లెటర్​ టు ఎడిటర్​: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడా?

లెటర్​ టు ఎడిటర్​: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడా?

అందేశ్రీ గేయానికి సంగీతం సమకూర్చిన కీరవాణిపై దుమారం లేచింది. తెలంగాణలో సంగీతకారుడే దొరకలేదా? అనే ప్రశ్న లేవనెత్తడం సహజమే. తెచ్చుకున్న తెలంగాణ అన్ని రంగాలలో ముందడుగు వేయాలనే ఆకాంక్ష అక్షర సత్యం.  కానీ, ఇలాంటి దుమారాలు గత పదేండ్లుగా ఎందుకు లేవలేకపోయాయి? అందెశ్రీ గేయాన్ని తిరస్కరించిన కేసీఆర్​ సర్కార్​పై ఏనాడైనా ఎవరైనా పోరాడారా? బరిగీసి ఎదిరించిన దాఖాలా ఉందా? అందెశ్రీ తెలంగాణకు లభించిన  బడుగు సామాజం నుంచి వచ్చిన ఒక అరుదైన కవి. 

ఆయన జయజయహే తెలంగాణ గేయమే రాష్ట్ర గేయంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. ఆ పాటకు సంగీతం కోసం ఆయన కీరవాణిని ఎంచుకోవడం సరైంది కాకపోవచ్చు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లిని వదిలేసి అందెశ్రీ లాంటి కవిపై విరుచుకుపడడం ఎవరికీ శోభనివ్వదు. తెలంగాణవాడు చిన్న సినిమా తీసినా థియేటర్లు దొరకలేదెందుకు? నాడు కేసీఆర్​ను ఎవరైనా నిలదీశారా? ఆంధ్రావాళ్ల సినిమాలకు రాయితీలు ప్రకటించిన కేసీఆర్​కు తెలంగాణవాళ్ల సినిమాలు ఏనాడూ ఎందుకు కనిపించలేదు? ఇవాళ అందెశ్రీ  కీరవాణిని ఎంచుకోవడానికి పరోక్షంగా పదేండ్ల కేసీఆర్​ పాలనే కారణమని మనం గమనించాలి. 

తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్​ ఏనాడో దారి మళ్లించి తన పబ్బం గడుపుకున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, దాని అస్తిత్వాన్ని కేసీఆర్​ పాలన ఏనాడో గంగలో కలిపేసింది. ఆంధ్రావాళ్ల సేవలో పునీతమైన కేసీఆర్​ సర్కారును ఏనాడూ నిలదీయని వారికి ఇవాళ ఒక్క కీరవాణి సంగీతమే అడ్డుకావడం ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రోళ్ల కాలికి ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్​.. తెలంగాణ పేదోడికి ప్రవేశం ప్రగతి భవన్​లోకి ఎందుకు ప్రవేశం ఇవ్వలేదో ఏనాడైనా అడిగామా? కాబట్టి ఈరోజు అందేశ్రీని నిందించడంలో అర్థం లేదు. తెలంగాణకు మొదటి పాలకుడు కేసీఆర్​. ముందటి నాగలి వంకర నడిచింది, వెనక నాగలి కూడా దాన్నే అనుసరిస్తుంది. కాబట్టి అందెశ్రీని 

నిందించడంలో అర్థం లేదు.  
-  భోళా యాదగిరి, గౌరాయపల్లి