
- తలసేమియా, సికిల్‌సెల్ బాధితుల అవస్థలు
- నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం
- అందుబాటులో ఉన్నవి 195 మాత్రమే
- నెగెటివ్ గ్రూపుల బ్లడ్ కోసం తీవ్ర ఇబ్బందులు
- బ్లడ్ డొనేషన్‌కు ముందుకు రావాలని వేడుకోలు
మంచిర్యాల, వెలుగు: తలసేమియా, సికిల్‌సెల్ బాధితులు, యాక్సిడెంట్లలో గాయపడ్డవారు, డయాలసిస్ పేషెంట్లు, గర్భిణులు, బాలింతలకు ఎమర్జెన్సీ టైమ్‌లో రక్తం అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొన్నది. మంచిర్యాల గవర్నమెంట్జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లోని ఇండియన్ రెడ్‌క్రాస్(ఐఆర్ సీఎస్) బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. పాజిటివ్ గ్రూప్ రక్తం అరకొరగా అందుబాటులో ఉన్నప్పటికీ.. నెగెటివ్ గ్రూప్ బ్లడ్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రకాలు కలిపి195 యూనిట్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇవి కూడా నాలుగైదు రోజులకే సరిపోనున్నాయి. ఇటీవల బ్లడ్ డొనేషన్ క్యాంపులు లేకపోవడం, స్వచ్ఛంద రక్తదాతలు సైతం ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు
పేర్కొంటున్నారు.
నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం
రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా, సికిల్సెల్బాధిత పిల్లలతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లు, ఎంసీహెచ్‌లో చికిత్స పొందుతున్న గర్బిణులు, బాలింతలు, డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని ఫ్రీగా అందజేస్తున్నారు. వీరికి రోజుకు 30 నుంచి 40 యూనిట్ల చొప్పున నెలకు వెయ్యి యూనిట్లకు పైగా వివిధ గ్రూపుల బ్లడ్అవసరం అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 2వేల మంది తలసేమియా, సికిల్ సెల్ బాధితులున్నారు. ఇందులో 832 మందికి మంచిర్యాల బ్లడ్‌బ్యాంక్ ద్వారా రక్తం అందిస్తున్నారు. తలసేమియా బాధితులకు నెలకు రెండుసార్లు, సికిల్‌సెల్ వారికి మూడు నెలలకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీరికి టైమ్‌కు రక్తం అందుబాటులో లేకపోవంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు
ప్రైవేట్బ్లడ్ బ్యాంకుల్లో ఒక్కసారి రక్తం ఎక్కించుకోవాలంటే రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చవుతుంది. అసలే పేద కుటుంబాలు కావడంతో ఆర్థిక స్తోమత లేక బాధితులు అవస్థలు పడుతున్నారు. అలాగే జీజీహెచ్‌కు వచ్చే యాక్సిడెంట్బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, ఎంసీహెచ్‌లోని పేషెంట్లకు ఎమర్జెన్సీగా రక్తం అవసరమైతే ప్రైవేట్బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్కడ కూడా పేషెంట్ల తరఫున డోనర్స్ బ్లడ్ డొనేట్ చేస్తేనే వారికి అవసరమైన రక్తం అందిస్తున్నారు.
డొనేషన్కోసం విజ్ఞప్తులు
సాధారణంగా విద్యాసంస్థలు, ఎన్జీవోలు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి రక్తం సేకరిస్తుంటారు. ప్రస్తుతం
ఎగ్జామ్స్ సీజన్ కావడంతో విద్యాసంస్థలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఎండలు ముదరడం వల్ల ఆయా సంఘాలు, యూనియన్లు సైతం క్యాంపుల
నిర్వహణకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎమర్జెన్సీ టైమ్‌లో స్వచ్ఛంద రక్తదాతలు కరుణించి ఒకటి రెండు యూనిట్లు ఇస్తే వాటిని పేషెంట్లకు అందిస్తు న్నారు. ఈక్రమంలో ఎన్జీవోలు, వివిధ యూనియన్లు స్పందించి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి
మంచిర్యాల రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు ఉచితంగా రక్తం అందిస్తున్నాం. ప్రస్తుతం రక్త నిల్వలు నిండుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా కలెక్టర్, డీసీపీ, సింగరేణి ఉన్నతాధికారులు, ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్పందించి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా బాధిత చిన్నారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నాం.
కాసర్ల శ్రీనివాస్, స్టేట్వైస్ ప్రెసిడెంట్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ