- అఫ్గాన్‌లో సంక్షోభం ఎఫెక్ట్.. తగ్గిన సరఫరా
- పిస్తా, అంజీర్, కుబానీ, వాల్ నట్స్ రేట్లు పెరిగినయ్
- అమెరికాలో బాదం షార్టేజ్.. డబులైన ధర
హైదరాబాద్, వెలుగు: డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగాయి. అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభంతో అక్కడి నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. అమెరికా నుంచి బాదం కూడా సప్లై తగ్గింది. దీంతో షాజీరా, పిస్తా, అంజీర్, కుబానీ, వాల్ నట్స్, బాదం రేట్లను వ్యాపారులు పెంచేస్తున్నారు. బాదం రేట్లు ఏకంగా డబుల్ అయ్యాయి. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటి ఎఫెక్ట్ స్వీట్లు, బిర్యానీ ధరలపై పడనున్నాయి. కరోనాతో ఏడాదిన్నరగా ఇమ్యూనిటీ కోసం జనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ డిమాండ్‌కు తగ్గట్లుగా దిగుమతులు లేవు. అఫ్గాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశం నుంచి వచ్చే షాజీరా సరఫరా తగ్గిపోయింది. హైదరాబాద్ దమ్ బిర్యానీలో దీని వినియోగం కీలకం. కొన్ని రకాల వెజ్ బిర్యానీలు, మండి బిర్యానీలో డ్రైఫ్రూట్స్ ఉపయోగిస్తారు. పిస్తా, అంజీర్, కుబానీ, వాల్ నట్స్, షాజీరా అఫ్గానిస్తాన్ నుంచే దిగుమతి అవుతాయి. ఇప్పుడు షార్టేజ్ రావడంతో వీటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఆంధ్ర నుంచి దిగుమతి అయ్యే కాజూ కొరత లేకున్నా వాటి ధర కూడా కొందరు వ్యాపారులు పెంచుతున్నారు.
అమెరికాలో పంట తగ్గి..
అమెరికాలో దిగుబడి తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి దిగుమతి అయ్యే బాదం 50 శాతానికిపైగా తగ్గింది. దీంతో వాటి రేట్లు డబుల్ అయ్యాయి. గతంలో రూ.500 నుంచి రూ.600 వరకు కిలో ఉండగా, ప్రస్తుతం రూ.1,100 నుంచి1,200కు కిలోకు పెరిగాయి. రెండు కొన్ని నెలల కిందటి దాకా అమెరికా నుంచి 250 కంటైనర్ల బాదం దిగుమతి అయ్యేది. ఒక్కో కంటైనర్‌లో 30 టన్నుల నుంచి 35 టన్నుల బాదం ఉంటుంది. కానీ ప్రస్తుతం 100 కంటైనర్లు కూడా రావడం లేదు. అమెరికాలో బాదం సాగు తగ్గిందని, అందుకే దిగుమతులు తగ్గాయని వ్యాపారుల చెబుతున్నారు. దిగుమతులు పెరిగితే రేట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
స్వీట్లు, బిర్యానీ రేట్లు కూడా..
డ్రైఫ్రూట్స్, మాసాల రేట్లు పెరగడంతో ఆ ఎఫెక్ట్ స్వీట్లు, బిర్యానీ రేట్లపై పడుతోంది. చాలా రకాల స్వీట్లను డ్రైఫ్రూట్స్ తోనే తయారు చేస్తారు. మసాలాలతోపాటు డ్రైఫ్రూట్స్ కూడా బిర్యానీల్లో వినియోగిస్తున్నారు. దీంతో స్వీట్లు, బిర్యానీ రేట్లు పెంచేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. డ్రైఫ్రూట్స్, షాజీరా మాసాలా రేట్లు ఇలాగే ఉంటే హండిపై రూ.50, ఫ్యామిలీ, జంబోప్యాక్ బిర్యానీలపై రూ.100 వరకు పెంచే చాన్స్ ఉందని చెప్తున్నారు.
దిగుమతులు తగ్గడంతోనే
గతేడాది నుంచి డ్రై ఫ్రూట్స్ వాడకం చాలా పెరిగింది. అయితే ఇప్పుడు అఫ్గాన్ నుంచి వాటి దిగుమతులు తగ్గడంతో రేట్లు పెరిగాయి. సరఫరా పెరిగే దాకా రేట్లు ఇలాగే ఉండే అవకాశం ఉంది. – విజయ్‌కుమార్, వ్యాపారి, బేగంబజార్
బిర్యానీ రేట్లు పెంచుతం
దమ్ బిర్యానీతో పాటు కొన్ని రకాల బిర్యానీల్లో ఉపయోగించే మాసాలా, డ్రై ఫ్రూట్స్ ధరలు చాలా పెరిగాయి. ఇవి తగ్గకపోతే బిర్యానీ రేట్లు పెంచాలని అనుకుంటున్నం. ఈ నెలాఖరు వరకు చూసి వచ్చేనెల నుంచి బిర్యానీ రేట్లు పెంచుతం. కష్టమర్లు ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లకు వస్తున్నారు. రేట్లు పెంచితే వ్యాపారంపై ఎఫెక్ట్ పడుతుందని ఆలోచిస్తున్నం.
-మహిశ్ ఖాన్, ఆదాబ్ రెస్టారెంట్