హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు యాసంగి పంటలను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే టైంలో చెడగొట్టు వానలు రైతులను ముంచేస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల్లో తేలింది. ఇప్పటికే గత నెలలో 5 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి.
నెల గడిచినా పరిహారం అందలే..
అకాల వర్షాలు, వడగండ్లతో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు ఎయిర్ సర్వేలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. గత నెల 23న సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి ఎకరానికి రూ.10 వేలు పరిహారం ప్రకటించారు. ఈ ప్రకటన చేసి నెల దాటినా ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు.
ఇప్పటికే 9.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం
గత మార్చి నెల 17 నుంచి కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో మొదట 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా.. తాజాగా మరో 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఫీల్డ్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు 32 అంశాలతో ఎన్యూమరేషన్ చేపట్టారు. ప్రతి జిల్లాలోని క్లస్టర్ల వారీగా పంట లెక్కలు ఏవోలు, డీఏవోల ద్వారా కలెక్టర్లకు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కలెక్టర్ల నివేదికలు తేల్చగా.. వాటిని పరిశీలించి 1,51,645 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 1,30,988 మంది రైతులు పంట నష్టపోయారని వారికి రూ.151.64 కోట్ల నష్ట పరిహారం అందిస్తామని ప్రకటించారు. గత నెల మరోమారు పంట నష్టంలో అధికారులు కోత పెట్టి కేవలం 30% మాత్రమే పంట నష్టం ప్రకటించారు.
కేంద్ర నిధులకు తగ్గట్లుగా..
ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.160 కోట్ల నిధులను రాష్ట్రానికి విడుదల చేసింది. దీనికి తగ్గట్లుగా నిధులు సర్దుబాటయ్యేలా మెదటి విడతలో రూ.151.64 కోట్లు పంటనష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రైతుల కష్టాలు పట్టించుకోని అగ్రికల్చర్ పెద్దాఫీసర్లు
రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే అగ్రికల్చర్ పెద్దాఫీసర్లు హైదరాబాద్ నుంచి పంట నష్టం జరిగిన ప్రాంతాలకు వెల్లడంలేదు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించి అధికారుల బృందాలు పర్యటించి రైతుల బాగోగులు తెలుసుకోవాల్సి ఉంది. అగ్రికల్చర్ కమిషన్ రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు సహా అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు ఎవరూ తాజగా పంట నష్టం జరిగిన ప్రాంతాలకు వెళ్లక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.