పూర్తి కాని ప్రాజెక్టును ఎందుకు ప్రారంభిస్తున్రు? చంద్రశేఖర్

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: రిజర్వాయర్లు పూర్తి కాకముందే  ప్రారంభించడం ఏమిటని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్​ కుట్రలు పన్నుతున్నాడని బీజేపీ నేత, మాజీ మంత్రి పి చంద్రశేఖర్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ పనులు పూర్తి కాకుండానే పీఆర్ఎల్ఐ కింద మోటార్  పంపును ప్రారంభించడం ఏమిటని  ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమనే ఉద్దేశంతో పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని లిఫ్ట్  చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, ఆ తరువాత రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీళ్లను ఎత్తిపోసేలా డిజైన్లు మార్చారని పేర్కొన్నారు. 

ALSO READ: తుక్కుగూడ సభ ద్వారా కాంగ్రెస్ బలం చాటాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక్క పంపుతో రోజుకు ఒక టీఎంసీ నీళ్లను తోడితే 3000 క్యూసెక్కుల నీళ్లు వస్తాయని, ఈ నీటిని ఏ రైతు పొలానికి పారిస్తారో చెప్పాలన్నారు. రిజర్వాయర్ల నుంచి కాలువలు లేకుండా లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. సుప్రీంకోర్టులో తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి, ఇక్కడి ప్రజలకు లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, పద్మజా రెడ్డి, క్రిస్టియా నాయక్, పి శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, బుచ్చిరెడ్డి, అచ్చుగట్ల అంజయ్య పాల్గొన్నారు.