక్షణ న్యాయం జరగడంలేదు.
ఆస్తి నష్టం కేసులు1,289
ఈ సంవత్సరం జిల్లాలో దొంగతనాలు, దోపిడీ, చైన్స్నానింగ్, వెహికల్స్చోరీ తదితర కేసులు 1,289 నమోదుకాగా రూ.8.44 కోట్ల విలువ సొత్తు ప్రజలు నష్టపోయారు. ఇందులో కేవలం 407 కేసులను శోధించి రూ.2.02 కోట్ల విలువ సొత్తును మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. రికవరీ 31 శాతానికే పరిమితమైంది. వైట్‌కాలర్ నేరాలు 742 నమోదు కాగా సైబర్ క్రైం కేసులు 376 రిజిష్టర్ అయ్యాయి. గత రెండేండ్ల కంటే కేసులు పెరిగాయి. అట్రాసిటీ కేసులు 101 నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది.
మహిళలపై అఘాయిత్యాలు
ఏడాది కాలంలో ఇప్పటి వరకు జిల్లాలో మహిళలపై 77 రేప్ ఘటనలు జరిగాయి. వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్తదితర కేసులు 593 రిజిస్ట్రర్ అయ్యాయి. బాలికలపై అత్యాచార సంఘటనలు 115 జరిగాయి. నిందితులపై పోక్సో కేసులు పెట్టి జైలుకు పంపారు. మొత్తం 42 హత్యలు జరుగగా, హత్యాయత్నం కేసులు 47, కిడ్నాప్ కేసులు 57, దాడులలో గాయపడిన కేసులు 1,185 నమోదయ్యాయి.
రోడ్ యాక్సిడెంట్స్‌లో 335 మృతి
ఈ ఏడాది జిల్లాలో 322 రోడ్ యాక్సిడెంట్లలో 335 మంది ప్రాణాలు కోల్పోగా, 509 రోడ్యాక్సిడెంట్స్లో 758 మంది గాయాలపాలయ్యారు. వీరిలో సుమారు 200 మంది ఇంకా బెడ్‌పైనే ఉన్నారు. ఆయా కారణాలతో 442 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 984 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 846 మందిని వెతికిపట్టుకున్నారు. ఇంకా 138 మంది జాడతెలియరాలేదు. 18 ఏండ్ల లోపు వారు 140 మిస్సింగ్కాగా 130 దొరికారు.
ఇంకా 10 మంది అడ్రస్ తెలియదు. జనవరి నుంచి ఇప్పటిదాకా రూ.1.35 కోట్ల విలువైన పీడీఎస్‌రైస్ నుపోలీసులు పట్టుకున్నారు. 34 మందిపై ఇసుక దొంగతనం కేసులు నమోదు చేశారు. పేకాట ఆడుతున్న 2,179 మందిని, మట్కాలో దొరికిన 111 మందికి ఊచలు లెక్కబెట్టించారు. 22 గంజాయి కేసుల్లో 58 మంది నిందితులు దొరకగా మొదటిసారి కొకైన్ ఆనవాళ్లు బయటపడ్డాయి.
డయల్100 చైతన్యం
ఆపద టైంలో డయల్100 ఫోన్‌చేయాలని ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఏడాదిలో మొత్తం 61,606 మంది ఫోన్‌చేసి పోలీసుల సేవలు పొందారు. నేరాలకు పాల్పడిన వారికి 15 కేసులలో కోర్టు శిక్షలు పడేలా దర్యాప్తు చేశారు. రోడ్ ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్, మూఢ నమ్మకాలు, మత్తు పదార్థాల వాడకంతో జరిగే అనర్థాలపై అవగాహన ప్రొగ్రామ్స్‌కు ఈసారి ప్రయారిటీ ఇచ్చారు. నేరాల శోధనకు ఉపయోగపడేలా 8,567 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఆపరేషన్ ముస్కాన్‌లో 139 మంది పిల్లలకు విముక్తి కల్పించారు.