బాంబే ఐఐటీ క్యాంపస్లో మొసలి.. రోడ్డుపై ఠీవీగా నడుస్తూ ఎంత పనిచేసింది.. వీడియో వైరల్

బాంబే ఐఐటీ క్యాంపస్లో మొసలి.. రోడ్డుపై ఠీవీగా నడుస్తూ ఎంత పనిచేసింది.. వీడియో వైరల్

నిత్యం కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్లతో బిజీగా ఉండే బాంబే ఐఐటీ ఆదివారం (మార్చి 23) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అకస్మాత్తుగా ఒక మొసలి క్యాంపస్ పరిసరాల్లోకి రావడం విద్యార్థులను, స్టాఫ్ ను భయాందోళనకు గురిచేసింది. ఎప్పుడూ సెక్యూరిటీ.. విద్యార్థులతో కిటకిటలాడే క్యాంపస్ లోకి మొసలి ఎలా వచ్చిందనే చర్చ మొదలైంది. ఐఐటీలో మొసలి అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ALSO READ | నాగ్‌పూర్ హింసాకాండ: కీలక నిందితుడి ఇల్లు కూల్చివేత

ముంబైలోని పొవై దగ్గర ఉన్న ఐఐటీ క్యాంపస్ లో మొసలి రోడ్డుపై నడుస్తూ కనిపించడం కలకలం రేపింది. మొసలిని చూసిన విద్యార్థులు పరుగులు తీశారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో ఫుల్ ట్రెండ్ అయ్యింది. 

పొవై సమీపంలో ఉన్న పద్మావతి ఆలయ సరస్సు నుంచి మొసలి తప్పించుకుంది. ఐఐటీ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యిందో తెలియదు కానీ.. రోడ్డుపై నేనూ క్యాంపస్ కు చెందినదాన్నే అన్నట్లుగా ఠీవీగా నడుస్తుండటాన్ని కొందరు వీడియో తీశారు. ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పొవై క్యాంపస్ కు చేరుకుని మొసలిని సరస్సుకు తరలించారు. ఈ ఘటనను రాజ్ మజి అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.