- విడవని వానలు.. ఒడవని బాధలు..
- చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు
- నీళ్లలోనే ధాన్యం కుప్పలు.. వరదలో కొట్టుకపోతున్న వడ్లు..
- తేమ వల్ల ఐకేపీ సెంటర్లలో ఆగిన కొనుగోళ్లు
- రోజురోజుకూ పెరుగుతున్న పంట నష్టం
- క్రాప్లాస్ విలువ వేల కోట్లలో
- నేటికీ అందని మొదటి విడత పరిహారం
- గుండెలుబాదుకుంటున్న రైతులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తేమ శాతం ఎక్కువుందంటూ సర్కారు కొనకపోవడంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. వడగండ్ల భయంతో రైతులు నాలుగైదు రోజులుగా వరి కోతలు ముమ్మరం చేశారు. అయితే ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు సెంటర్లన్నీ చెరువుల్లా మారిపోవడంతో ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి. ఇక, గాలిదుమారానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
పది, పదిహేను రోజుల నుంచి ఇడవకుండా కొడుతున్న చెడగొట్టు వానలతో రాష్ట్రంలో పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతినగా, కొనుగోలుకేంద్రాలకు తరలించిన వేల క్వింటాళ్ల వడ్లు వరదలో కొట్టుకపోతున్నాయి. మాయిశ్చర్ కారణంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో కుప్పల కింది వడ్లు మొలకెత్తుతున్నాయి. ఈలెక్కన నష్టం వేల కోట్లలో ఉంటుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో పంట నష్టం అంచనాలకు అందడం లేదని, తాము ఓ వైపు సర్వే చేస్తుంటే మరోవైపు నష్టం జరుగుతోందని చెప్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఇలాంటి వర్షాలు, ఈ లెక్కన పంట నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదని ఊళ్లలో వృద్ధులు వాపోతున్నారు. తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి దొంగదెబ్బతీస్తున్న వర్షాల వల్ల నష్టతీవ్రత పెరుగుతోంది. రాళ్ల వాన భయంతో నాలుగైదురోజులుగా వరి కోతలు ముమ్మరం చేసిన రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించగా, ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు సెంటర్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. రాత్రి కుప్పలు పోసి తెల్లవారి వచ్చేసరికి చాలా చోట్ల వడ్లు కొట్టుకపోయాయి. సోమవారం ఉదయం పలు చోట్ల మోటార్లు పెట్టి నీటిని తోడాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెరిగిన మాయిశ్చర్.. నిలిచిన కొనుగోళ్లు
యాసంగిలో సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా 7,142 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఇప్పటివరకు 5వేల సెంటర్లు ఓపెన్‌చేసి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ సోమవారం తెలిపారు. అంటే 70శాతం సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ 7శాతం కొనుగోళ్లు కూడా జరగలేదు. చాలాచోట్ల పేరుకు సెంటర్లను ఓపెన్చేస్తున్నా ఇంకా కొనుగోళ్లు మొదలుకాలేదు. వడ్లలో తేమ శాతం పెరిగిపోవడంతో కాంటాలను ఎక్కడికక్కడ బంద్పెడ్తున్నారు. మాయిశ్చర్ ఉంటే మిల్లర్లు దింపుకోవడం లేదంటూ తప్పించుకుంటున్నారు. దీంతో కల్లాల్లో వడ్ల కుప్పలు పేరుకపోతున్నాయి. వాన భయంతో రైతులు రాశుల దగ్గరే కాపలా ఉంటున్నారు. ఎండరాగానే ఆరబోస్తూ మబ్బుపడగానే కుప్పలు పోస్తున్నారు. సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో ప్రైవేటుగా పర్దాలు తెచ్చి కప్పుకుంటున్నారు. కానీ అర్ధరాత్రి గాలిదుమారానికి పర్దాలు లేచి, కుప్పలు తడుస్తున్నాయి. చాలాచోట్ల వరదతాకిడికి వడ్లు కొట్టుకపోతున్నాయి.
పరిహారం అందేనా?
మార్చి17,18, 19తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇప్పటివరకు పరిహారం అందలేదు. అప్పట్లో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కలెక్టర్లు సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు. అదే నెల 23న సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి, ఎకరానికి రూ.10వేల చొప్పున తక్షణమే రూ.228 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ రకరకాల కొర్రీలు పెట్టి లక్షా51వేల 645 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తేల్చి, రూ.151 కోట్ల 64లక్షల 55వేలు రిలీజ్ చేస్తున్నట్లు చెప్పినా ఇప్పటికీ ఏ ఒక్క రైతుకూ పరిహారం అందలేదు. ఆ తర్వాత కురిసిన వర్షాలతో మరో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ రిపోర్టులు ఎప్పటికప్పుడు సర్కారుకు పంపుతున్నా పరిహారం ఎప్పుడిస్తారో అంతుచిక్కకుండా ఉంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకపోతున్న వడ్లకు ఎలాంటి పరిహారం ఉండదని ఆఫీసర్లు చెప్తుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
వడ్లు కొట్టుకపోయినయ్
4 ఎకరాల వరి వేసినం. 4 సార్లు మందు చల్లినం. పెట్టుబడి బాగా అయ్యింది. 2 ఎకరాల్లో పండిన వడ్లు ఆరబెట్టుకుంటే వాన పడి మొత్తం కొట్టుకుపోయినయ్. కష్టపడి పండించిన పంట నష్టపోయినా ప్రభుత్వం అదుకుంటలేదు. పంటకు నష్టపరిహారం ఇయ్యాలె.
- సల్కం రేణుక, మహిళ రైతు, నంచర్ల, పెగడపల్లి
దుఃఖం ఆగుతలేదు
మునుపు ఎప్పుడూ ఎండాకాలంల ఇట్లా దినాం వానలు పడలే. ఎప్పుడో నెలకొక్కసారి పడుతుండే. ఇంతగనం రాళ్ల వానలు నేను పుట్టిన నుంచి చూడలే.. అసలు ఈ సారి ఎండాకాలమోలే అనిపిస్తలేదు.. కల్లాల్ల వడ్లు కళ్లముందే నీళ్లల్లా కొట్టుకపోతుంటే దుఃఖం అగుతలేదు. ప్రభుత్వం ఆదుకోవాలే.- పోంచెట్టి నర్సయ్య , చందుర్తి , రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈ రైతు పేరు లోకలబోయిన తిరుపతి, భూపాలపల్లి జిల్లా మొగుళ్ల పల్లి మండలం రంగాపురం గ్రామం. తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకొని వరి, మిర్చి, మక్కజొన్న, పసుపు పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి కొంత, మిత్తి కి కొంత అప్పు చేశాడు. మొత్తం నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అకాల వర్షాలతో పంటలన్నీ నాశనమయ్యాయి. పంటలు చేతికొస్తే పాత బాకీలు తీరుతాయనుకుంటే అసలుకు మోసం వచ్చింది. అకాల వర్షంలో అగమైనామని.. మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని వాపోతున్నాడు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు.