కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే

  • చేతికొచ్చిన పంట నీటిపాలు
  • కరీంనగర్ జిల్లాలో  పంట నష్టం 50 వేల ఎకరాలపైనే
  • పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న  రైతులు
  • కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై పోసిన ధాన్యం నీళ్ల పాలు 
  • కొట్టుకుపోయిన ధాన్యాన్ని లెక్కకట్టని అగ్రికల్చర్ ఆఫీసర్లు
  • రూ.150 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా
  • నష్టపరిహారం అందించాలని అన్నదాతల వేడుకోలు 

కరీంనగర్, వెలుగు: అకాల వర్షాలు, వడగండ్లతో  చేతికందిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో  కరీంనగర్​ జిల్లాలో మూడు రోజుల్లోనే 4 3,277 ఎకరాల్లో పంట పూర్తిగా చేతికందకుండా పోయింది. 20 రోజుల క్రితం కురిసిన వర్షానికి 8,166 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తుది రిపోర్టు సిద్ధం చేశారు. ఈ లెక్కను కూడా కలిపితే మొత్తం పంట 50 వేల ఎకరాల్లో నష్టపోయినట్లు తెలుస్తోంది.జిల్లాలో రూ.130 కోట్ల వరకు నష్టం వాటిల్లగా, గత నెలలో రూ.20 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 43 వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి పంటకు కూడా తీవ్ర నష్టమే జరిగింది.  వరి ధాన్యం పూర్తిగా నేల రాలడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. ఎకరాకు సగటున రూ.30 వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు.  చేసిన శ్రమ పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో సుమారు రూ.150  కోట్ల విలువ చేసే పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది. 

రెండు సార్లు పంట నష్టం అంచనా..

ఈ నెల 22న కురిసిన అకాల వర్షం, వడగండ్లు రైతులను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వరుసగా రెండు రోజులు జిల్లాలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఆ తర్వాత జరిగిన నష్టాన్ని కూడా ఆఫీసర్లు అంచనా వేశారు. 22న కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 23,709 ఎకరాల్లో పంట నష్టం జరగగా 17,197 మంది రైతులు నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 23, 24న కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 19,568 ఎకరాల్లో పంట నష్టం జరగగా, 15,251 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో 17,763 ఎకరాల్లో వరి, 1249 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నట్లు తేల్చారు. 

పోయినసారి నష్టపోయినోళ్లకే పరిహారంఅందలే

సీఎం కేసీఆరే స్వయంగా మార్చి 23న కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో  పర్యటించి.. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగి నెల దాటినా అప్పటి బాధితులకు ఇంకా సాయం అందలేదు. దీంతో వాళ్లకే ఇంకా పైసలు రాలేదంటే తమకెప్పుడో వస్తాయోనని రైతుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

10 క్వింటాళ్ల వడ్లు నీళ్లల్లో కొట్టుకుపోయినయి.. 

వడ్లు అమ్మడానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోశాం.  ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సుమారు 10 క్వింటాళ్ల వడ్లు ఈజీఎస్ కింద తీసిన కందకంలో కొట్టుకుపోయాయి.  వడ్లను ఆరబోసుకోవడానికి ఎలాంటి పరదాలు ఇవ్వలేదు.  కొనుగోలు కేంద్రం లోతట్టుగా ఉండడంతో వరదంతా ఇటే వచ్చి వడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఎమ్మెల్యే రసమయి వచ్చి చూసి పోయిండు కానీ మాకు ఏ హామీ ఇవ్వలేదు.  పదెకరాల్లో వడ్లు పండిస్తే సుమారు 10 క్వింటాల వరకు నీళ్లల్లో కొట్టుకుపోయినయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.  

- సుక్కవ్వ, మహాత్మ నగర్, తిమ్మాపూర్

పరిహారం లెక్కల్లో  'కోత'ల భయం  ? 

కరీంనగర్ జిల్లాలో మార్చి నెలలో 29,465 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తుది అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రకటించగా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లేసరికి ఆ లెక్క 8,166 ఎకరాలకు తగ్గింది. ఏకంగా 21 ఎకరాల విస్తీర్ణాన్ని లెక్కల్లోకి తీసుకోకుండా మైనస్ చేశారు. మొత్తం పంటలో కనీసం 33 శాతం క్రాప్ లాస్ ఉండాలనే నిబంధన, కొన్ని చోట్ల జరిగిన నష్టాన్ని ఆఫీసర్లు నష్టంగా చూడకపోవడంతోనే విస్తీర్ణం తగ్గిందనే ఆరోపణలు ఉన్నాయి.  ఈ సారి మూడు రోజుల్లో 4 3,277 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.మరోవైపు ఆఫీసర్లు కేవలం చేనులో ఉన్న పంటను మాత్రమే లెక్కిస్తున్నారని, కొట్టుకుపోయిన ధాన్యాన్ని లెక్కకట్టడం లేదని కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ధాన్యం కొట్టుకుపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాడైన కూరగాయల పంటలు 

వడగండ్ల వానలకు సొరకాయ పంట పూర్తిగా దెబ్బతింది.  20 గుంటల్లో టమాట, బీర, సోరకాయ, వంకాయ తదితర రకాల కూరగాయలు సాగు చేశాను.  మరో ఎకరంలో వరి వేశా.  వడగండ్ల వానతో కూరగాయలు, వరి పంట పూర్తిగా ధ్వంసమైంది.  టమాట పంట మొత్తం పాడైంది. 

- రైతు పేరు రాములు