- రెండు స్కీమ్‌లకు రూ.69,515 కోట్లు
- బీమా అమలుకు టెక్నాలజీ.. ఇందుకు రూ.824 కోట్లు.. డీఏపీపై సబ్సిడీ కొనసాగింపునకూ కేంద్రం ఓకే
- రూ.1,350కే 50 కిలోల డీఏపీ బస్తా
- కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులకు పంటల బీమాను మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీని కూడా కొనసాగించేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ‘ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ’ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
పంటలను నష్టపోయే రైతులకు బీమా పరిహారం అందించే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్ బీవై), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్ డబ్ల్యూబీసీఐఎస్)లను 2025–26 వరకూ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం పీరియడ్ కు అనుసంధానం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ రెండు పంటల బీమా పథకాలకు 2024–25లో రూ. 66,550 కోట్లు కేటాయించగా.. తాజాగా 2025–26వ సంవత్సరానికి రూ. 69,515.71 కోట్లకు (రూ. 2,965.71 కోట్లు అధికం)పెంచినట్టు ప్రకటించారు. అలాగే ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు టెక్నాలజీని జోడించాలని కేబినెట్ నిర్ణయించిందని, ఇందుకోసం రూ. 824.77 కోట్లను కేటాయించిందన్నారు.
ప్రస్తుతం ఫసల్ బీమా పథకం దేశ్యాప్తంగా 23 రాష్ట్రాలు, యూటీల్లో అమలవుతోందన్నారు. కాగా, పంజాబ్ లో ఉద్యమం చేస్తున్న రైతులను ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. ‘‘మీరు హర్యానా ఎన్నికల సమయంలో తిరిగి చూసి ఉంటే తెలిసేది. రైతుల నుంచి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మీరు కూడా ఆ టైంలో హర్యానాలో తిరిగి ఉంటే ఆందోళనలు.. నిజమైన సంక్షేమం.. రైతులకు మంచి చేయడంపై వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను తెలుసుకునేవారు” అని బదులిచ్చారు.
టెక్నాలజీతో పంట నష్టం అంచనా..
కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు రెండు పంటల బీమా పథకాల అమలులో యెస్- టెక్ (యీల్డ్ ఎస్టిమేషన్ సిస్టం యూజింగ్ టెక్నాలజీ), విండ్స్ (వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్ వర్క్ డేటా సిస్టమ్స్) అనే రెండు రకాల టెక్నాలజీలను వినియోగించనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ టెక్నాలజీల వాడకంతో పంట నష్టాన్ని చాలా వేగంగా అంచనా వేయొచ్చని, పరిహారం విషయంలో వివాదాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. అలాగే పథకాల్లో ఎన్ రోల్ మెంట్, కవరేజ్ కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటిలో యెస్-టెక్ విధానంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వాడనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఏపీ, అస్సాం, హర్యానా, యూపీ సహా 9 రాష్ట్రాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. విండ్స్ విధానం కూడా 9 రాష్ట్రాల్లో అమలులోకి వచ్చిందని వివరించింది.
రైతుల కోసమే తొలి నిర్ణయం: మోదీ
కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తొలి నిర్ణయాన్ని రైతుల సంక్షేమం కోసమే తీసుకున్నదని ప్రధాని మోదీ తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘న్యూఇయర్‌లో తొలి నిర్ణయం కోట్లాది మంది రైతుల కోసమే. పంటల బీమా పథకాన్ని పొడిగించేందుకు ఆమోదం తెలిపాం. దీనివల్ల పంట నష్టపోయే రైతులకు పరిహారం అంది ఎంతో ఊరట లభిస్తుంది. అలాగే డీఏపీపై వన్ టైమ్ ప్యాకేజీని పొడిగించాం. దీనివల్ల రైతులకు అందుబాటు ధరలకే ఫర్టిలైజర్ దొరుకుతుంది” అని మోదీ తెలిపారు.
ఇండోనేసియాకు బాస్మతియేతర బియ్యం..
ఇండోనేషియాకు 10 లక్షల టన్నుల బాస్మతియేతర బియ్యం ఎగుమతికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ (ఎన్ సీఈఎల్) ద్వారా ఈ ఎగుమతులు చేపట్టనున్నట్టు కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. ఇందుకోసం ఎన్ సీఈఎల్, కేంద్ర సహకార శాఖ, ఇండోనేషియా ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు.
డీఏపీపై సబ్సిడీ కొనసాగింపు..
రైతులకు అందుబాటు ధరలకే ఎరువులు దొరికే విధంగా డై-అమోనియం ఫాస్ఫేట్(డీఏపీ)పై సబ్సిడీని కూడా పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 50 కేజీల డీఏపీ బస్తాను రూ. 1,350కే అందించాలని, ఒక్కో డీఏపీ బస్తాపై పడే అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఖజానాపై రూ. 3,850 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాగా, ఎరువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు గాను గత ఏడాది డీఏపీపై కేంద్ర ప్రభుత్వం వన్ టైమ్ ప్యాకేజీ కింద టన్నుకు రూ. 3,500 ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,625 కోట్ల ప్యాకేజీ కేటాయించింది. ఈ ప్యాకేజీ 2024 ఏప్రిల్ 1న ప్రారంభమై, డిసెంబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో టన్నుకు రూ. 3,500 స్పెషల్ ప్యాకేజీని కూడా పొడిగించాలని, 2025 జనవరి 1 నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చేదాకా ఈ పొడిగింపు అమలులో ఉంటుందని తెలిపింది. కాగా, మోదీ ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకూ ఫర్టిలైజర్స్ పై రూ. 11. 9 లక్షల కోట్ల సబ్సిడీ అందజేసింది.