- = మరో మారు తెరపైకి గత సర్కారు విధానాలు
- = ఫార్ములా ఈ రేస్ రద్దు వెనుక కారణమేంటి
- = వసతుల కోసం రూ. 200 కోట్లు అవసరం
- = దుబారా ఎందుకని కాంగ్రెస్ సర్కారు విముఖత
- = తిరోగమనం అంటున్న మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు గత సర్కారు ఆడంబరాలు ఒక్కొక్కటీ విమర్శలకు తావిస్తున్నాయి. గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. పెట్టుబడులను రాబట్టే వ్యూహం పేరుతో గత సర్కారు హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది.
ఈ ఏడాది పోటీలు నిర్వహించేందుకు గత ప్రభుత్వం నిర్వాహకులతో అగ్రిమెంట్ చేసుకుంది. ఫిబ్రవరి 10న రేసింగ్ జరగాల్సి ఉండగా..రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని వివరించారు.
రేసు రద్దు కావడంపై ఫార్ములా-ఈ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో స్పందించారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారని... రేసు రద్దు కావడం బాధాకరమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం కార్ రేసింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
ఫార్ములా ఈ-ఫ్రిక్స్ కార్ రేస్ ట్రాక్, రేసింగ్ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్, క్యాంపెయిన్, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు వసతుల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే ప్రభుత్వం వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది.