రేషన్​కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి

రేషన్​కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
  • బస్తీ, వార్డు సమావేశాల్లో దరఖాస్తుకు చాన్స్​
  • వచ్చే నెల నుంచి రేషన్ ​షాపుల్లో సన్న బియ్యం పంపిణీ
  • మరికొన్ని కొత్త సరుకులు ఇచ్చే ప్లాన్​
  • రేషన్​కార్డుల జారీ నిరంతర ప్రక్రియ 
  • చీఫ్​ రేషనింగ్ ​ఆఫీసర్ ​ఫణీంద్రరెడ్డి 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో కొత్త రేషన్​కార్డుల కోసం మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు ఆయా బస్తీలు, వార్డు సమావేశాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చీఫ్​రేషనింగ్ ఆఫీసర్(సీఆర్ఓ) ఫణీంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజాపాలన సందర్భంగా, ఇటీవల పూర్తయిన కులగణన సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా సివిల్​సప్లయ్, బల్దియా, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేశారన్నారు.

ఈ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని, వారి పరిశీలనలో అర్హులైన వారిని ప్రభుత్వం ముందుగా ప్రకటించిందని చెప్పారు. ఈనెల 26 నుంచి కార్డుల జారీకి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బోగస్​కార్డులను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్​కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా అని, ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్నవారి పేరు అర్హుల లిస్టులో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నగర పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో కొత్త రేషన్​కార్డుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్డు, బస్తీ సమావేశాల్లో అప్లై చేసుకోవాలన్నారు.  

అదే నెల నుంచే సరుకులు

నగరంలో అర్హులైన వారందరికీ కార్డులు ఇచ్చిన నెలలోనే సరుకులు కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా సన్న బియ్యం ఇవ్వనున్నట్టు సీఆర్ఓ ఫణీంద్ర రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్​కార్డులు ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో  కుటుంబానికి రూ.7కు కిలో చొప్పున ఐదు కిలోల గోధుమలు ఇస్తున్నామన్నారు. అంత్యోదయ కార్డులున్న వారికి రూ.13కే కిలో చక్కెర అందజేస్తున్నామన్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైన నెల నుంచే అందరికీ సన్నబియ్యం, గోధుమలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  

కొత్త షాపులు.. కొత్త సరుకులు  

ప్రస్తుతం రేషన్​కార్డుదారులకు బియ్యం, గోధుమలు ఇస్తున్నామని, త్వరలో పాటు ఇతర వస్తువులను కూడా రేషన్​షాపుల ద్వారా ఇచ్చే ప్రతిపాదన ఉందని, సీఆర్ఓ ఫణీంద్రరెడ్డి తెలిపారు. అలాగే నగరంలో 653 రేషన్​షాపులు ఉండేవని, వివిధ కారణాలతో 50 షాపులు మూత పడ్డాయన్నారు. మరికొద్ది రోజుల్లో వీటిని తెరిపించడంతోపాటు కొత్తగా మరికొన్ని రేషన్​షాపులను ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రస్తుతం ఒక్కో రేషన్​షాపు పరిధిలో 900 నుంచి 1000 కార్డులుగా ఉండగా త్వరలో వీటి సంఖ్య 1,200 వరకూ పెరిగే అవకాశం వుందన్నారు.