పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మూడేళ్లుగా పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించడం లేదు. దాదాపు రూ. 13 కోట్ల వరకు పరిహారం రైతులకు అందాల్సి ఉంది. దీంతో పాటు రైతులు పండించే పంటలకు బీమా చేయించడం లేదు. మూడేళ్లుగా అకాల వర్షాలు, బ్యాక్ వాటర్ వల్ల పంటలు ముంపునకు గురవుతున్నాయి. అధికారులు వచ్చి రిపోర్టులు రాసుకుని వెళుతున్నారు. తప్పా ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం ఇవ్వడం లేదు. గత నెలలో కురిసిన అకాల వర్షానికి 4375 ఎకరాల్లో వరి, 1788 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. మళ్లీ అధికారులు వచ్చి పంట నష్టం గురించి రాసుకొని వెళ్లారు.
పరిహారం ఒక్కసారే ఇచ్చిండ్రు
మూడేళ్ల కిందట ఒకసారి పంట నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19 వేల పరిహారంగా నిర్ణయించి ఇచ్చారు. తర్వాత నష్టపోయిన పంటలకు రూపాయి కూడా ఇవ్వలేరు. మానేరు, గోదావరి పరివాహాక గ్రామాల్లో ఏటా అధిక వర్షాలు బ్యారేజీల బ్యాక్ వాటర్‌తో పంటలు నీట మునుగుతున్నాయి. క్రాప్ హాలీడే కింద నష్టపరిహారం ఇస్తామని ముంపు అనుమానం ఉన్న ప్రాంతాల్లో పంటలు వేయవద్దని అధికారులు చెప్పారు. . ఇప్పటి వరకు నీట మునిగిన పంటకు పరిహారంగా, క్రాప్ హాలిడే కాంపన్సేషన్ ఇవ్వలేదు. మంథని మండలంలో దాదాపు 4000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సిడీ కింద పరిహారం ఇవ్వాలి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే కనీసం రైతులకు కొంతమేరైనా లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్లుగా మునుగుడే...
2019 అక్టోబర్‌లో జిల్లాలోని 16 వేల మంది రైతులకు చెందిన 20 వేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. 2020–21 ఆగస్టు, సెప్టెంబర్‌లో వానలకు వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. గత నెలలో పడ్డ వడగండ్ల వానలకు 1938 మంది రైతులకు సంబంధించిన 4375 ఎకరాల్లో వరి, 1423 మంది రైతులకు చెందిన 1788 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. యథావిధిగా పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసుకొని వెళ్లిపోయారు. గతంలో జరిగిన పంట నష్టానికే ఇప్పటి వరకు పరిహారం రాలేదు. ఈ సంవత్సరం కొత్తగా 33 శాతాన్ని మించి నష్టపోతేనే పరిహారం వస్తుందని సర్కార్ కొత్త మెలిక పెట్టింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు, రైతు నాయకులు ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
చేతికొచ్చిన పంట చేజారిపోయింది
అకాలంగా కురిసిన వడగండ్ల వాన వల్ల దాదాపు పది ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయా. అధికారు లు వచ్చి సర్వే చేసుకొని పోయిండ్రు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పంటలపై దాదాపు రెండు, మూడు లక్షలు పెట్టుబడి పెట్టాం. నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి
గుర్రం మల్లారెడ్డి, రైతు, లాల పల్లె, పెద్దపల్లి జిల్లా