పాలిటిక్స్‌లో నేరచరితులు ఇంకెంతకాలం?

తొలి రెండు జనరల్ ఎలక్షన్స్‌‌లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మాత్రమే పోటీ చేశారు. వారినే గెలిపించారు. వారిలో ఎవరూ నేరచరితులు లేరు. కానీ, తర్వాత నుంచి జరిగిన ఎన్నికలలో రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం మందబలం, ఆర్థిక బలం ఉన్నవారి సాయం తీసుకోవడం మొదలుపెట్టారు. గత ఇరవయ్యేళ్ల నుంచి నేర చరిత్ర ఉన్న స్థానిక లీడర్లే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో ఉన్న ఎంపీలలో 18 నుంచి 20 శాతం నేరచరిత ఉన్నవారు ఉండగా, ప్రస్తుతం 42 శాతానికి పెరిగింది. దీనిపై ఆందోళన చెందిన సుప్రీం కోర్టు చాలా సందర్భాల్లో తీర్పులు చెప్పింది. సుమారు 15 ఏళ్ల క్రితం మొదటి తీర్పులో… అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్‌‌ను సమర్పించాలని ఆదేశించింది. అందులో ఆస్తులు, అప్పులతోపాటు తమపై ఉన్న కేసులను పేర్కొనాలని సూచించింది. దీంతో ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఆస్తితో పాటు కేసులు సైతం ప్రజలకు తెలుస్తుందని భావించింది. అంతేకాకుండా, నేరచరిత్ర ఉందని తెలిస్తే ప్రజలు అలాంటి అభ్యర్థికి ఓటు వేయరని అనుకుంది. ఈ అఫిడవిట్‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఢిల్లీలోని ఏడీఆర్ అనే సంస్థ, తెలంగాణలోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌‌ కృషి చేశాయి. నేరచరితుల వివరాలను ఎన్నికలకు 3, 4 రోజుల ముందే ప్రజలకు తెలియజెప్పింది. కానీ, ఓటర్లు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేటి రాజకీయాల్లో నేర చరిత్ర ఒక అంశంగా లేదు. కేవలం అభ్యర్థి కులం, మతం, స్థానికంగా పలుకుబడి, డబ్బు వీటిపైనే ఎన్నికలు జరుగుతున్నాయి.

2018లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాజకీయ నాయకులపై నమోదు చేసిన కేసులు సంవత్సరాల తరబడిగా న్యాయస్థానాల్లో తీర్పు లేకుండా మగ్గిపోతున్నాయని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. అలాగే ఢిల్లీలో ఒక అడ్వకేట్ ఇదే విషయంపై పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) వేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ… ‘ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల విచారణకు ప్రతి రాష్ట్రంలోనూ స్పెషల్​ కోర్టు ఏర్పాటు చేయాల’ని పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 18న నాంపల్లిలో స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసింది. దురదృష్టమేమిటంటే ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసులపై పోలీస్ ఎంక్వైరీ ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదు. నాంపల్లి స్పెషల్ కోర్టు ఇచ్చిన సమాచారం ప్రకారం 50 పోలీస్‌‌ స్టేషన్ల నుంచి సమాచారం అందాల్సి ఉంది. ఈ స్టేషన్ల పరిధిలో సరైన విచారణ జరిపి కేసును ముందుకు తీసుకెళ్లడం లేదు. అంటే, స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రిపై నమోదైన కేసును సరైన రీతిలో విచారణ జరిపి చార్జిషీటు ఫైల్ చేసి కోర్టులో సమర్పించే పరిస్థితి అక్కడి ఇన్​స్పెక్టర్లకు లేదు. లోకల్​ లీడర్లు ఈ కేసుల్ని తప్పుదారి పట్టించడమో, లేదా తొక్కిపెట్టడమో చేస్తున్నారు. ఈవాళ రాష్ట్రంలో సుమారు 300 కేసులు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్నా… వాటిలో విచారణ జరిపిన కేసుల్లో సరైన సాక్ష్యాల సేకరణలో తగిన శ్రద్ధ చూపించకపోవడంతో కేసులు కొట్టేస్తున్నారు. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి విచారించాలని, నేరచరిత్ర ఉన్నవారికి శిక్ష పడాలన్న సుప్రీంకోర్టు తీర్పు నీరుగారిపోతోంది. ఇదే కాకుండా, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ప్రభుత్వమే వాపస్ తీసుకుంటోంది.

సుప్రీంకోర్టు మూడో ఆర్డర్ 2019లో ఇచ్చింది. ఇందులో ఒక అభ్యర్థి తనపై ఉన్న కేసులను స్వచ్ఛందంగా ఒక లోకల్, ఒక నేషనల్ పత్రికలో రెండుసార్లు పబ్లిష్ చేయాలని చెప్పింది. పేపర్‌‌‌‌లో ఎక్కడో ఓ మూల కనీ కనబడకుండా పబ్లిష్​ చేయకూడదని చెబుతూ, కొన్ని పరామీటర్స్​ నిర్ణయించింది. ఇది అసలు అమలే కాలేదు.  రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడంతో బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ ఫిబ్రవరి 13న స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

‘అభ్యర్థి  తనపైగల నేరారోపణలను, నేరాలను స్వయంగా ప్రకటించనప్పుడు ఆ పనిని పార్టీలే చేయాలి. ఒక పార్టీ ఒక వ్యక్తికి టికెట్ఇచ్చినట్లయితే 48 గంటల్లోగా ఆ వ్యక్తిపై ఉన్న నేరాలను ఎలక్షన్ కమిషన్​కు తెలపాలి. నేరారోపణలున్న వ్యక్తికి టికెట్ ఎందుకిస్తున్నాం? ఎలాంటి కేసులు లేనివారు, మంచివారు ఉండగా వీరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటో చెప్పాలి’ అని స్పష్టంగా పేర్కొంది. ఇది రాజకీయ పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి. ఇండియాలో ప్రాంతీయ, జాతీయ పార్టీ ఏదైనా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నాయి. ఈ ప్రాసెస్​లో  మంచివాళ్లకు, నేరారోపణలు లేనివాళ్లకు స్థానం లేకుండా పోయింది. వచ్చే 4, 5 నెలల్లో జరిగే బిహార్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏ విధంగా అమల్లోకి వస్తాయి, దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తేలిపోనుంది.

లీడర్ల క్రిమినల్​ రికార్డులతో మొత్తం రాజకీయ వ్యవస్థే నేరమయమైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తోంది. దీనిని మార్చాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలి.  అది ఓకే అయితే… తీవ్ర నేరారోపణలుగల వ్యక్తులు పోటీకి అనర్హులు అవుతారు. అందువల్ల రాజకీయ నాయకులు ఈ సవరణలకు ఒప్పుకోకపోవచ్చు. ఏ వ్యక్తి కూడా తాను కూర్చున్న కొమ్మనే నరుక్కోడు కదా! ఏదేమైనా క్రిమినల్​ రికార్డు ఉన్నవాళ్లే అసెంబ్లీల్లో, పార్లమెంటులో కూర్చొని చట్టాలను చేయడమనేది విచారకర పరిస్థితి. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి. పొలిటికల్​ పార్టీలపై ఒత్తిడి వచ్చి చట్టానికి సవరణ జరిగినప్పుడే క్రిమినల్స్​ చట్టసభల్లోకి ప్రవేశించకుండా ఉంటారు. అలాగే, సుప్రీంకోర్టు ఎంతో చక్కగా తీర్పులిస్తున్నా అవి అమలుకాకపోవడం దురదృష్టకరం.

సెలక్షన్కి గీటురాళ్లేమిటో…?

‘గెలుస్తారనుకుంటే ఎవరికైనా టిక్కెట్లిచ్చేస్తారా? అదొక్కటే అర్హత కాదు గదా! క్రిమినల్​ రికార్డున్నవాళ్లకు టికెట్లివ్వడానికి కారణాలేమిటో చెప్పాల్సిందే’ అని సుప్రీం కోర్టు అన్ని పార్టీల్ని ఆదేశించింది. దీనిని పాటించకపోతే కోర్టు ధిక్కారంగా భావిస్తామనికూడా హెచ్చరించింది. సుప్రీం గతంలో ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోవడం లేదని బీజేపీ లీడర్​ అశ్విని ఉపాధ్యాయ్​ వేసిన పిటిషన్​పై జస్టిస్​ రోహింటన్​ ఫాలీ నారిమన్​, జస్టిస్​ ఎస్​.రవీంద్ర భట్​ల బెంచ్​ తీవ్రంగా స్పందించింది. ఈ కింది డిటైల్స్​ అన్నీ పొలిటికల్​ పార్టీల సోషల్​ మీడియా సైట్లలో ఉండాలని స్పష్టం చేసింది.

కేండిడేట్ల విద్యార్హతలతోపాటు వాళ్ల క్రిమినల్​ హిస్టరీ

కోర్టుల్లో చార్జిషీటు దాఖలైతే, వాటి వివరాలు ప్రత్యేకంగా చెప్పాలి

నేర చరితుల ఎంపికకుగల కారణాలు తెలపాలి

క్రైమ్​ హిస్టరీ లేనివాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించాలి

గెలవడం ఒక్కటే అర్హతగా చూడకూడదు

అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా గానీ, లేదా నామినేషన్​ వేయడానికి ముందుగాగానీ  కేండిడేట్​ వివరాల్ని వెల్లడించాలి

ఈసీకి 72 గంటల్లోగా కేండిడేట్ల వివరాలను అందించాలి

ఈ ఆదేశాలు అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలకు వర్తిస్తాయి

ఏ పార్టీ అయినా ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం

– ఎం. పద్మనాభరెడ్డి, ఐఎఫ్‌‌ఎస్ (రిటైర్డ్) సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నె న్స్​02