వ్యర్థాలతో కాలుష్యం కష్టాలు!

వ్యర్థాలతో కాలుష్యం కష్టాలు!
  • దెబ్బతింటున్న పంటలు, చనిపోతున్న చేపలు 
  • వాయు, జల కాలుష్యంతో వ్యాధుల బారిన ప్రజలు
  • నిబంధనలు పాటించని పరిశ్రమలు 

మెదక్​, శివ్వంపేట, వెలుగు:  మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట, బిజిలీపూర్ గ్రామ పరిధిలో ఉన్న ఆరు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ఈ పరిశ్రమల యాజమాన్యం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యర్థ రసాయన జలాలను బయటకు వదులుతోంది. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువల్లోకి చేరడంతో సాగునీరు కలుషితం అవుతోంది.  

చెరువుల్లో నీటిని సాగుకు మళ్లించడంతో పంటలు దెబ్బతింటున్నాయి. చేపలు చనిపోతున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాస కోశ ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 నవాపేట్ గ్రామంలో ఉన్న నాలుగు కెమికల్ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు పొలాల్లోకి చేరి పంటలు ఎండిపోతున్నాయి. ఈ చెరువులో గతంలో పెద్ద మొత్తంలో వ్యర్థాల విడుదల కారణంగా చేపలు చనిపోయాయి.  ఇదే గ్రామ పరిధిలోని మరో కంపెనీలో కోళ్ల వ్యర్థ పదార్థాలతో వంట ఆయిల్ తయారు చేస్తారు.  కంపెనీలో వెలువడే వ్యర్థ జలాలను గ్రామ శివారులో కుంటను ఏర్పాటు చేసి అందులో డంపు చేస్తున్నారు.

వర్షాలు కురిసినపుడు ఆ కుంట నుంచి కలుషితమైన నీరు పంట పొలాల్లోకి చేరుతున్నాయి. రోజూ రాత్రి పొగ వదలడం వల్ల ఆ దుర్వాసనతో  శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు  విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  బిజిలీపూర్ గ్రామ శివారులో పొలాల మధ్య రెండు కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి.  రెండు కంపెనీల మధ్య  కుంటలా ఏర్పాటు చేసి వ్యర్థ జలాలను అందులోకి  వదులుతున్నారు. వర్షం వచ్చినప్పుడు కలుషితమైన ఆ కుంటలోని నీరు పొలాల్లోకి చేరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.  

బోరు నీరు కలుషితం

పరిశ్రమల నుంచి వ్యర్థ రసాయనాలను విచ్చలవిడిగా వదలి పెట్టడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకి బోరు నీరు కూడా కలుషితం అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. బోర్లలో నుంచి కలుషిత జలాలు వస్తున్నాయని, ఆ నీరు పంటలకు పారిస్తే దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పరిశ్రమల నుంచి వస్తున్న దుర్వాసనకు గ్రామంలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న రైతులు

మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామ శివారులో ఓ ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ కంపెనీని ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు పలుమార్లు కంపెనీ ముందు టెంటు వేసి ధర్నాకు దిగారు. గ్రామస్తులు అందరు కలిసి ఈ కంపెనీ తమ  గ్రామంలో ఏర్పాటు చేయొద్దని తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్, ఎంపీడీవో, పీసీబీ అధికారులకు అందజేశారు.

బోర్లలో కలుషిత నీరు

కెమికల్ కంపెనీల నుంచి విడుదల చేస్తున్న కలుషిత జలాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. వ్యవసాయ బోర్లలో నుంచి కెమికల్ వాటర్ వస్తున్నాయి. ఆ నీటిని సాగుకు వాడటం వల్ల పంటలు  పంటలు దెబ్బతింటున్నాయి. - రాంరెడ్డి, రైతు, నవాపేట

పంటలు మాడిపోతున్నాయి

కెమికల్ కంపెనీ నుంచి వెలువడే కలుషిత జలాల కారణంగా వేసిన పంటలు మాడిపోతున్నాయి. కంపెనీ నుంచి వచ్చే పొగాకు శ్వాస ఆడడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. - బాల్​రెడ్డి, రైతు, నవాపేట