పెద్దవాగు వద్ద కాజిపేట–బల్లార్షా రైల్వే మూడో లైన్ పరిస్థితి
కాగజ్ నగర్,వెలుగు: కాజీపేట– బల్లర్షా మూడో రైల్వే లైన్ పనుల్లో క్వాలిటీ కరువైంది. పెద్దవాగు మీద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ ఫౌండేషన్ కుంగింది. రూ. 20 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనుల్లో నాణ్యత కొరవడడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కాగ జ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు హైలెవెల్ బ్రిడ్జి కుంగింది. రెండు నెలల క్రితం రెండు స్లాబ్‌లు కూలిపోయాయి. ఇప్పుడు అదే పెద్దవాగు మీద నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి లో ఫౌండేషన్ కుంగడం గమనార్హం. రోజూ పదుల సంఖ్యలో ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్, గూడ్స్ రైళ్లు ఈ బ్రిడ్జి నుంచే వెళ్లనున్నాయి. రైల్వే బ్రిడ్జి పనులు చేసే ముందు సాయిల్ టెస్ట్‌లో భాగంగా ఇసుక లోతు, భూమి స్థితిని పరిశీలించిన తర్వాతే డిజైన్‌చేయాలి. కానీ.. అలా జరగకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు సమస్యగా మారాయనే వాదనా ఉంది. అప్రమత్తమైన ఆఫీసర్లు వారం రోజులుగా మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ విషయమై రైల్వే కన్స్ట్రక్షన్ఇంజినీర్ డానియల్ ను సంప్రదించగా పక్కనున్న పెద్దవాగు బ్రిడ్జి పిల్లలు కూడా కుంగాయని ఎదురు ప్రశ్నించారు. అదంతా కాంట్రాక్టరే చూసుకుంటాడని బదులిచ్చాడు. ఇలా ఎందుకు జరిగిందనే దానిపై మాత్రం స్పందించలేదు.
సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు చేయాలి
మందమర్రి,వెలుగు: బొగ్గు గనుల్లో ప్రమాదాల నియంత్రణ, నివారణ కోసం రూపొందించిన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్‌ను అమలు చేయాలని డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ అధికారి అర్మూగం, సింగరేణి సేఫ్టీ సీజీఎం గురువయ్య సూచించారు. మంగళవారం మందమర్రి ఏరియాలోని సింటార్స్ మైన్స్ ట్రెయినింగ్ సెంటర్లో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల కార్మిక సంఘాల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అవగాహన సదస్సుకు వారు హాజరయ్యారు. యాక్సిడెంట్లు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంప్లాయీస్‌కు తెలియజెప్పే అంశాలపై యూనియన్ ప్రతినిధులకు వివరించారు. సీజీఎం సేఫ్టీ కార్పొరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల సింగరేణి జీఎంలు చింతల శ్రీనివాస్, బి.సంజీవరెడ్డి, జి.దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం జాన్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ సమస్య పరిష్కరించాలె... డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలె
- ఆఫీసర్లపై అధికార పార్టీ జడ్పీటీసీలు ఫైర్
- వాడీవేడిగా జడ్పీ స్థాయీసంఘ సమావేశం
నిర్మల్, వెలుగు: సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదని అధికార పార్టీ జడ్పీటీసీలే నిలదీశారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన వివిధ స్థాయీ సంఘాల సమావేశంలో పలువురు మాట్లాడారు. వ్యవసాయ రంగానికి 11 గంటలే కరెంట్ఇస్తున్నారని సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. లక్ష్మణచాంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ మాట్లాడుతూ 57 ఏండ్లు నిండి ప్రతీ ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. పెన్షన్లు మంజూరు అయిన చోట్ల ఆఫీసర్లు పంపిణీ చేయడంలేదన్నారు. వృద్ధుల ఇండ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయాలని కోరారు. సారంగాపూర్జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ఖరాబైన రోడ్లను ఇంతవరకు రిపేర్చేయలేదని, ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో పన్నుల వసూలు సక్రమంగా జరగడంలేదని, ఇప్పటి వరకు కేవలం 27 శాతం మాత్రమే వసూలు అయ్యాయని పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్విజయలక్ష్మి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆర్టీసీ ఆఫీసర్లు స్పెషల్బస్సు నడిపించాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, డీసీవో శ్రీనివాస్ రెడ్డి, కుంటాల జడ్పీటీసీలు గంగామణి, శ్రీనివాస్ రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్డాక్టర్ సుభాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
రూ.80.50 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
మంచిర్యాల, వెలుగు: హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి భూ నిర్వాసితుల చిరకాల కోరికైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.80.50 కోట్లతో పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. ఇప్పటివరకు కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ద్వారా డి-42 కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తున్నారని అన్నారు. టెయిల్ ఎండ్ కు సరిపడా నీళ్లు రాకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా మరో లిఫ్ట్ నిర్మించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు పలుమార్లు విన్నవించగా రూ.80.50 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేస్తూ పాలనా అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే నివాసం వద్ద టిఆర్ ఎస్ నాయకులు పటాకలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఆఫీసర్లు ఎందుకు రాలేదు?
జడ్పీ చైర్ పర్సన్ సీరియస్
జైనూర్, వెలుగు: మండల సర్వసభ్య సమావేశానికి ఆఫీసర్లు ఎందుకు రాలేదని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి సీరియస్అయ్యారు. మంగళవారం జైనూర్‌లో నిర్వహించిన జర్నల్బాడీ మీటింగ్‌కు ఆమె హాజరయ్యారు. సమావేశానికి ఐదారుగురు ఆఫీసర్లు రావడం ఏమిటని ఫైర్అయ్యారు. అధికారులు మీటింగ్‌కు రాకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. రైతులు రబీ సాగు ప్రారంభించారని విద్యుత్సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. రాంనాయక్ తండాలోని తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. మండల కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మిషన్ భగీరథ ఏఈని కోరారు. అనంతరం కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్కనక యాదరావు. ఎంపీపీ తిరుమల, వైస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సామర్థ్యాలు పెంచాలి
మంచిర్యాల, వెలుగు: సర్కారు స్కూళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్లలో అవగాహన సామర్థ్యాలు పెంచేలా విద్యాబోధన చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉషోదయ హైస్కూల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ హెచ్ఎంలు, స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నేర్చుకున్న చదువును, జ్ఞానాన్ని తమ నిత్య జీవితానికి అన్వయించకొని నైతిక విలువలు పాటిస్తూ ఎదిగేలా సిద్ధం చేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం నిర్వహించే రివిజన్ క్లాస్‌లు పర్యవేక్షించేందుకు మండలాల వారిగా కమిటీలను నియమించామని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో అభివృద్ధి - పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. తొలిమెట్టు, డిసెంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్న జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల పంపిణీ తదితర అంశాలపై సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ రాహుల్, డీఈవో ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజాసంగ్రామ యాత్రలో బీజేవైఎం క్రియాశీలక పాత్ర
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ఐదోవిడత ప్రజాసంగ్రామ యాత్రలో బీజేవైఎం కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషిస్తారని జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ తెలిపారు. మంగళ వారం స్థానిక పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. యాత్రను సక్సెస్చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ కుమ్మరి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శులు పుప్పాల ఉపేందర్, పుట్నాల సాయినాథ్ పటేల్, నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ కొండాజి శ్రావణ్, జిల్లా ఉపాధ్యక్షుడు గిల్లీవిజయ్, జక్కుల గజేందర్, రావులవారి విఠల్, ఆకుల కార్తీక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ చేయండి
భైంసా/లోకేశ్వరం,వెలుగు: ముథోల్ సెగ్మెంట్లో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ కోరారు. మంగళవారం లోకేశ్వరం మండలంలోని హవరంగా, సాథ్ గాం, బిలోలి, మన్మథ్తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందన్నారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.