- భూమి లేనివారికీ ఇస్తున్నరని వరంగల్ రైతుల ఆగ్రహం
- లిస్టులో తమపేర్లు ఎందుకు తీశారో చెప్పాలని ఫైర్
- ధర్నాలు..పలుచోట్ల అగ్రికల్చర్ ఆఫీసర్ల నిర్బంధాలు
- మద్దతుగా రోడ్డెక్కిన విపక్షాలు
- మిస్సైనవాళ్లకు పనిముట్లలో ప్రాధాన్యమిస్తామన్న ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో గత మార్చిలో కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వేలాది మంది రైతులు తమ చేతికొచ్చిన మక్క జొన్న, మిర్చి వంటి పంటలను కోల్పోయి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతును ఆదుకుంటామని, అధికారులు రేపోమాపో వచ్చి సర్వే చేస్తారని ప్రకటించింది. వారం పది రోజుల్లోనే పరిహారం ఇస్తామని చెప్పింది.
చివరకు ఆరు నెలలకు నష్టపరిహారం చెక్కులు రాగా, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తున్నారు. కానీ, చాలా గ్రామాల్లో పంట నష్టపోయిన రైతుల పేర్లు లిస్టుల్లో లేవు. అదే టైంలో అసలు భూములు, పంటలు లేని అధికార బీఆర్‍ఎస్ పార్టీ నేతలు, కేడర్ పేర్లు పరిహారం లిస్టుల్లో ఉండడంతో రైతులు మండిపడుతున్నారు. గ్రామాలకు వస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లను బంధిస్తున్నారు.
అంతటా రైతుల ఆందోళనలు..
నెలలో ఇస్తామన్న పరిహారం ఆరు నెలల తర్వాత ఇస్తున్నారనే కోపంతో రైతులుండగా..లిస్టులో పేర్లు లేకపోవడంతో వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయిలో ఈ నెల 5న అర్హులైన రైతులకు పంట సాయం అందలేదని గ్రామస్తులు అగ్రికల్చర్ ఏవో రాజేందర్‍ను రైతు వేదికలో నిర్భందించారు.
కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని నిరసన తెలిపారు. సంగెం పోలీసులు వచ్చి పరిహారం అందించేలా చూస్తామని సముదాయించి అధికారిని విడిపించారు. 6వ తేదీన నెక్కొండ మండల కేంద్రంలో సూరిపల్లి, తోపనపల్లి, అప్పల్‍రావుపేట, గుండ్రపల్లికి చెందిన రైతులు ఏఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.
నిజమైన బాధితుల పేర్లు తీసేసి.. అప్పల్‍రావుపేటలో 24 మందితో పాటు చాలా గ్రామాల్లో గుంట భూమి లేని వారి పేర్లు ఎలా చేర్చారంటూ ఫైర్అయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు చెప్పినవారికి, ఆ పార్టీ కార్యకర్తలకు భూములు లేకున్నా ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 8న పంట నష్టపరిహారం చెల్లింపులో వివక్ష చూపారనే కోపంతో చెన్నారావుపేట మండలం ఏఈవో స్మితపై రైతులు దాడి చేశారు. ఇదే తరహా నిరసనలు నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోనూ జరిగాయి.
అవకతవకలపై విపక్షాల ధర్నాలు
నష్టపరిహారం బాధిత రైతులకు కాకుండా బీఆర్‍ఎస్ పార్టీ ఫేవర్ ఉన్నవారికి వస్తుండడంతో విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఆందోళనలు చేశాయి. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ధర్నాలు చేశారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు.
నల్లబెల్లి 365 నేషనల్ హైవేపై అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. ఖానాపూర్ మండలంలో రాస్తారోకోలు జరిగాయి. అప్పల్‍రావుపేటలో బీఆర్‍ఎస్ నేతలకు లేని భూములను సృష్టించి పరిహారం అందించారనే ఆరోపణలతో బాధిత రైతులతో కలిపి అపోజిషన్పార్టీలు నిరసనలకు దిగాయి.
పంట సాయం రాకుంటే..పనిముట్లు ఆఫర్
పంట నష్టపరిహారం రాలేదని కోపంతో ఉన్న రైతులను సముదాయించేందుకు సబ్సిడీ పనిముట్లు అందిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పంట నష్టపరిహారం నమోదులో పలుచోట్ల తప్పులు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. సాయం అందని బాధిత రైతులు ఏవో ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి సూచించారు.
రూ.10 వేల పరిహారం రానివారికి రూ.20వేల సబ్సిడీ ఉండే యాంత్రికరణ స్కీంలో ప్రయారిటీ ఇస్తానని బుజ్జగిస్తున్నారు. ఇదే తరహాలో మిగతా ప్రాంత ఎమ్మెల్యేలు కూడా రైతులను సముదాయిస్తున్నారు.
ఎకరానికి రూ.10 వేలు ఇస్తామన్న సీఎం కేసీఆర్
మార్చిలో వానలకు పంటలు మునగడంతో సీఎం కేసీఆర్ వరంగ ల్జిల్లా పర్యటనకు వచ్చారు. అదే నెల ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం, రావినూతల, గార్లపాడుతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండలం రెడ్డికుంట తండా, వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవి రంగాపురం, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపురంలో పర్యటించారు.
పంట నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..వెంటనే రూ.220 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కౌలు తీసుకుని సాగు చేసే రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు. గతంలో మాదిరి కాకుండా నెలలోపే సాయం అందేలా చూస్తామన్నారు.
కన్నీరు పెట్టినా కనికరించలే..
అకాల వర్షాలకు ఏడెకరాల్లో వేసిన పంట దెబ్బతింది. మా గ్రామానికి వచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి నా పొలాన్ని పరిశీలించాడు. అప్పుడు పాడైన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకున్నా...దీంతో ఆయన నాకు తప్పకుండా పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.
తీరా చూస్తే..లిస్టులో నా పేరు లేదు. అధికారులను అడిగితే ఎట్లా మిస్ అయిందో తెల్వదు అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే ఇంటికి పోయి చెప్పిన. ఈసారి వ్యవసాయ పనిముట్లు ఇప్పిస్తా అన్నడు.
– జాటోతు శ్రీను (కొత్తూర్, ఖానాపూర్ మండలం, వరంగల్)
పంట నష్టం జరగనోళ్లకు ఇచ్చిన్రు
నా రెండెకరాల పంట అకాల వర్షాలకు తుడిచిపెట్టుకుపోయింది. అధికారులు మా వివరాలు తీసుకున్నారు. తీరా చూస్తే లిస్టుల్లో అసలు భూములు లేని, పంటలు వేయనివారి పేర్లను చేర్చారు. రాజకీయ జోక్యం వల్లే అక్రమాలు జరిగాయి.
– పెండ్యాల కృష్టమూర్తి తిమ్మంపేట, దుగ్గొండి మండలం