
- రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్వల్పకాలిక వరి రకాల సాగును నవంబర్లోనే ప్రారంభిస్తే, మార్చి మొదటి వారంలోనే వరికోతకు వస్తుందని, అప్పుడు ఎలాంటి నీటి ఎద్దడి ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంత్రి నేరుగా రైతులు, శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అలాగే, అధికారులతోనూ ఆయన సమీక్ష నిర్వహించారు.
రైతులు ముందస్తు ప్రణాళికతో సాగుచేస్తే నీటి ఎద్దడితో పాటు, వడగళ్ల వర్షం నుంచి పంటను రక్షించుకోచ్చని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పవర్ టిల్లర్స్, పవర్ వీడర్, రొటోవేటర్, ట్రాక్టర్ తో నడిపే పరికరాలు, తైవాన్ స్ప్రేయర్స్ తదితర పరికరాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషాకు మంత్రి సూచించారు.
సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన సన్నరకాల విత్తనాలను అందించాలని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీని మంత్రి ఆదేశించారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో విత్తనాల నిర్వహణ సరిగా లేక సంస్థ నష్టాల్లో ఉందన్నారు. ఏడాది కాలంగా సంస్థ ఉత్పత్తి చేసిన విత్తనాలను రైతులకు సరసమైన ధరలో అందిస్తున్నామన్నారు.
గత ఐదేళ్లలో సీడ్స్ ని నాన్ సీడ్స్గా అమ్మినందుకే సంస్థకు రూ.90 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కాగా.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో వరి పంటకు నీరు అందించాలని, దీంతో సమస్య అధిగమించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.