హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. సూదిని సృజన్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్-2 కాంట్రాక్ట్ టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ సంస్థతో తనను లింక్ చేస్తూ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. అమృత్-2కు పారదర్శకంగానే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన బావమరిది సూదిని పై ఇటీవల కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న ‘అమృత్’ పథకంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. సృజన్‌రెడ్డికి చెందిన శోధా కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌కు అర్హతలు లేకపోయినా అమృత్ స్కీమ్‌లో రూ.1137కోట్ల పనులను కట్టబెట్టారని విమర్శించారు.
గత ఏడాది కేవలం రెండు కోట్ల లాభాలు సాధించిన కంపెనీకి వెయ్యి కోట్లకుపై పనులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బావమరిది కళ్లలో సంతోషం చూడడం కోసం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు తెరలేపారని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సైతం కేటీఆర్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ తమపై చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.