పక్కా వివరాల కోసం డిజిటల్​ క్రాప్​ సర్వే 

పక్కా వివరాల కోసం డిజిటల్​ క్రాప్​ సర్వే 
  • ఈ సీజన్​ నుంచే పనులు ప్రారంభం 
  • సర్వేకు పొలం వద్దకు వెళ్లాల్సిందే
  • కచ్చితమైన వివరాల కోసం టెక్నాలజీ బాట
  • సర్వే నంబర్ల వారీగా పంటల ఫొటోలు
  • డీసీఎస్​యాప్​లో వివరాల నమోదు

యాదాద్రి, వెలుగు : డిజిటల్ క్రాప్​సర్వేతో పక్కాగా పంట వివరాలు నమోదు చేయనున్నారు. రాష్ట్రంలో రైతులు సాగు చేసే పంటలను ఇక నుంచి డిజిటల్ పద్ధతిలో సర్వే చేస్తారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి సర్వే నంబర్, సబ్​సర్వే నంబర్​లో ఫొటో తీసి డీసీఎస్​యాప్​లో అప్​లోడ్​ చేయనున్నారు. దీంతో కచ్చితమైన పంటల సాగు నమోదు అవుతుంది. ఈ సర్వే వ్యవసాయానికి సంబంధించిన స్కీమ్స్​ అమలుకు ఉపయోగకరంగా ఉంటుంది. 

పంట వివరాల నమోదు..

ప్రతి సీజన్​లో రైతులు పండిస్తున్న పంటల వివరాలను అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​నమోదు చేస్తోంది. అయితే కొన్నిసార్లు కొందరు అగ్రికల్చర్​స్టాఫ్​పొలాల వద్దకు వెళ్లకుండానే రైతుల వద్ద వివరాలు తీసుకొని నమోదు చేస్తున్నారు. దీంతో పంటల సాగు నమోదు చేసిన స్థాయిలో దిగుబడి ఉండడం లేదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలకు, స్టేట్​అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​వివరాల మధ్య వ్యత్యాసం ఉంటోంది. దీంతో ప్రతి రైతు పండించే పంటతోపాటు రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ ​క్రాప్​​ సర్వే ద్వారా సేకరించాలని గతంలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సర్వే నంబర్ల వారీగా రైతు పండిస్తున్న పంటను ఫొటో తీయడంతోపాటు ఒక్కో రైతు ఏ రకమైన పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాడన్న వివరాలను పూర్తిగా నమోదు చేయాలని గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో యాదాద్రి జిల్లాలోని బీబీనగర్​ మండలంతోపాటు ఇతర జిల్లాల్లోని కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించారు. అయితే ఈ వానాకాలం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్​క్రాప్ సర్వే నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

త్వరలోనే సర్వే..

కేంద్రం ఆదేశాలతో అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​డీసీఎస్​కు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం డిపార్ట్​మెంట్​ స్టాఫ్​కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సర్వే నిర్వహించాల్సిన విధానాన్ని వివరించింది. గతంలోనే పైలట్​ ప్రాజెక్టులో కొన్ని మండలాల్లో సర్వే నిర్వహించినందున అగ్రికల్చర్​స్టాఫ్​అందుకు సంసిద్ధంగానే ఉన్నారు. ఈ వానాకాలం సీజన్ ముగియబోతున్నందున సాధ్యమైనంత త్వరగా సర్వే చేపట్టనున్నారు. 

సర్వే విధానం ఇలా..

సర్వే నిర్వహించాల్సిన రెవెన్యూ గ్రామ సర్వే నంబర్లను భూముల హద్దులతో కూడిన మ్యాపులను ధరణి పోర్టల్​నుంచి అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్ రూపొందించిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్​) యాప్​లో డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సర్వే నంబర్లు, సబ్ సర్వే నంబర్లవారీగా యాప్​లో రికార్డ్ చేస్తూ పంటలు పండుతున్న భూముల ఫొటోలను తీసుకోవాల్సి ఉంటుంది. పంట వివరాలు, ఎంత విస్తీర్ణంలో వేశారో నమోదు చేసుకొని డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్​) యాప్​లో అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఒక్క సబ్ సర్వే నంబర్లకు సంబంధించిన ఫొటో తీయకున్నా అప్​లోడ్​కాదు.

అదేవిధంగా దూరంగా ఉండి ఫొటో తీసి అప్​లోడ్​ చేయడానికి వీలు లేదు. సర్వే నంబర్​కు 25 మీటర్ల దూరంలో ఉండి మాత్రమే ఫొటో తీసి అప్​లోడ్​చేసే అవకాశం ఉంది. దీని వల్ల ప్రతి సర్వే నంబర్​లోని భూమి వద్దకు కచ్చితంగా అగ్రికల్చర్ స్టాఫ్​దగ్గరకు వెళ్లి ఫొటోలు తీసి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. డిజిటల్​క్రాప్​సర్వే ద్వారా కచ్చితమైన పంటల నమోదు, రైతుల వివరాలు తీసుకోవడం వల్ల వ్యవసాయరంగంలో అమలు చేసే స్కీమ్స్​కు ఆధారంగా ఉంటుందని అగ్రికల్చర్ స్టాఫ్ అంటున్నారు. 

స్టాఫ్ సరిగా లేకుంటే డిజిటల్​ సర్వే సవాలే.. 

డిజిటల్ క్రాప్ సర్వే సవాల్​తో కూడుకున్నదే అని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంటున్నారు. ప్రతి సర్వే నంబర్, సబ్​ సర్వే నంబర్ వద్దకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉన్నందున స్పీడ్​గా సర్వే నిర్వహించడం సాధ్యంకాదంటున్నారు. గత సీజన్​లో బీబీనగర్​మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించడానికి 20 మంది స్టాఫ్​ను రంగంలోకి దించినా దాదాపు మూడు నెలల టైం పట్టిందని చెబుతున్నారు.

ఇప్పుడు ప్రతి మండలంలో సర్వే నిర్వహించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న స్టాఫ్ సరిపోదని, అదనంగా స్టాఫ్​ను తీసుకుంటేనే సర్వే సాధ్యమవుతుందని అంటున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ప్రతి వెయ్యి ఎకరాలకు విలేజ్ అగ్రికల్చర్​అసిస్టెంట్ (వీఏఏ)లను రిక్రూట్​చేసుకున్నారని చెబుతున్నారు. అక్కడి మాదిరిగానే వీఏఏలను రిక్రూట్​చేసుకుంటే స్పీడ్​గా సర్వే జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.