భద్రాద్రికొత్తగూడెం, వెలుగు జిల్లా కేంద్రంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వస్తున్నాయి. కొందరు ధనవంతులు అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలకు ఆఫీసర్లు వత్తాసు పలుకుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. పేదోళ్లు నిర్మించుకునే ఇండ్లను మాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్చేవేస్తున్నారు. దీంతో ‘పేదోళ్లకో తీరు.. ధనవంతులకో తీరు’ అన్నట్లు ఆఫీసర్లు వ్యవహరిస్తురని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
నోటీసులతోనే సరి..
జిల్లా కేంద్రంలోని బూడిదగడ్డ ఏరియాలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల పేరుతో పలు ఇండ్లను ఆఫీసర్లు గత సోమవారం ఆఫీసర్లు కూల్చేశారు. ‘ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటే తమకు చెప్పకుండా జేసీబీలతో కూల్చివేయడమేంటని’ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లను ఎంత వేడుకున్నా కనికరం లేకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలోని తహసీల్దార్, మున్సిపల్ఆఫీసులకు కూత వేటు దూరంలో అనుమతులు లేకుండా కడుతున్న మూడంతస్తుల బిల్డింగ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అనుమతులు లేని నిర్మాణాలంటూ పెట్టిన ఫ్లెక్సీని తీసేసి ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని గణేశ్టెంపుల్ఏరియాలో ఓ వ్యాపారి అక్రమ నిర్మాణాలను పూర్తి చేశారు. నిత్యం ఈ బిల్డింగ్పక్క నుంచే మున్సిపల్ కమిషనర్‌తోపాటు ఆఫీసర్లంతా రాకపోకలు సాగిస్తున్నా.. పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని త్రీటౌన్పొలీస్ స్టేషన్వెళ్లే దారిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు సాగుతున్నా, మున్సిపల్ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
టాస్క్ ఫోర్స్ గుర్తించినా...
కొత్తగూడెంతోపాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో దాదాపు 60 నుంచి 100 వరకు అక్రమ నిర్మాణాలను టాస్క్ ఫోర్స్ గుర్తించింది. ఏడాది దాటినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. కొత్తగూడెంలోనే దాదాపు 20 నుంచి 40 వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో మెయిన్‌రోడ్డు పక్కనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నా ఆఫీసర్లు చూడకపోవడంలో ఆంతర్యమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదికలిచ్చాం.. వారే చర్యలు తీసుకోవాలి.. మేమేం చేస్తాం’.. అంటూ కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. అటు మున్సిపల్ఇటు పంచాయతీల నుంచి అనుమతులు లేకుండా సాగుతున్న నిర్మాణాలపై ఉక్కు పాదం మోపాలని పలు మీటింగ్‌లలో కలెక్టర్ఆదేశించినా ఫలితం లేకుండా పోతోంది.