తెలంగాణలో అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్‌‌‌‌‌‌‌‌
  •  ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలతో బేంబేలు
  •  ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు 
  •  పరారీలో ఆ ముగ్గురు 
  •  బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు అవినీతి ఆఫీసర్లు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్‌‌‌‌‌‌‌‌ మొదలైంది. ఏసీబీ, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల దూకుడుతో బేంబేలెత్తుతున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు పెడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఆఫీసర్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు కాగా, వారంతా పరారీలో ఉన్నారు. కొందరు అవినీతి ఉద్యోగులు సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తుండగా,  మరికొందరు ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. 

అవినీతి ఉద్యోగుల్లో బుగులు

 జిల్లాలో గత రెండు, మూడు నెలలుగా వరుసగా అవినీతి ఉద్యోగులపై విజిలెన్స్ ఏసీబీ దాడులు చేస్తూ క్రిమినల్ కేసులు పెడుతుండడంతో ఉద్యోగుల్లో బుగులు మొదలైంది. జిల్లాలోని బల్దియా టౌన్ ప్లానింగ్, శానిటేషన్ ఆడిట్ లెక్కల్లో అవకతవకలు బయటపడుతుండడంతో నేరుగా విజిలెన్స్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల ఏకంగా జగిత్యాల బల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే కేసు నమోదు కావడం సదరు ఆఫీసర్ పరారీ లో ఉండడం తీవ్ర చర్చకు దారితీసింది.

రెవెన్యూ శాఖలో పట్టా చేయిస్తానని చెప్పి రూ.ఆరు లక్షలు వసూల్ చేసిన ఘటనలో శానిటేషన్ సెక్షన్ ఆఫీసర్ పరారై కోర్టును ఆశ్రయించాడు. అలాగే పోలీస్ శాఖ లో ఏసీబీ దాడుల్లో ఓ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ గోడ దూకి పరార్ కాగా ఏసీబీ డీఎస్పీ కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్, ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరు సిబ్బంది నెల వారీగా రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ పేకాట నిర్వాహకులకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉన్న పేకాట అడ్డాలను తాత్కాలికంగా శివారు ప్రాంతాలకు మార్చినట్లు వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

ఇటీవల జగిత్యాల రెవెన్యూ డివిజన్ లోని ఓ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే ఎస్సై రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే లంచం డబ్బును చెత్తబుట్టలో పడేసి పారిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఆధికారికంగా ధ్రువీకరించలేదు.
జూన్ 10న జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అక్రమార్కులకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, ఆర్వో ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆర్వో ప్రసాద్ తో పాటు మరో ఇద్దరిని రిమాండ్ చేశారు. ఈ కేసులో కమిషనర్ అనిల్ బాబు పరార్ కాగా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. 

మెట్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన కుంబాల గణేశ్​ పేరుపై పట్టా చేయిస్తామని రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేసిన వ్యవహారంలో బల్దియా శానిటేషన్ ఆఫీసర్ మారుతితో పాటు మరో ఐదుగురిపై మెట్‌‌‌‌‌‌‌‌పల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. దీంతో ఆయన లీవు పెట్టి మరీ పరార్ అయ్యాడు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 
కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏసీబీ దాడులు జరగడంతో జిల్లాలోని ఓ సబ్ రిజిస్టర్ రెండు వారాలకు పైగా సెలవులో వెళ్లడం తీవ్ర చర్చ నడిచింది. తీవ్ర అవినీతి అరోపణలు ఉన్న సదరు సబ్ రిజిస్టర్ అక్రమంగా సంపాదించిన సొమ్మును మాయం చేసేందుకే సెలవు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైటెన్షన్ లో ఉన్న సదరు ఉద్యోగి కొన్ని రోజులు అక్రమ దందాను తాత్కలికంగా నిలిపివేసినట్లు రైటర్ల ద్వారా వినిపిస్తోంది.   

సస్పెండ్ కావొద్దనే.. 

అవినీతి ఆఫీసర్ల కేసుల్లో సస్పెండ్‌‌‌‌‌‌‌‌కు గురవుతామనే ఆఫీసర్లు పరార్ అవుతున్నట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం కేసు నమోదైన ఆఫీసర్ 48 గంటలు జైలు శిక్ష అనుభవించినట్లయితే సస్పెండ్​ అవుతాడు. ఈ క్రమంలో అరెస్టయి జైల్ కు వెళ్లకుండా ముందస్తుగా పరార్ అవుతూ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 

గత నెల 11న  రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఇసుక అక్రమ రవాణా కేసులో స్టేషన్ బెయిల్ కోసం ఎస్‌‌‌‌‌‌‌‌ఐ రూ. 50 వేలు లంచం డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ మేరకు రాజేందర్​రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి రాకను పసిగట్టిన సదరు ఎస్‌‌‌‌‌‌‌‌ఐ పోలీస్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి గోడ దూకి పరారయ్యాడు. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు.