- కులగణనను ప్రజలు వినియోగించుకోవాలి: నిరంజన్
- కరీంనగర్ కలెక్టరేట్లో బహిరంగ విచారణ
- బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్రూపుల్లో కులాల చేర్పుపై 213 వినతులు
కరీంనగర్, వెలుగు : ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. కులగణన అనేది ఓ బృహత్తర కార్యక్రమమని ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని కోరారు. జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామని, అది నిరూపించుకునేందుకే ఈ సర్వే కీలకమని స్పష్టం చేశారు. సర్వేలో తప్పు జరిగి బీసీల శాతం అటు ఇటైతే బాధ్యత తమది కాదని, ప్రజలది, కులసంఘాలదేనని ఆయన హెచ్చరించారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం కరీంనగర్ కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ విచారణకు ఆయన హాజరయ్యారు. వివిధ కుల సంఘాల నాయకులు ఇచ్చిన వినతిపత్రాలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 99, జగిత్యాల నుంచి 29, పెద్దపల్లి నుంచి 32, సిరిసిల్ల జిల్లా నుంచి 53 చొప్పున మొత్తంగా 213 వినతిపత్రాలు కమిషన్ కు అందాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలో రిజర్వేషన్ల పెంపు కోసం ప్రత్యేక కమిషన్ వేయాలని హైకోర్టు చెప్పిన తర్వాత తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు.
సమావేశం తర్వాత నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ కులగణనతో అన్ని కులాల లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తేలుతాయని అన్నారు. దీనికి ప్రజల సహకారం కీలకమని తెలిపారు. ఈ విషయా న్ని ఎవరూ రాజకీయం చేయవద్దని, అపోహలు, ఆటంకాలు సృష్టించడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, రాపోలు జయప్రకాశ్, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.