నిర్మల్​ జిల్లాలో పెరిగిన నేరాలు..వార్షిక రిపోర్ట్​ విడుదల చేసిన ఎస్పీ

నిర్మల్​ జిల్లాలో పెరిగిన నేరాలు..వార్షిక రిపోర్ట్​ విడుదల చేసిన ఎస్పీ

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో ఈ ఏడాది నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగాయి. పోలీస్ శాఖ వాటిని నిరోధించేందుకు విస్తృతంగా సామాజిక కార్యకలాపాలు చేపడుతున్నా క్రైమ్స్​ ఆగడంలేదు. 2024కు సంబంధించి క్రైమ్ రేట్, రోడ్డు ప్రమాదాలు, సామాజిక కార్యకలాపాల వివరాలను ఎస్పీ జానకీ షర్మిల సోమవారం మీడియా సమావేశంలో వెల్లడిం చారు.

జిల్లాలో మొత్తం 3524 కేసులు నమోదు కాగా ఇందులో నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 559 కేసులు.. పెంబి పోలీస్ స్టేషన్ లో అత్యల్పంగా 75 కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో 16 మర్డర్ కేసులు, 10 దోపిడీ, 166 చోరీలు, 34 కిడ్నాప్, 39 రేప్ కేసులతోపాటు 40 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనట్లు ఎస్పీ చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 3606, రోడ్డు యాక్సిడెంట్లు 390, ఈ చలాన్ కేసులు 1,47,968 నమోదైనట్లు పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసుల్లో 133 మంది చనిపోగా 412 మంది గాయపడ్డారని తెలిపారు.

16 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని, అలాగే ఇద్దరిపై దాసియర్ క్రిమినల్ షీట్లు ఓపెన్ చేశామన్నారు. జిల్లాలో 49 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయన్నారు. సీఈఐఆర్ ద్వారా 1081ఫోన్లను బాధితులకు తిరిగి అప్పజెప్పామని తెలిపారు.  ఇదిలా ఉండగా యు బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ దందాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకొని విద్యార్థుల ఆత్మ హత్యల నివారణకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భరోసా కేంద్రం ద్వారా దాదాపు 100 కుటుంబాలను ఏకం చేశామన్నారు.