నల్గొండ జిల్లాలో 14 వేల ఎకరాల్లో పంట నష్టం

సూర్యాపేట, వెలుగు: అకాల వర్షంతో రైతులు, ప్రజలు ఆగమాగమవుతున్నారు. సూర్యాపేట జిల్లాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మేళ్లచెరువు మండల కేంద్రంలో మహాశివరాత్రి జాతర కోసం భారీ కటౌట్లు కట్టి ఇంకా తొలగించకపోవడంతో గాలివానకు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 12,835 ఎకరాలలో వరి,  44ఎకరాలలో మొక్కజొన్న, 1300 ఎకరాలలో మామిడి, 250 ఎకరాలలో మిర్చి నష్టం వాటిల్లింది. 14,429 ఎకరాలలో 7097 మంది రైతులు నష్టపోయారు. అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామం, ఆర్డీవో రాజేంద్ర కుమార్ తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో అగ్రికల్చరల్ అధికారి రామారావు నాయక్ పంట పొలాలను పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావు భరోసానిచ్చారు. 

యాదాద్రిలో..

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. మోత్కూరు, ఆత్మకూర్ (ఎం), గుండాల, అడ్డగూడూరులో వడగండ్లకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 433.2 మిల్లీ మీటర్ల వాన కురువగా 1992 మంది రైతులకు చెందిన 4282 ఎకరాల్లో వరి పంట నష్ట జరిగినట్లు అధికారులు తెలిపారు. 10 మంది రైతులకు చెందిన 70 ఎకరాల్లో మా మిడి, నిమ్మ, మిర్చి తోటలు దెబ్బతిన్నాయన్నారు. 

చిట్యాలలో.. 

నార్కట్​పల్లి : చిట్యాల మండలంలో ఆది వారం మధ్యాహ్నం పలు గ్రామాల్లో వడగండ్ల వా న కురిసింది. మండలంలోని గుడ్రంపల్లి గ్రామం లో నిమ్మతోటలోని కాయలన్నీ రాలిపోయాయి. 

అన్నీ ఇబ్బందులే... 

తుంగతుర్తి : తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి, రావులపల్లి, మానాపురం, తిరుమలగిరి మండల పరిధిలోని జలాల్​పురం, తాటిపాముల గ్రామాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. తిరుమలగిరి మున్సిపల్​ కేంద్రంలోని జనగాం- సూర్యాపేట, తొర్రూరు ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. తిరుమలగిరి మండల పరిధిలోని నెల్లిబండతండాలో గోడకూలి 20 గొర్రెలు మృతి చెందాయి. అకాల వర్షంతో పాటు గాలికి ఇండ్ల పైకప్పులు లేచి పడ్డాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిల్చిపోయింది. ఆదివారం వ్యవసాయశాఖ, హర్టీ కల్చర్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి, రావులపల్లి, మానాపురం గ్రామాల్లో ఆఫీసర్లు నష్టాన్ని పరిశీలించారు.