కల్తీ విత్తనాలతో పంట నష్టపోయాం

కల్తీ విత్తనాలతో పంట నష్టపోయాం
  • హనుమకొండ జిల్లా శాయంపేటలో షాపు ఎదుట బాధిత రైతుల ఆందోళన
  • నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్

శాయంపేట, వెలుగు :  కల్తీ విత్తనాలతో వరి పంటలు నష్టపోతున్నామని, అందుకు పరిహారం చెల్లించాలని రైతులు ఆందోళన చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం హుస్సేన్ పల్లికి చెందిన పలువురు బాధిత రైతులు మాట్లాడారు. మండల కేంద్రంలోని శంకర్ ఫెర్టిలైజర్స్ షాపు యశోద కంపెనీకి చెందిన జై శ్రీరామ్ 20 బస్తాల వరి విత్తనాలు కొనుగోలు చేసి.. 20 ఎకరాల్లో సాగు చేశామని పేర్కొన్నారు.  కల్తీ విత్తనాలు కావడంతో వరి పంటకు  వేర్వేరుగా గొలుసులు వచ్చి వడ్లు రాలి పోతుండగా వెంటనే విత్తనాలు అమ్మిన డీలర్ శంకర్ కు, వ్యవసాయాధికారులకు సమాచారం అందించామని చెప్పారు.  అనంతరం వ్యవసాయ అధికారులు, విత్తనాల కంపెనీ ప్రతినిధులు వెళ్లి వరి పొలాలను పరిశీలించి కల్తీ విత్తనాలుగా నిర్ధారించారు. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చి.. ఎంతకూ పట్టించుకోకపోవడంతో పాటు  డీలర్ నిర్లక్ష్యంగా ఉంటుండగా రైతులు ఆగ్రహం చెంది.. శుక్రవారం షాపు ముందు నిరసన తెలిపారు.

న్యాయం చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి గంగా జమునకు ఫిర్యాదు చేశారు. వరి పంటను  పరిశీలించినపుడు గొలుసుల్లో తేడాను గుర్తించినట్లు ఆమె చెప్పారు. రైతులకు ఎక్కువగా నష్టం జరగలేదని, విత్తనాల కంపెనీతో మాట్లాడుతున్నామని డీలర్ శంకర్ చెప్పారు. రైతులు వజీరు శంకర్ రావు, రాయరాకుల మొగిలి, రాజేందర్, నిరంజన్ రావు, రాజన్న, రామయ్య, అయిలయ్య, గోపాల్ రావు, మహేందర్, భాస్కర్, 
మధుకర్ ఉన్నారు.