ఈవెంట్ పర్మిట్ల పేరుతో భారీగా ఫీజుల వసూలు

మేడారం జాతరలో ‘ఈవెంట్’ పర్మిట్లతో ప్రివిలేజ్ టాక్స్ వసూలు చేస్తూ భక్తులను తెగ దోచుకుంటోంది కేసీఆర్‌‌ సర్కార్. తెలంగాణ రాష్ట్రం నుండే గాక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్​, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటకతో పాటు దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసీలకు 22 ఈవెంట్ పర్మిట్ (లైసెన్స్)లను ఎక్సయిజ్ శాఖ జారీ చేసింది. మేడారంతో పాటు పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెం, కన్నెపల్లి, నార్లాపూర్, కొత్తూర్, ఊరట్టం, వెంగళాపూర్, జంపన్న వాగు తదితర ప్రాంతాల్లో ఈ బ్రాందీ షాపులు ఏర్పాటు చేసారు.  వారం రోజులు పాటు మాత్రమే అమలులో ఉండే ఈవెంట్ పర్మిట్లకు ఒక్కొక్క లైసెన్స్ కు రోజుకు రూ.9 వేల ఫీజు చొప్పున ఎక్సయిజ్ శాఖ వసూలు చేస్తోంది.

లైసెన్స్ పొందిన వారికి విక్రయ స్థలాలను కేటాయించినందుకు ఏటూరునాగారం ఐటీడీఏ ఒక్కో షాపుకు రూ. 17 వేల మొత్తాన్ని వసూలు చేసి లైసెన్స్ జారీ చేస్తోంది. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేయడానికి ఎక్సయిజ్ శాఖ వారు సమ్మక్క సారక్క తాడ్వాయి మండల కేంద్రంలో ఒక సబ్ డిపో ఏర్పాటు చేసి 20 కోట్ల మద్యం నిల్వలను అందుబాటులో ఉంచారు.  కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వారం రోజుల ఈవెంట్ లైసెన్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ. 6.00 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే మేడారం జాతరలో అసలు విశేషం. నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుల చెల్లింపు, కోళ్లు, మేకల బలి, మద్యపాన మేడారం జాతరలో భక్తుల ఆనవాయితీయే కాకుండా ఈ జాతర సంస్కృతి కూడాను. దీన్ని అడ్డం పెట్టుకుని ఈసారి మరో కోటి పైనే అదనపు ఆదాయాన్ని నిర్దేశించుకుని ఐదు వేల బ్రాందీ కేసులు, 15 వేల బీరు కేసులు అమ్మకాలు జరపాలని అందుకోసం ఆబ్కారీ శాఖ కసరత్తులు చేస్తోంది. దానిలో భాగంగా స్థానికంగా ఉన్న బ్రాందీ షాపులకు సరుకు సరఫరా నిలిపివేయడమే కాకుండా చుట్టుపక్కల మండలాల్లోని బ్రాందీ షాపుల నుంచి భారీగా మద్యం రవాణా కాకుండా కట్టడి చేస్తున్నారు. ఆదివాసీలు, పేదలు ఎక్కువగా వచ్చే మేడారం జాతరలో సాధారణం కన్నా ధరలను పెంచి మద్యం అమ్మడం సరికాదు.    

– సాయిని నరేందర్, సోషల్‌ ఎనలిస్ట్‌