ఆత్మనిర్భర్​ భారత్​ అంటే..?

2020లో రూ.20లక్షల కోట్లతో ప్రధాని  నరేంద్ర మోడీ  ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని ప్రకటించారు. ఆత్మనిర్భర్ అనే సంపూర్ణ భావాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జేష్ఠ కార్యకర్త శ్రీ రేంగే జీ దాని భావాన్ని మొదట ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించింది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అమెరికా, చైనాలకు అసలే నచ్చడం లేదు. మన ప్రతిపక్షాలకు ఈ ఆత్మనిర్భర్ భారత్ మాకు రాజకీయ ఆత్మహత్యగా మారుతుందని అంటున్నారు. ప్రతిపక్షాలకు ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం ఎన్ని డబ్బులు వస్తాయని మాత్రమే లెక్కిస్తున్నారు.

మేకిన్ ఇండియా ఆలోచన వల్ల 2030 వరకు భారత్ సూపర్ పవర్ కాబోతుంది. మా అమెరికా ట్రేడ్ దెబ్బతింటుంది కాబట్టి  భారత్ లో మనకు అవకాశం ఇవ్వమనాలని అమెరికా పారిశ్రామికేత్తలు బైడెన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఈ ప్రపంచానికి సమస్యలను సృష్టించడంలో ఎన్నడూ భాగం కాదు, పరిష్కారంలో మాత్రమే భాగం అవుతుందని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్యసమితిలో చెప్పారు.

నాలుగు అంశాలకు ప్రాధాన్యత

మన ఆర్థిక స్థితి నాలుగు అంశాలపై ఆధారపడి ఉన్నది. 1. భౌతిక, ప్రకృతి వనరులు  వినియోగించుకోవడం, 2. మానవ వనరులు అయిన విద్య, ఆరోగ్యంతో పాటు అందరికీ పని కల్పించడం. 3. ఉత్పత్తి రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు సమాన వాటా నిష్పత్తిలో అభివృద్ధి కావడం, 4.  కార్యనిర్వాహక వ్యవస్థ, రోడ్లు, రైల్వేలు, వైమానికం, విద్యుత్తు, సమాచార సాంకేతిక రంగాలు అందరికి అందుబాటులోకి రావడం వల్ల నిజమైన అభివృద్ధి సాధిస్తాం. తద్వార "జీరో” పేదరికం, “జీరో” నిరుద్యోగం, "జీరో” నిరక్షరాస్యత, "జీరో” తీవ్రవాదం, వేర్పాటువాదం సాధించాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారు.

దుబారాను అరికట్టి స్వయం సమృద్ధిని పెంచారు

ఆత్మనిర్భర్ భారత్ వల్లనే భారత్ ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని నిలబడగలిగింది. మోదీ ప్రభుత్వం దుబారా అరికట్టి పొదుపు పాటిస్తూ, సబ్సిడీల దుర్వినియోగం అరికట్టి ఆర్థిక స్థితి మెరుగుపరుస్తుంది. ‘ప్రకృతి ఇచ్చే మూలధనం, ఉత్పత్తి చేసే ద్రవ్య మూలధనం కంటే గొప్పది.’ మానవ అవసరాల వరకే ఉత్పత్తి సాధనాలు వినియోగించాలి. అంతులేని సంపద కొరకు ప్రకృతి విధ్వంసం చేయడం పాశ్చాత్యుల సంస్కృతి. ఆత్మనిర్భర్ భారత్ లో మానవ అవసరాల వరకే సంపద సృష్టి జరగాలని నరేంద్ర మోదీ యోజన. డిజిటల్ లావాదేవీలు పెంచి లీకేజీలు అదుపు చేసి, పొదుపును పాటిస్తూ, అవినీతిని కట్టడి చేస్తూ ఆర్థిక శక్తిని పెంచారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చెల్లింపుదారులను పెంచారు. 3లక్షల బోగస్ కంపెనీలను రద్దు చేశారు. లెక్కకు రాని డబ్బును లెక్కలోకి తెచ్చారు. బినామీ ఆస్తుల చట్టం, రేరా యాక్ట్, బ్యాంక్రప్టసీ కోడ్, ఆధార్ లింక్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డబ్బులు పంపిణీ చేయడం, నల్లధన నియంత్రణ బిల్లు తేవడం, 30లక్షల కోట్లపై విచారణ జరపడం, నిరర్థక ఆస్తులను నియంత్రణ చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి ఈ 9 ఏళ్లలో గణనీయంగా సాధించారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగామని సగర్వంగా చెప్పవచ్చు.

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి 

రక్షణ రంగంలో రైజింగ్ మిలిటిరీ పవర్ గా భారత్ ముందుకు పోతున్నది. మన రక్షణ బలం అనేక రెట్లు పెరిగింది. ఏసియా పసిఫిక్ ప్రాంతాలలో గతం కంటే మన రక్షణ బలం పెరిగింది. 3 సర్జికల్ స్ట్రైక్ లు (యూరి, బాలాకోట్, నాగా) చేసి తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అదుపు చేశాం. రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధం సాధించి దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగాం. రక్షణ రంగానికి రూ.5.20 లక్షల కోట్ల వరకు బడ్జెట్ పెరిగింది. ప్రపంచంలో రెండవ అత్యధిక బడ్జెట్ భారత్ దే ఉన్నది. ఒకప్పుడు బుల్లెట్ ప్రూఫ్ లేని పరిస్థితి నుంచి నేడు మనమే బుల్లెట్ ప్రూఫ్ తయారు చేసి ఎగుమతి చేస్తున్నాం. సుఖోయ్ మిసైల్స్, మిగ్-21, బ్రహ్మోస్, అగ్ని లాంటి ఆయుధాలతో మన ఎయిర్ డిఫెన్స్ ను బలోపేతం చేశాం. అధునాతన యుద్ధ ట్యాంకులు రూ.8000 కోట్లతో అత్యంత ప్రమాణాలతో తయారు చేస్తున్నాం. డీఆర్డీఏకు స్వేచ్ఛనిచ్చి, నిధులిచ్చి పరిశోధన పెంచాం. దేశీయ నావిగేషన్ బలోపేతమైంది. ఐఎన్ఎస్ ధృవ భారత నేవీ వార్ షిప్ లో భాగమైంది. దీని ద్వారా న్యూక్లియర్ మిసైల్స్ ప్రయోగించడంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ మొదటి విమాన వాహక నౌకను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతమైంది. అంతరిక్షంలో మన ఆధిపత్యం పెరిగింది. రష్యా, అమెరికా, చైనాలతో పోటీ పడుతున్నాం. రూ.1.53 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం. మనం అంతర్జాతీయంగా ఒక ఎయిర్ స్పేస్ స్టేషన్ ను పెడుతున్నాం. చంద్రయాన్, మంగళ్ యాన్, గగన్ యాన్ పేర్లపై అంతరిక్ష పరిశోధన పెంచి ప్రపంచంతో పోటీ పడుతున్నాం. భారత రక్షణ పరిశ్రమలకు రూ.8 లక్షల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని మన ఆర్మీ చీఫ్ ఈ మధ్యనే ప్రకటించారు.  ఇది రక్షణ రంగంలో నిజమైన స్వయం సమృద్ధి. ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. 

ప్రతిపక్షాలకు అత్మనిర్భర్ పట్టదు

10,86,000 ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేసి దేశానికి కొవిడ్​ సేవలు అందించింది కేంద్ర ప్రభుత్వం. కొవిడ్ కు రూ.5లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. 140 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సినేషన్ అందించాం. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు గ్లోబల్ అప్రూవల్ సాధించాం. 80 కోట్ల మందికి 3 ఏండ్లు ఆహార గింజలు అందించాం. ఇదే నిజమైన ఆత్మనిర్భర్ భారత్. కేటీఆర్, కేసీఆర్ ఆత్మనిర్భర్ ద్వారా మాకుడబ్బులు ఏవి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సమయంలో మీరు ఫాంహౌజ్ లో ఉంటే మోదీ తెలంగాణ ప్రజలను కాపాడారు. కష్టకాలంలో తెలంగాణను ఆదుకుంది మోడీనే. ఈ రకంగా భౌతికాభివృద్ధిలో అన్ని రంగాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దూసుకుపోతుంటే మన ప్రతిపక్షాలు దేశ విదేశీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్ర చేస్తున్నాయి. ప్రజల మద్దతు పొంది అధికారంలోకి రావాలి తప్ప కుట్రలు, కుతంత్రాలతో రాలేరని గ్రహించాలి. రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో భారతదేశాన్ని, భారత ప్రజలను అవమాన పర్చారు. ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, మైనార్టీలకు రక్షణ లేదని, ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని అమెరికా, యూరప్ దేశాలు భారతదేశ పరిపాలనలో జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ఇదీ మన ప్రతిపక్షనేతకు దేశం పట్ల ఉన్న ప్రేమ! సమాజం పట్ల, దేశం పట్ల సంవేదనాశీలత ఉన్న నాయకుడిగా  నరేంద్ర మోదీ తన జీవితాన్ని దేశం కోసం సమర్పించి పని చేస్తున్నారు. ఇలాంటి కారణ జన్ముడికి దేశ ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నాం.

అక్రమాలు తగ్గి, ఆదాయం పెరిగింది

60 ఏళ్లలో  2014 వరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం రూ.10,29,000 కోట్లు ఉంటే.. 2022–-23 వరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం ప్రజలపై ఏ పన్నులు వేయకుండా రూ.30లక్షల కోట్లకు పైగా చేరుకున్నది. రెండింతల ఆదాయం పెరిగిందంటే మోదీ ఆర్థిక విధానాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. గత 9 ఏళ్ల  నుంచి వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, ఆర్థిక, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగం, వైద్య, విద్య రంగాలు, రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, గృహాలు, గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు నిధులు పెంచడం వల్ల నిరంతర అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. రాష్ట్రాల ఆదాయం పెంచడం వల్ల స్వావలంబన దిశగా దేశం ముందుకు పోతున్నది. తద్వారా స్వయం సమృద్ధం (ఆత్మనిర్భర్) సాధ్యమవుతుంది. విధానపరమైన అవినీతి తగ్గింది.

ప్రణాళికా బద్దమైన సంక్షేమం

43 కోట్లకు పైగా పేదలను బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానించాం. 36 కోట్ల మందికి బీమా సురక్షా సౌకర్యాన్ని కల్పించాం. 50 కోట్ల జనాభా పేదరికాన్ని అధిగమించింది. కోట్లాది పక్కా గృహాలు కట్టించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశాం. 6 లక్షల గ్రామాల భూరికార్డులు ప్రక్షాళన చేశాం. మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి, ప్రపంచానికి అందిస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇండియా (యూపీఐ) ద్వారా 4 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 9 నెలల్లో వ్యాక్సిన్ తయారు చేసి మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ ప్రపంచానికి అందించాం. ఇది గ్లోబల్ వాల్యూ చెయిన్ విస్తరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర్​ సాధించిన అపూర్వ విజయం అది.
- నరహరి 
వేణుగోపాల్ రెడ్డి,
బీజేపీ రాష్ట్ర నాయకులు