- జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం
- ఎలక్షన్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారుల రిక్వెస్టులు
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల విధుల శిక్షణకు డుమ్మా కొడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ నిర్ణయించారు. ఈ నెల 1, 2 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులకు వందల మంది సిబ్బంది గైర్హాజరయ్యారు. వారందరికీ 6న మరోసారి శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించినా ఎవరూ స్పందించలేదు. డుమ్మా కొట్టిన వారిలో 1,773 మంది పీఓ, ఏపీఓలు, 2,037 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. శిక్షణకు హాజరుకాకపోతే ఎన్నికల విధులపై అవగాహన ఉండదు. దీంతోనే కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా తమకు మినహాయింపు ఇవ్వాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ చాంబర్ చుట్టూ ఎన్నికల డ్యూటీలు పడినవారు చక్కర్లు కొడుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో బల్దియా హెడ్డాఫీసుకు వస్తున్నారు.
ఆరోగ్యం బాగోలేదని కొందరు, ఇంట్లో వారి హెల్త్కండిషన్ బాగోలేదని ఇంకొందరు, ఎన్నికల టైంలో పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నాయంటూ మరికొందరు రిక్వెస్ట్చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఇలాగే వందల మంది ఎన్నికల శిక్షణకు, డ్యూటీకి డుమ్మా కొట్టారు. ఉన్నతాధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదు. మ్యాన్పవర్షార్టేజ్కారణంగా డ్యూటీకి హాజరైన సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి డుమ్మా కొట్టే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలతోపాటు కంటోన్మెట్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు పోలింగ్ ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు(ఏపీఓ) 11వేల మంది, మరో 11వేల మంది ఇతర సిబ్బంది అవసరం ఉంటుంది. వీరికి నెల రోజుల ముందు నుంచే ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
100 శాతం ఓటింగ్ నమోదు కావాలి
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రోనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం చార్మినార్లోని మక్కా మసీదులో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ... లోక్సభ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలన్నారు. వంద శాతం ఓటింగ్స్వీప్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. మసీదు ఆవరణలో మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా ఓటరు నమోదుకు ఫారం -6, ఇల్లు మారినట్లయితే ఫారం -8 తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలన్నారు. 15 వరకు నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, స్వీప్ నోడల్ అధికారులు అరుణకుమారి, యుగెంధర్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకన్న నాయక్, డిప్యూటీ కమిషనర్ సరిత పాల్గొన్నారు.
బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను అరికట్టాలి
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలు, నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదేనని కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. సోమవారం హెడ్డాఫీసులో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టీఎస్ బీపాస్ లో అప్లికేషన్పెట్టుకున్న 21 రోజుల్లో బిల్డింగులకు పర్మిషన్లు అప్రూవ్చేయడమో.. రిజెక్ట్చేయడమో చేయాలని చెప్పారు. గ్రీవెన్స్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి సర్కిల్ నుంచి 10 జంక్షన్లకు సంభందించిన ప్రాపర్ ప్లాన్స్ సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. న్యాక్ ఇంజనీర్లు అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని చెప్పారు. చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ సీసీపీలు, సీపీలు, ఏసీపీలు, న్యాక్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.