కామారెడ్డి , వెలుగు : వడగండ్ల వాన ఆ ఊరి రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఈ నెల 25న కురిసిన రాళ్లవానకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్లోని పంటలన్నీ తుడిచిపెట్టుకపోయాయి. కోతకొచ్చిన వరి కర్రలకు ఉన్న వడ్లన్నీ గింజలేకుండా రాలిపోయాయి. కల్లాల్లోని వడ్లన్నీ వరదలో కొట్టుకపోయాయి. పొలాల్లో ప్రస్తుతం ఎటుచూసినా ఉత్త కర్రలే కనిపిస్తున్నాయి. పంట చేతికి రాగానే అమ్మి అప్పులు తీరుద్దామని కొందరు, ఈసారి బిడ్డల పెండ్లి చేద్దామని మరి కొందరు, పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని ఇంకొందరు ఆశగా ఎదురుచూస్తుండగా, వారి ఆశల్ని వడగండ్ల వాన చిదిమేసింది.
500 ఎకరాల్లో ఉత్త కర్రలే మిగిలినయ్
బోనాల్ గ్రామంలో 604 ఎకరాల సాగు భూమి ఉంది. దీనిపై ఆధారపడి 494 రైతు కుటుంబాలు బతుకీడుస్తున్నాయి. వీరంతా సన్న, చిన్నకారు రైతులే. ఒక్కో రైతుకు తక్కువలో తక్కువ అరెకరం నుంచి 6 ఎకరాలు ఉంది. కాలువ నీళ్లు లేకపోవడంతో కేవలం బోర్లపైనే ఆధారపడి సాగుచేస్తున్నారు. యాసంగిలో ప్రధానంగా 568 ఎకరాల్లో వరి, 26 ఎకరాల్లో చెరుకు, 4 ఎకరాల్లో జొన్న, నాలుగు ఎకరాల్లో కూరగాయలు, 2 ఎకరాల్లో మక్క వేశారు. ఈసారి కరెంట్కోతలు కూడా ఉండడంతో రేయింబవళ్లు కష్టపడి పొలాలు పారించుకున్నారు. పంటలు చేతికి వచ్చే దశలో ఈ నెల 25న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన రాళ్లవాన నిండా ముంచింది. వడగండ్ల వర్షం పడేనాటికి గ్రామంలో కేవలం 60 ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోయకుండా మిగిలిన 508 ఎకరాల్లో ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. పొలాల్లో ఎటుచూసినా వడ్లు లేని కర్రలే కనిపిస్తున్నాయి. కొద్ది ఏరియాలో సాగుచేసిన జొన్న, చెరుకు, కూరగాయల చేన్లు కూడా పనికిరాకుండా పోయాయి. కోసి ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసిపోయాయి. వరదనీటిలో సగం దాకా కొట్టుకపోయాయి.
రూ.3 కోట్లకు పైగా పంట నష్టం
వరి పంట సాగుకు రైతులు ఒక్కో ఎకరాకి రూ.25వేల నుంచి రూ.28వేల దాకా పెట్టుబడి పెట్టారు. కూలీలు, ట్రాక్టర్ కిరాయిలు, ఎరువులు, పురుగు మందు ధరలు పెరగడంతో ఈసారి నిరుటి కంటే ఒక్కో ఎకరాకు రూ.3వేల సాగు ఖర్చు పెరిగిందని రైతులు చెప్తున్నారు. మొత్తంమీద బోనాల్లో వరి సాగుకు రైతులు సాగుఖర్చుల కింద సుమారు రూ.కోటి 42 లక్షలు ఖర్చు చేశారు. వడగండ్ల వాన లేకుంటే సగటున ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చేది. అంటే సుమారు రూ.3 కోట్ల వరకు రైతుల చేతికి వచ్చేవి. ఈ పైసలపై రైతు కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పులకు వడ్డీలు కట్టడంతో పాటు బిడ్డల పెండ్లిళ్లకు, పిల్లల చదువులకు పనికివస్తాయని ఆశించారు. కానీ ఒక్క వడగండ్ల వర్షం రైతుల ఆశల్ని చిదిమేసింది. ఎలాంటి పంట బీమా లేకపోవడంతో సర్కారు ఇచ్చే నష్టపరిహారంపైనే ఆయా కుటుంబాలు ఆశలుపెట్టుకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో..
ఏప్రిల్22, 25 తేదీల్లో కురిసిన రాళ్లవానలకు కామారెడ్డి జిల్లాలోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీవినీ ఎరగని రీతిలో పడ్డ వడగండ్ల వానకు 171 గ్రామాల్లో 31,929 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు. మొత్తం 22,060 మంది రైతులు నష్టపోయారు. చాలా గ్రామాల్లోనూ బోనాల్ గ్రామం లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏ రైతును పలకరించినా కన్నీరే ఉబికివస్తున్నది.
పిల్లల చదువులెట్లా?
నా భర్త కిషన్ చాలా ఏండ్ల కిందే చనిపోయిండు. 34 గుంటల భూమిపై ఆధారపడి ఇద్దరు కొడుకులతో బతుకుతున్నం. 30 గుంటల్లో వరి పెట్టిన. నాలుగు గుంటల్లో కూరగాయలు ఏసిన. రోజూ మార్కెట్లో ఆ కూరగాయలు అమ్ముకుంటూ పిల్లల్ని చదివిస్తున్న. వడగండ్ల వానతో వరి పంట, కూరగాయల చేను ఖతమైంది. ఇప్పుడు పిల్లల చదువేమోగానీ, తిండికి సుత కష్టమైతాంది.
- మెగావత్ అనిత, బోనాల్
బిడ్డ పెండ్లి అప్పు కొంత తీరుద్దామనుకున్న
3 ఎకరాల్లో వరి వేసినం. రాళ్ల వానకు చేనంతా ఖతమైంది. ఒక్క గింజ సుత మిగల్లే. 6 నెలల కిందే అప్పు తెచ్చి బిడ్డ పెండ్లి చేసిన. ఈసారి వడ్లు అమ్మి కొంత బాకీ కడుదమనుకున్న. రాళ్ల వాన నిండా ముంచింది. ఈసారి అప్పులు కట్టే పరిస్థితి లేదు. వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతయ్.
- గరిగె బాలవ్వ, బోనాల్
నాలుగురోజుల్లో కోద్దామనుకున్న
రెండున్నర ఎకరాల్లో వరి వేసిన. ఈసారి మస్తు తిప్పలు వడ్డ. మూడు, నాలుగు సార్లు మందులు కొట్టిన. గింజ పోసేటప్పుడు బోరు ఎండిపోయింది. ఊరోళ్లను ఒప్పిచ్చి చెరువు దాకా 500 మీటర్ల మేర పైపులైన్ వేసుకొని పంటను కాపాడుకున్న. పైపులైన్ కోసమే పది వేల దాకా ఖర్చు చేసిన. పంట చేతికి వచ్చినంక మరో నాలుగురోజుల్లో కోద్దామనుకునే టైంలో వడగండ్లు పడి వడ్లన్నీ గింజలేకుండా రాలిపోయినయి. ఏం చేయల్నో అర్థమైతలేదు. సర్కారే ఆదుకోవాలి.
- కుర్మ చిన్న సాయిలు, బోనాల్