పాడి కౌశిక్​రెడ్డిపై క్రిమినల్​ కేసు

పాడి కౌశిక్​రెడ్డిపై క్రిమినల్​ కేసు
  • కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్​ జడ్పీ సీఈవో ఫిర్యాదు
  • భారతీయ న్యాయ సంహిత యాక్ట్​ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్
  • జడ్పీ సీఈవోపై సీపీకి ఎమ్మెల్యే ఫిర్యాదు

కరీంనగర్, వెలుగు: కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజూరాబాద్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై క్రిమినల్​ కేసు ఫైల్​ అయింది. దేశంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్​ఎస్​) యాక్ట్​ కింద ఎఫ్​ఐఆర్ నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయన. మంగళవారం కరీంనగర్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారంటూ జడ్పీ సీఈవో శ్రీనివాస్​ అదే రోజు రాత్రి కరీంనగర్ వన్​టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్​ఎస్​) యాక్ట్​ సెక్షన్ 221, 126(2) కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పాడి కౌశిక్​రెడ్డి బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో వెళ్లి కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి జడ్పీ సీఈవో శ్రీనివాస్​పై ఫిర్యాదు చేశారు. నిరుపేదల చదువు, దళిత బంధు కోసం తాను జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తుంటే తన విధులకు ఆటంకం కలిగించారని, ప్రొటోకాల్ ఉల్లంఘించారని, ఇందుకు సీఈవో శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలన్నారు. 

దారికి అడ్డంగా కూర్చొని!

ఇటీవల హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో స్కూల్ ఎడ్యుకేషన్​పై ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి నిర్వహించిన సమీక్షకు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎంఈవోలు కె.నర్సింహారెడ్డి, వి. శ్రీనివాస్ హాజరయ్యారు. దీంతో డీఈవో వారికి నోటీసులు ఇచ్చారు. వారు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని డీఈవో.. వాళ్లను సొంత స్కూళ్లకు పీజీ హెచ్ఎంలుగా రీటెయిన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

దీంతో తన సమావేశానికి హాజరైన ఎంఈవోలను తొలగించినందుకు డీఈవోను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ మంగళవారం జెడ్పీ సమావేశంలో కలెక్టర్‌‌‌‌ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు కూడా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. జడ్పీ మీటింగ్‌‌‌‌ గందరగోళంగా మారడంతో కలెక్టర్‌‌‌‌ సమావేశం మధ్యలోనే వెళ్లిపోతుండగా.. పాడి కౌశిక్​రెడ్డితోపాటు బీఆర్​ఎస్​ సభ్యులు దారికి అడ్డంగా కూర్చుని అడ్డుకున్నారు. 

ఇదే విషయమై జడ్పీ సీఈవో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మూడు కొత్త చట్టాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. అందులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్​ఎస్​) ఒకటి. బీఎన్​ఎస్​ అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యే పాడికౌశిక్​రెడ్డిపై కేసు నమోదు కాగా.. ఆ యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. 

దిష్టిబొమ్మ దహనం

తనను పరుష పదజాలంతో దూషించడమే గాక, అంతు చూస్తానని, ఎన్నటికన్న చంపుతానని బెదిరించారంటూ కౌశిక్ రెడ్డిపై చిగురుమామిడి జెడ్పీటీసీ మెంబర్​ గీకురు రవీందర్ ముదిరాజ్ కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ కు ఫిర్యాదు చేశారు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  రవీందర్​ ముదిరాజ్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

కరీంనగర్ ప్రెస్ భవన్ లో వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి చట్టసభల మీద, పార్లమెంటరీ విధానం మీద అవగాహన లేక చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలు, బీసీలంటే కౌశిక్ రెడ్డికి చులకన భావమని ఫైర్​ అయ్యారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.