మీరు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు.. ఇక్కడ నీతి రెండు రకాలు..!

మీరు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు.. ఇక్కడ నీతి రెండు రకాలు..!

నాడు కేటీఆర్ ఫాంహౌస్​పై రేవంత్ డ్రోన్ ఎగిరేస్తే కేసు పెట్టి జైలుకు పంపొచ్చు. కానీ, నేడు మేడిగడ్డ బ్యారేజీ మీద కేటీఆర్ డ్రోన్ ఎగిరేస్తే ‘అందులో తప్పేముంది?’ అంటూ బుకాయించొచ్చు!  బీఆర్ఎస్ హయాంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్​, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని వచ్చినవాళ్లకు మంత్రి పదవులు ఇస్తే అది రాజధర్మం. 

అదే పని కాంగ్రెస్​చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం! గడిచిన 25 ఏళ్లలో కంచె గచ్చిబౌలిలో హెచ్​సీయూకి చెందిన 700 ఎకరాల భూములను ఆక్రమించి, ఐఎస్  బీ, స్టేడియం, ఐఐఐటీ లాంటి ప్రభుత్వ నిర్మాణాలతోపాటు  ప్రైవేట్​  రెసిడెన్షియల్​ అపార్టుమెంట్లు, బిల్డింగ్​లు కట్టినా ఇంతకాలం ఎవరికీ  పర్యావరణం, వన్యప్రాణులు గుర్తుకురాలేదు. 

ఎలాంటి ఆందోళనలూ జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వెయ్యి ఎకరాలను సుమారు రూ.30వేల కోట్లకు అడ్డంగా అమ్మినప్పుడు, జీవో 111 రద్దు చేసి జంట జలాశయాల ఊపిరి తీయాలనుకున్నప్పుడు, వేల ఎకరాల్లో పచ్చదనాన్ని హరించి, కాంక్రీట్ జంగిల్లా మార్చాలనుకున్నప్పుడు ఏ ఒక్కరూ కిమ్మనలేదు. కానీ,  కోర్టులో న్యాయంగా గెల్చిన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్​ సర్కారుపై మాత్రం వ్యతిరేకత వచ్చింది.

కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు పరుగెత్తుతున్న గ్రాఫిక్ నెమళ్లు, జింక పిల్లలను  చూసిన సామాన్యులే కాదు, ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివే అని తీర్పు ఇచ్చిన కోర్టు సైతం అదే ప్రభుత్వంపై కన్నెర్ర చేయడం యాదృచ్ఛికం!  భూములను స్వాధీనం చేసుకోవడంలో కాంగ్రెస్​ సర్కారు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఇవన్నీ పక్కనపెడ్తే  నేటి విద్యార్థిలోకం పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం, వారికి పౌరసమాజం మద్దతు పలకడం నిజంగా హర్షించదగిన విషయం. కానీ, సర్వకాల సర్వావస్థల్లోనూ ఈ  పోరాట స్ఫూర్తి కొనసాగాలన్నదే  ప్రజాస్వామికవాదుల అభిమతం. 

గ్రానైట్ విధ్వంసంపైనా స్పందించాలి..

మన రాష్ట్రంలో ఉత్తరాన కరీంనగర్ నుంచి దక్షిణాన ఖమ్మం జిల్లావరకు గ్రానైట్ క్వారీల పేరుతో వెయ్యి కిపైగా గుట్టలను ఖండఖండాలుగా నరికేస్తున్నారు. దీనిపై ఓ కవి, ‘నా ఊళ్లిప్పుడు తలలు తెగిన మొండాలు’ అంటూ కన్నీళ్లు కార్చాడు. కానీ, ఆ కన్నీటిని తుడిచేందుకు ఏ ఒక్క మనిషీ ముందుకురాలేదు. ఒక్కో గుట్ట.. వందలు, వేల ఎకరాల పెట్టు. అరుదైన వృక్షాలు, మొక్కలు, వనమూలికలకు నెలవు. ఇప్పుడవన్నీ మాయమవుతున్నాయి. సహజ ఆవాసాలు ధ్వంసమై కోతులు, కొండెంగలు ఊళ్ల మీద పడ్తున్నాయి. గుడ్డెలుగులు, చిరుతలు, నక్కలు రోడ్ల మీదికి వచ్చి వాహన చక్రాల కింద నలిగిపోతున్నాయి.

రాబందులు, నెమళ్లు, ఉడుములు, ఇతర అరుదైన  సరిసృపాలు కాటగలుస్తున్నాయి. ఆయా గుట్టలు, వాటి కింది చెరువులు, చెల్కలు మాయమై, అంతులేని పర్యావరణ, జీవన విధ్వంసం జరుగుతున్నది. పొద్దున గుట్టెక్కిస్తేపొద్దంతా మేసి, పొద్దుగూకినంక కిందికి దిగివచ్చే మేకలిప్పుడు లేవు. మేకల పాకలూ లేవు. తరతరాలుగా మేకల పెంపకమే వృత్తిగా బతికిన కొన్ని వర్గాలకు ఉపాధి ఏనాడో దూరమైంది. అదే సమయంలో ఈ  విధ్వంసానికి కారణమైన గ్రానైట్ వ్యాపారులు మాత్రం గత ప్రభుత్వ హయాంలో వందలు, వేల కోట్లు సంపాదించి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వెలగబెట్టారు.

అప్పుడొక న్యాయం.. ఇప్పుడొక న్యాయం..

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 21 సీట్లు, టీడీపీ 15 సీట్లు సాధించాయి. కానీ, అప్పటి సీఎం కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో  రెండేండ్లలో  రెండు పార్టీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‎లో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్​కు మంత్రి పదవి గిఫ్ట్​గా ఇచ్చారు.

 పార్టీ ఫిరాయించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్​కు ఫిర్యాదు చేసినా, కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదు. 2018లో 88 సీట్లతో భారీ విజయం అందుకున్నాక సైతం టీఆర్ఎస్ తీరు మారలేదు. సభలో తనను ప్రశ్నించే ప్రతిపక్షమే ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో అప్పటి సీఎం కేసీఆర్ కాంగ్రెస్​ను టార్గెట్ చేశారు.

19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని దశలవారీగా లాగి, 2019 జూన్​కల్లా సీఎల్పీని విలీనం చేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి బహుమతిగా ఇచ్చారు. ఎప్పట్లాగే  పార్టీ  మారినవాళ్లపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ కోర్టుకెక్కింది. ఐదేండ్లు గడిచాయే తప్ప కేసు మాత్రం తేలలేదు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పే ఈసారి కాంగ్రెస్ చేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే! కానీ, గతంలో ఇదే తప్పు చేసిన  బీఆర్ఎస్ ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో  కొట్లాడుతున్నది. 

బీఆర్ఎస్ చేసిందేంటి.. కాంగ్రెస్ చేస్తున్నదేంటి?

ప్రభుత్వాన్ని ప్రజలు ఐదేండ్ల కాలానికి ఎన్నుకుంటారు. కనీసం మూడేండ్ల తర్వాత ఆ ప్రభుత్వ పనితీరుపై ఎవరికైనా ఒక అంచనా వస్తుంది. విమర్శకు, విశ్లేషణకూ అది తగిన సమయం. కానీ, అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్​ దుమ్మెత్తిపోయడం చూస్తున్నాం. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా వెలుగొందినట్లు, ప్రజలంతా ఏ చీకూ చింత లేక సిరిసంపదలతో తులతూగినట్లు, పాలనంతా  నిఖార్సుగా సాగినట్లు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  ఆ బంగారమంతా కరిగిపోయి, సిరిసంపదలన్నీ మాయమై, ప్రజలు మళ్లీ బికారులుగా తయారైనట్లు, ప్రస్తుత పాలనంతా అవినీతి, అక్రమాలకు నిలయమైనట్లు మాట్లాడుతున్నారు.  

గత  ప్రభుత్వ పనితీరు అద్భుతమని, అనవసరంగా కాంగ్రెస్‎ను గెలిపించుకొని అంతకంతకు అనుభవిస్తున్నారని ప్రజలనే నిందిస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పులు వాస్తవం. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోవడం వాస్తవం. వాళ్ల హయాంలో జరిగిన ఫోన్​ట్యాపింగ్, ఫార్ములా రేస్, కాళేశ్వరం నిర్మాణం, విద్యుత్ ఒప్పందాలు, ధరణి  బాగోతాలు, అక్రమ భూ  కేటాయింపులపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని ఎంక్వైరీల్లో నిగ్గు తేలుతున్నది వాస్తవం. కానీ, ఆ నిర్ణయాలన్నీ అధికారుల పేర్ల మీద జరగడం వల్లే నాటి ప్రభుత్వ పెద్దలు తప్పించుకుంటున్నారు. రాజ్యాంగం కల్పించిన ఆ రక్షణ వల్లే  జైళ్లలో ఉండాల్సిన వాళ్లంతా జనసామాన్యంలో తిరుగుతూ నీతి వాక్యాలు వల్లె వేస్తున్నారు. 

మెచ్చదగ్గ పనులూ జరుగుతున్నయ్​

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, 200 యూనిట్లలోపు ఫ్రీ విద్యుత్, రూ.500కు గ్యాస్​ సిలిండర్​లాంటి స్కీములతోపాటు ఒకే విడతలో రూ.21వేల కోట్ల క్రాప్​లోన్ల మాఫీ, 57వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలాంటి చాలా పనులు చేసింది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ చట్టంతోపాటు బీసీల 42శాతం రిజర్వేషన్ల కలను సాకారం చేసే దిశగా ప్రయత్నిస్తోంది. 

అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండవచ్చు గాక! కానీ కాంగ్రెస్ సర్కారు అసలు ఏమీ చేయనట్లు, అసలు రాష్ట్రంలో పాలనే జరగడం లేదన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నిజంగా విచారకరం. ప్రతిపక్షాలు.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సరైన దారిలో పెట్టే మార్గదర్శుల్లా ఉండాలే తప్ప, తమ రాజకీయ పబ్బం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కాళ్లల్లో కట్టెలు పెడ్తూ పోతే నష్టపోయేది  తెలంగాణ సమాజమే కదా! 

అప్పులు బారెడు, ఆమ్దానీ మూరెడు

ప్రస్తుతం ప్రతి నెలా ప్రభుత్వానికి వస్తున్న18వేల కోట్ల ఆదాయంలో 6,500 కోట్లు జీతాలకు, మరో 6,500 కోట్లు గత సర్కారు చేసిన అప్పులకే కట్టాల్సిన పరిస్థితి!  ఇక మిగిలిన 5వేల కోట్లతో సంక్షేమపథకాలు అమలుచేసేందుకు కాంగ్రెస్ సర్కారు కిందా మీదా పడ్తోంది. అలవిగాని హామీలివ్వడం ముమ్మాటికీ కాంగ్రెస్ చేసిన తప్పే!  కానీ ఆ హామీల అమలుకు తన ముందు ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించడం, అందులో అత్యుత్తమమైన వాటిని ఎంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది కదా? ఇక్కడ బీజేపీది మరో తీరు. ‘కేంద్రాన్ని అడగవద్దు.. భూములు అమ్మవద్దు.. గ్యారెంటీల నుంచి పక్కకు పోవద్దు..’  అంటూ ఓ దుడ్డు కర్ర పట్టుకొని నిలబడింది. ఇదెలా సాధ్యమో కమలం నేతలే చెప్పాలి. 

చిల్ల మల్లేశం,
సీనియర్​ జర్నలిస్ట్​