పంట రుణమాఫీ రూ.17 వేల కోట్లకు పరిమితం : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

పంట రుణమాఫీ రూ.17 వేల కోట్లకు పరిమితం : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

 

  • రైతులకు కాంగ్రెస్​ సర్కారు  మోసం 


నిజామాబాద్, బాల్కొండ​, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి రూ.31 వేల పంట రుణాలు మాఫీ చేస్తానని అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలప్పుడు ప్రచారం చేసి మాఫీని రూ.17 వేల కోట్లకు పరిమితం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. ఇది రైతులను మోసం చేయడమే అన్నారు. 14 లక్షల మందికి మాఫీ లబ్ధి దూరం చేశారని తెలిపారు. శుక్రవారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ జిల్లా పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన ప్రతిచోటా దేవుళ్లమీద ప్రమాణం చేసి ఆఖరుకు దేవుళ్లను మోసం చేశారని పచ్చి అబద్దాలు మాట్లాడడంలో రేవంత్​ డాక్టరేట్​ పొందారని ఎద్దేవా చేశారు. 

అబద్ధం అనే మాట ఆత్యహత్య చేసుకునేలా ఆయన మారారన్నారు.  సగం మంది రైతులకు  రుణమాఫీ చేసి మాజీ మంత్రి హరీశ్ రావును రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీ పేరుతో రైతుబంధుకు శఠగోపం పెట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ నాయకులు సత్యప్రకాశ్, సిర్పరాజు, రవి చందర్, సుజిత్​ఠాగూర్, మురళి తదితరులున్నారు.