- వర్షాలు పడుతుండటంతో ఆగిన ఎదుగుదల
- వర్షానికి రాలుతున్న పూత, కాయ
- వచ్చే నెలలో పత్తి కొనుగోళ్లకు అధికారుల కసరత్తు
- జిల్లా వ్యాప్తంగా 4.12లక్షల ఎకరాల్లో సాగు
ఆదిలాబాద్, వెలుగు : వారం రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి చేన్లలో నీరు నిలువ ఉండడంతో దిగుబడిపై రైతులు దిగాలు పడుతున్నారు. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. వర్షాలకు పూత రాలిపోతోంది. కాయ, పంట ఎదుగదల ఆగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. జూలై నెలలో భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ అగస్టులో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. సెప్టెంబర్ నెలలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి.
ఇలా వాతావరణంలో వస్తున్న మార్పులతో పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం కనబడుతోంది. ఇప్పటి వరకు పత్తి మొక్కకు 15 నుంచి 20 కాయలు ఉన్నాయి. జూలైలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం కాగా.. అందులో పత్తి 35 వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. దీంతో రైతులు రెండోసారి పంట వేసుకోవడంతో ఖర్చులు డబుల్ అయ్యాయి. మొదటిసారి ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు చేయగా.. రెండోసారి మళ్లీ రూ. 20 వేల ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సరైన దిగుబడులు రాకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతున్నారు.
4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..
జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరు గుతోంది. గతేడాది 3.80 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 4.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 28 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. మరో నెల రోజుల్లో పత్తి కొనుగోళ్లకు సైతంఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, మార్కెట్ అధికారులు, ట్రేడర్లతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. అయితే వర్షాల ప్రభావంతో ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు ఇలాగే కొనసాగితే పింక్ బౌల్ లాంటి తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గిపోనున్నాయి. గతేడాది సైతం గులాబ్ తుపాన్ కారణంగా 23 లక్షల క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడులు 12 లక్షల క్వింటాళ్లకు పడిపోయాయి. ఈ ఏడాది కూడా అదే జరుగుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ALSO READ: మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ టికెట్ కోసం నాయకుల కష్టాలు
పత్తి ధరను పెంచిన కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సైతం పంటలకు మద్దతు ధర పెంచింది. గత ఆరు సంవత్సరాల నుంచి పత్తికి ధర పెరుగుతుండగా రెండేళ్ల క్రితం క్వింటాలుకు రూ. 200 పెంచిన కేంద్రం గతేడాది రూ.355 కి పెంచి రూ.6,600 కొనుగోళ్లు చేపట్టింది. ఈ సారి రూ. 640 పెంచడంతో క్వింటాలు మద్దతు ధర రూ. 7,020కి చేరుకుంది. ఈ ధరతో సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు.
ఐదు క్వింటాళ్లు కూడా రావు..
ఈ ఏడాది ఐదు ఎకరాల్లో పత్తి పంట వేశాను. మొదట్లో విత్తనాలు భాగానే మొలకెత్తాయి. ఎదుగుతున్న దశలో వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో పత్తి పెరుగుదల ఆగిపోయింది. పూత రాలిపోతోంది. కాయ సైతం పెరగడం లేదు. ఇలా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడటం వల్ల కనీసం ఎకరానికి ఐదు క్వింటాళ్లు కూడా దిగుబడి రాదు. దిగుబడి తగ్గితే పత్తి కొనుగోళ్ల సమయంలో సరైన ధర లేకుంటే ఇంకా నష్టం భారీగా ఉంటుంది.
భూమయ్య, బండల్నాగాపూర్, రైతు