- మూడుసార్లు అలైన్మెంట్ మార్చిన అధికారులు
- లక్సెట్టిపేట దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు యత్నాలు
- విద్యాసంస్థ నిర్వాహకులతో ఓ ఉన్నతాధికారికి సంబంధాలు
- అటువైపు భూముల రేట్లు పెంచడం కోసమే అలైన్మెంట్మార్పులు
- సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కు విరుద్ధంగా ఎల్లంపల్లి నిర్వాసితులభూములసేకరణ
మంచిర్యాల, వెలుగు : నేషనల్హైవే 63లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్పులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లక్సెట్టిపేట నుంచి కుర్మపల్లి వరకు మూడుసార్లు అలైన్మెంట్ మార్చడంపై రైతులు మండిపడుతున్నారు.
లక్సెట్టిపేట నుంచి కుర్మపల్లి వరకు మార్గమధ్యలో కొంతమంది భూస్వాములు, రియల్టర్లు, పెట్టుబడిదారుల భూములకు ఎఫెక్ట్ కాకుండా వారి ప్రయోజనాల కోసమే అధికారులు అలైన్మెంట్లు మార్చారని, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని భూములు కోల్పోతున్న రైతులు ఆరోపిస్తున్నారు.
35 కిలోమీటర్లు.. 1433 ఎకరాలు
ఎన్ హెచ్63 బోధన్ నుంచి చత్తీస్‌గడ్‌లోని జగ్దల్పూర్వరకు విస్తరించి ఉంది. ఇందులో భాగంగా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్ లేన్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రూ.5,354.12 కోట్ల అంచనా వ్యయంతో 160 కిలోమీటర్ల పొడవున పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్హెచ్ఏఐ అధికారులు లక్సెట్టిపేట శివారులోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా 2018లో మొదటి అలైన్‌మెంట్‌ను రూపొందించారు.
తమ సాగు భూములను ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేయడంతో పాటు కొంతమంది భూస్వాములు, రియల్టర్లు తమ భూములు పోకుండా పైరవీలు చేసి దాన్ని అడ్డుకున్నారు. రెండోసారి ప్రస్తుతమున్న రోడ్డునే బ్రౌన్ ఫీల్డ్‌గా మార్చడానికి కొత్త అలైన్మెంట్తయారుచేసి 2023లో నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే రోడ్డు పక్కనున్న ఇండ్లు, భూములు కోల్పోతున్నవారు వ్యతిరేకించడంతో దానికి బ్రేక్‌పడింది.
అనంతరం లక్సెట్టిపేట మండలం మోదెల నుంచి కుర్మపల్లి వరకు ఎన్హెచ్ఏఐ అధికారులు మూడో అలైన్‌మెంట్‌ను రూపొందించారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించనున్న ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,433.75 ఎకరాల
భూసేక రణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ చ్చారు.
తప్పుడు రిపోర్టులతో తప్పుదారి..
వాస్తవంగా గ్రీన్ ఫీల్డ్ కంటే బ్రౌన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లు, భూములను కాపాడుకోవడం కోసం కొంతమంది పైరవీలు చేసి అడ్డుకున్నారని తెలు స్తోంది. మున్సిపల్ పరిధిలో ప్రస్తుత రోడ్డు 132 ఫీట్లు (40 మీటర్లు) వెడల్పు ఉంది. ఫోర్ లేన్ కోసం 150 ఫీట్లు (45 మీటర్లు) అవసరం.
కానీ ప్రస్తుత రోడ్డు 100 ఫీట్లు మాత్రమే ఉందని, ఫోర్ లేన్ కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి ఉంటుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆల్టర్నేట్గా లక్సెట్టిపేట శివారు నుంచి బైపాస్ తీయాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడంతో దానికి బ్రేక్ పడింది.
విద్యాసంస్థ కోసం మారిన అలైన్మెంట్
తాజాగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం నుంచి గోదావరి మీదుగా లక్సెట్టిపేట శివారు నుంచి ముల్కల్ల వరకు కొత్త అలైన్మెంట్ రూపొందించారు. లక్సెట్టిపేట సమీపంలో మైనారిటీ విద్యాసంస్థ ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన కొంతమంది పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.
బ్రౌన్ ఫీల్డ్ రద్దు కావడం, లక్సెట్టిపేట, మోదెల శివార్ల నుంచి బైపాస్తీయాల్సి రావడంతో వారు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసి గ్రీన్‌ఫీల్డ్ హైవే రూట్ మార్చినట్టు చెప్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కొంతమంది భూస్వాములు, రియల్టర్ల భూములకు డిమాండ్ సృష్టించడం కోసం పైరవీలు చేసినట్లు సమాచారం. వీరికి ఎన్హెచ్ఏఐ హైదరాబాద్ రీజినల్ ఆఫీస్‌లో పనిచేసే ఒక ఉన్నతాధికారి సహకరించినట్టు సమాచారం. అనంతరం ఆయన ఢిల్లీకి బదిలీ కావడంతో పైరవీకారుల పని మరింత సులువైనట్టు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ బేఖాతర్
హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయినవారి నుంచి రెండోసారి భూసేకరణ చేయరాదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం హాజీపూర్, లక్సెట్టిపేట మండ లాల్లో వేల ఎకరాల సాగు భూములు తీసుకున్నారు. 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు.
ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మళ్లీ అదే రైతులు భూములు కోల్పోతున్నారు. మిగిలిన కాస్త భూములు గుంజుకొని తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వారు వేడుకుంటున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కలిసి తమ గోడు వినిపించారు.
ఉన్న భూములు పోతే ఎట్ల బతకాలె
15 ఏండ్ల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ మా భూములు గుంజుకున్నది. నాడు 7.10 ఎకరాల భూమి పోయింది. ఇప్పుడు హైవే కింద 2 ఎకరాలకు సర్వే చేసిన్రు. ఉన్న భూములు కూడా పోతే మేం ఎట్ల బతకాలె. గొల్ల పోచయ్య, ఇటిక్యాల
మైనార్టీ యూనివర్సిటీ కోసమే..
లక్సెట్టిపేట శివారులో మైనార్టీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన కొందరు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. దాని కోసమే హైవేను అటువైపు మళ్లించేలా భారీగా పైరవీలు చేశారు. వారికి ఓ ఉన్నతాధికారి సహకరించారు. మేం రైతులను తీసుకొని ఢిల్లీ వెళ్లి ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులను కలిశాం. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నడుచుకోవాలని కోరాం. అయినా స్పందన లేదు. -తుల మధుసూదన్‌రావు (బీజేపీ నేత)