నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు చోట్ల, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో గత రెండు రోజులుగా 30 మి.మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇటీవలే జిల్లాల్లో వరికోతలు షురూ కాగా రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో బోధన్, వర్ని , లింగంపేట, నాగిరెడ్డిపేట, రాజంపేట, బాన్స్వాడ, బీర్కుర్, ఎల్లారెడ్డి మండలాల్లో అరబోసిన వడ్లు, మక్కల కుప్పలు తడిశాయి. కొనుగోలు సెంటర్ల వద్ద అరబోసిన వడ్ల కుప్పల్లోకి వరద నీరు చేరింది. రాసుల్లో నుంచి వాన నీటిని బయటకు పంపేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పిట్లం, నిజాంసాగర్, లింగంపేట మండలాల్లో వరి పంట నేలకొరిగింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన వడ్లను సర్కార్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్‌లో పెరిగిన వరిసాగు..
జిల్లాలో ఖరీఫ్ లో 4.18 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా.. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే 30 వేల ఎకరాలలో వరి సాగు పెరిగింది. నెల రోజుల ముందే బోధన్ డివిజన్ పరిధిలో వరి కోతలు షూరు చేశారు. సీజన్ ప్రారంభంలోనూ వర్షాలతో సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కోతల సమయంలోనూ వర్షాలు కురుస్తుండటంతో మరింత నష్టం కలుగుతోందని రైతులు అంటున్నారు. ఈ వానలతో వడ్లలో తేమ శాతం పెరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తరుగు తీయొద్దు..
వర్షాలతో వడ్లు తడిశాయి. వడ్లను ఆరబెట్టి పంపితే కూలీల భారమవుతోంది. 2 నుంచి 3 కిలోల కడ్తా తీస్తే రూ. 100 నష్టం వస్తుంది. ధాన్యం కొనుగోళ్లల్లో తరుగు తీయకుండా చర్యలు చేపట్టాలి. తేమశాతం పెరిగితే కడ్తా కోత ఎక్కువగా ఉంటుంది. వడ్లను మొత్తం ప్రభుత్వమే కొనాలి. రైతులకు నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలి.
- ముత్యాలరావు రైతు వర్ని రైతు, నిజామాబాద్ జిల్లా
మొలకలు వచ్చినయ్
రెండెకరాల్లో మక్క పంట వేసినం. 5 రోజుల క్రితం కోసి రోడ్డుపై కంకులను ఆరబోసినం. సగం ఎండిన తర్వాత 3 రోజుల నుంచి వర్షం వస్తుండటంతో తడిశాయి. చాలా కంకులకు మొలకలు వచ్చాయి. చేతికొచ్చిన పంట వరద పాలవుతోంది.
- సాయవ్వ, గుండారం,
కామారెడ్డి జిల్లా
నిండుకుండలా ఎస్సారెస్పీ
ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి పెరుగుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. భారీ ఇన్ ఫ్లోతో 22 వరద గేట్లను శనివారం ఓపెన్ చేశారు. 1,17000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ లోకి 1,36,118 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లోగా వస్తోంది. ఉదయం నుంచి 86 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో తో గంటగంటకు వరద నీరు చేరుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదనీరు చేరినట్టు అధికారులు వెల్లడించారు. 2 రోజులుగా అల్పపీడన ద్రోణి తో ఎస్సారెస్పీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కరువడంతో వరద నీరు చేరుతోంది. ఈ ఎడాది ఎస్పారెస్పీలోకి 491 టీఎంసీల వరదనీరు చేరగా 420 టీఎంసీ లను గోదావరినదిలోకి విడుదల చేశారు. ఈనెల 14 నుంచి 15వ వరకు 46652 క్యూసెక్కులు వరదనీరు ప్రాజెక్ట్‌లోకి చేరినట్టు అధికారులు తెలిపారు.
రబీసాగుపై పెరిగిన ఆశలు
ఎస్సారెస్పీకి వరద నీరు చేరడంతో ఆయకట్టు రైతుల్లో రబీ సీజన్ పై ఆశలు పెరిగాయి. భారీ ఇన్ ఫ్లో ఉండడంతో రబీ సీజన్ లో పూర్తిస్థాయిలో సాగునీరందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని ఎస్సారెస్పీ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఔట్ ఫ్లో రిలీజ్ తో ఆయకట్టు ముంపు గ్రామాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లోని చెరువుల్లో వరద కాలువలో చేపలవేటకు వెళ్లొద్దన్నారు.