- స్కీమ్ అమలుకు గైడ్‌లైన్స్ సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
- ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల ప్రీమియం అంచనా
- రైతు రూపాయి కూడా చెల్లించక్కర లేదు
- మొత్తం ప్రీమియం సర్కారే చెల్లిస్తుంది
- ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో గైడ్‌లైన్స్ రెడీ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం యూనిట్‌గా, వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 నుంచి ఫసల్ బీమా పథకాన్ని నిలిపివేసింది. దీంతో గత ఐదేండ్లుగా పంటలు నష్టపోయిన రైతులు పరిహారం అందక తీవ్రంగా నష్టపోయారు. తాజాగా కొత్త సర్కారు రాష్ట్రంలో తిరిగి పంటల బీమాను అమలు చేయాలని సంకల్పించింది. అంతేకాకుండా.. పంటల బీమా కోసం రైతులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీంతో రైతులకు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా పంటల బీమా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో అమలు చేసే పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర సర్కారే భరించనుంది.
పరిస్థితులకు అనుగుణంగా స్కీమ్ అమలు
అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు అకాల వర్షాలతో నష్టం జరిగితే మరో రకంగా, దిగుబడి చాలా స్వల్పంగా వస్తే పరిహారం అందించేందుకు మరో రకంగా ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా స్కీమ్‌ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇలా పలు రకాలుగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో వెసులుబాటు కల్పిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనున్నారు. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడానికి గైడ్‌లైన్స్ రూపకల్పనకు తుదిరూపం ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.
ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల ప్రీమియం!
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనాల మేరకు ప్రతీ రెండు సీజన్లకు కలిపి రూ.2 వేల కోట్లు ప్రీమియం రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు మేర ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.