కరీంగనగర్ జిల్లాలో 12 వేల ఎకరాల్లో పంట నష్టం

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షంతో మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలన్నీ రాలిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున నేలకూలిన మొక్క జొన్న, మిరప చేన్లు, వరి పొలాలను చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. శనివారం రాత్రి కురిసిన వర్షాలు, పడిన వడగండ్లతో 12,100 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ వెల్లడించారు. అంతకు ముందు గురువారం రాత్రి కురిసిన వర్షానికి 2,500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 14,500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 2 వేల ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు అంచనా వేశారు. 

గంగాధర మండలంలో 4,948 ఎకరాల్లో వరి, 450 ఎకరాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 100 ఎకరాల్లో కూరగాయల తోటలు పూర్తిగా పాడైపోయాయి. కొత్తపల్లి మండలంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఏవోలు చెప్పారు. ఇల్లందకుంట మండలంలో 420 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 1215 ఎకరాల్లో పంట నేలకొరిగింది. జమ్మికుంట మండలంలో శనివారం కురిసిన వర్షానికి 1,420 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మండలంలోని కాపులపల్లి, పాపయ్యపల్లి, బిజిగిరి షరీఫ్ గ్రామాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. 14 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, పొట్టకొచ్చి ఈనుతున్న సుమారు 200 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది.  

 గన్నేరువరం మండలంలో వడగండ్ల తో 169 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం కలిగింది.  రామడుగు మండలం వెదిర గ్రామంలో  దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ పరిశీలించారు. రామడుగు మండలం వెదిర, షానగర్, పందికుంటపల్లి, కిష్టాపూర్, వెలిచాల గ్రామాల్లో మొత్తం 9 ఎకరాల్లో మొక్కజొన్న, 212 ఎకరాల్లో వరిపంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. 

వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని రెడ్డిపల్లి హిమ్మత్ నగర్, కొండపాక గ్రామాల్లో  అకాల వర్షానికి 1850 ఎకరాల్లో వరి,  2074 ఎకరాల్లో మొక్కజొన్న చేతికి రాకుండాపోయింది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల పోచయ్య  ఇంటిపై తాడిచెట్టు పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.హుజురాబాద్ మండలంలో 21 ఎకరాల్లో వరి పంట, 91 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.  సైదాపూర్ మండలంలోని  మొక్కజొన్న 409 ఎకరాల్లో, 74 ఎకరాల్లో వరి దెబ్బతింది. 

తోటలపై ఆశ లేదు 

గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లో 25 ఎకరాలకు పైగా మామిడి తోటలను కౌలుకు తీసుకున్న. గంగాధర  శివారులోని ఎనిమిది ఎకరాల మామిడి తోటను రూ.12 లక్షలకు కౌలుకు తీసుకున్న. చెట్టు కాసిన కాయలన్నీ రాళ్ల వానతో రాలిపోయాయి.  ఒక్క కాయ కూడా మిగల్లే. అప్పులే తప్ప ఏమి మిగిలేటట్టు లేదు. ఈ ఏడాది మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులకు అప్పులు తప్పా పైసా వచ్చేటట్లు కనిపించట్లేదు.
- కోతి మహేష్ కౌలు రైతు

అప్పులు ఎలా తీర్చాలో..

నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసిన. పంటలను అడవి పందుల నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న. సాగు కోసం రూ. లక్ష పెట్టుబడి పెట్టిన. చేతికి వచ్చిన సమయంలో వడగండ్ల అకాల వర్షం కారణంగా మూడెకరాల పంట ధ్వంసమైంది. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. 
పుల్లెల తిరుపతి, గన్నేరువరం