నిజామాబాద్, వెలుగు: బోధన్ డిగ్రీ స్టూడెంట్ శ్రీకాంత్ మిస్సింగ్ కేసు విచారణలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుమానితులుగా ఐదుగురిపై శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే 20 రోజుల తరువాత కేసు నమోదు చేయడం అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు అనుమానితులతో బోధన్‌లోని బార్‌లో పోలీసులు దావత్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బాధిత కుటుంబ సభ్యుడితో ఏసీపీ కిరణ్‌కుమార్ మాట్లాడిన తీరు ఆరోపణలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఆ ఆడియో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వైరల్ మారింది. అసలు అనుమానితులను విచారించారా? మొక్కుబడి ఎంక్వైరీతో ముగించారా.. తెలియాల్సిఉంది.
మిస్సింగ్ కేసుతో సరి..
సెప్టెంబర్ 23 నుంచి శ్రీకాంత్ కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మణ్ పటేల్, శుభం పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ప్రేమించిన యువతి కుటుంబానికి సంబంధించిన ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు అనుమానితులపై కేసు ఫైల్ చేయకుండా కేవలం మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో 20 రోజు తర్వాత శ్రీకాంత్ కుటుంబ సభ్యుడు శుభం పటేల్ బోధన్ ఏసీపీని ఫోన్‌లో సంప్రదించారు. ప్రస్తుతం ఈ అడియో వైరల్‌గా మారింది. ఈ కేసుపై అన్ని రకాల దర్యాప్తు చేపట్టామని ఏం లాభం లేదని చెప్పారు. తాను ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనని బదులిచ్చారు. తప్పిపోయిన శ్రీకాంత్ రావాల్సిందే.. తప్ప తామేమి చేసేదిలేదని ఏసీపీ మాట్లాడిన తీరు పోలీస్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
18 గంటలు ధర్నా ..
శ్రీకాంత్ కనిపించకుండా పోయాక, అతనిని హత్య చేశారని ఆరోపిస్తూ, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు 18 గంటల పాటు ఆందోళనకు దిగారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని సీపీ నాగరాజు హామీ ఇచ్చి వారిని వదిలేశారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం
బోధన్ యువకుడి డెత్ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. అనుమానితులను అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్న వారికి అనుమా నస్పద మృతి కేసు నమోదు చేయడంతో శాంతించారు. కుటుంబ సభ్యుల అనుమతితో బోధన్ హాస్పిటల్‌లో శ్రీకాంత్ మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం రెండు గంటలు పోస్ట్ మార్టం చేసింది. ఈ రిపోర్ట్ పది రోజుల్లో రానుంది. రిపోర్ట్‌లో ఆత్మహత్య లేక హత్య అనేది తేలుస్తారు. హత్యగా నిర్ధారిస్తే దోషులతో పాటు అలసత్వం వహించిన పోలీసులపై చర్యలు ఉంటాయని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.
పోలీసుల నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
పోలీసుల నిర్లక్ష్యమే శ్రీకాంత్ ప్రాణాలు తీసింది. ఫిర్యాదు చేసి 20 రోజులైనా అను మానితులపై కేసు నమోదు చేయలేదు. అనుమానితులను విచారించలేదు. వారి తో కుమ్మక్కై కేసు పక్కదారి పట్టిస్తున్నరు. - శుభం పటేల్, మృతిడి కుటుంబ సభ్యుడు
దర్యాప్తు వేగవంతం చేస్తాం.. నిజామాబాద్ సీపీ నాగరాజు
బోధన్, వెలుగు: స్టూడెంట్ శ్రీకాంత్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేస్తామని సీపీ నాగరాజు వెల్లడించారు. మంగళవారం బోధన్ రూరల్ పీఎస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను గతంలోనే ఆరెస్టు చేశామని, నిందితుల కోసం విచారణ చేపట్టాగాఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు. ఈ నెల 12న శ్రీకాంత్ శవం లభ్యం కావడంతో బాధాకరం అన్నారు. మృతుడి తల్లిదండ్రులకు పోలీసులపై నమ్మకం లేకపోవడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీసీఎస్సీఐ రమేశ్ బృందంతో పూర్తి విచారణ చేపడుతామని తెలిపారు. అలాగే శ్రీకాంత్ మృతదేహం నుంచి ప్రత్యేక వైద్యబృందంతో తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందని వివరించారు. స్థానిక పోలీసు అధికారులు నిందితులకు సహకరించినట్లు ఆరోపణల నేపథ్యంలో శాఖపరంగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రెస్‌మీట్‌లో ఏసీపీ కిరణ్‌కుమార్ ఉన్నారు.
ఐపీఎస్ ఆఫీసర్‌తో ఎంక్వైరీ చేయాలి
బోధన్, వెలుగు: శ్రీకాంత్ కేసును ఐపీఎస్ అధికారితో ఎంక్వైరీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండాల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్‌ను హత్య చేసిన నిందితులను ఆరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, మండల ప్రెసిడెంట్ పోశెట్టి ఉన్నారు.