- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు
- జవహర్ నగర్ మేయర్, వికారాబాద్, తాండూరు,పెద్ద అంబర్‌పేట్ చైర్ పర్సన్లపై నోటీసులు
జవహర్‌నగర్/ఎల్‌బీనగర్/వికారాబాద్, వెలుగు: మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టొద్దని మంత్రి కేటీఆర్ ఆదేశించినప్పటికీ.. సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పట్టించుకుంటలేరు. జవహర్ నగర్ మేయర్‌తో పాటు వికారాబాద్, తాండూరు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాసం ప్రకటించారు. పెద్ద అంబర్‌పేటలో వైస్ చైర్ పర్సన్‌పైనా అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. అవిశ్వాసాలు వద్దన్న కేటీఆర్ ఆదేశాలను జవహర్‌నగర్ కార్పొరేటర్లకు మంత్రి మల్లారెడ్డి చేరవేసినా కార్పొరేటర్లు పట్టించుకోలేదు. మేయర్ మేకల కావ్యపై తమకు విశ్వాసం లేదని 20 మంది కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్‌ను శనివారం కలిశారు. ఈ కార్పొరేషన్‌లో 28 డివిజన్‌లు ఉండగా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. జవహర్ నగర్‌లో మేయర్ కావ్య తండ్రి అయ్యప్ప, అన్న భార్గవ్‌రామ్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కార్పొరేటర్లు కలిశారు. ఈ మేయర్ తమకు వద్దంటూ అడ్వొకేట్ ద్వారా అవిశ్వాస తీర్మానం అందజేశారు. కావ్యను పదవిలోంచి దించి 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నాల్లో అసమ్మతి కార్పొరేటర్లు ఉన్నారని తెలిసింది.
పెద్ద అంబర్‌పేట్‌లో ఇద్దరిపై..
పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణపై బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో నోటీసు అందజేశారు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులుండగా 15 మంది అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నా పార్టీలో వర్గ విభేదాలతో బీఆర్‌ఎస్ అభ్యర్థి చైర్ పర్సన్, కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్ పర్సన్ పోస్టులు దక్కించుకున్నారు. వారిద్దరి వ్యవహారశైలిపై కోపంతో ఉన్న మెజార్టీ కౌన్సిలర్లు వారిని పదవి నుంచి దించేందుకు సిద్ధమయ్యారు. వైస్ చైర్ పర్సన్ కాంగ్రెస్ నుంచే ఉండగా ఆమెపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజులను పదవి నుంచి దించాలని కోరుతూ 20 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు శనివారం వికారాబాద్ కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వికారాబాద్‌లో 33 వార్డులుండగా బీఆర్‌ఎస్ నుంచి 24 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు కౌన్సిలర్ గా గెలిచారు. చైర్ పర్సన్ ఎన్నిక సమయంలో మొదటి రెండున్నరేండ్లు మంజుల, తర్వాతి రెండున్నరేండ్లు లంక పుష్పలత రెడ్డి పదవి పంచుకో వాలని ఒప్పందం చేసుకున్నారు. కాల పరిమితి ముగిసినా పదవి నుంచి దిగేందుకు మంజుల ససేమిరా అనడంతో అవిశ్వాసం పెట్టారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే పదవి పంచుకోవాలని నిర్ణయించామని, దానికి విరుద్ధంగా చైర్ పర్సన్ వ్యవహరిస్తుండటంతోనే అవిశ్వాసం పెట్టామని కౌన్సిలర్లు తెలిపారు.
తాండూర్‌లో..
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నపై వైస్ చైర్ పర్సన్ పటోళ్ల దీప, మరో 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నోటీసు అందజేశారు. తాండూరులో 36 వార్డులుండగా బీఆర్‌ఎస్ నుంచి 26, ఎంఐఎం నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ, టీజేఎస్ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. చైర్ పర్సన్‌పై పది మంది సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఇంకో ఆరుగురు అవిశ్వాసం ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత స్వప్న, దీప ఇద్దరు చైర్ పర్సన్ పదవికి పోటీ పడ్డారు. పదవిని ఇద్దరు చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసేందుకు స్వప్న ససేమిరా అనడంతో దీపతో పాటు మరికొందరు కలిసి అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసం పెట్టేందుకు తమకు 24 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని వైస్ చైర్ పర్సన్ దీప తెలిపారు.