
- ఈ నెలలో కురిసిన వానలకు జిల్లాలో 1800 ఎకరాల్లో పంట నష్టం
యాదాద్రి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, వెలుగు : అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి, రామన్నపేట, బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిచిపోయాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన వడ్లను ఒకచోటకు చేర్చడానికి రైతులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు ఐదుసార్లు వడగండ్లతో కూడిన వర్షాలు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
పొలాలు తడవడంతో వరి కోతల పనులు ముందుకు సాగడం లేదు. మామిడి రైతులకు నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నెలలో తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, మోటకొండూరు, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి మొత్తంగా 1300 రైతులకు చెందిన 1800 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో 250 ఎకరాల్లో మామిడి, మిగిలిన 1550 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన రైతులు నష్టపోయారు.