రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు

కోటీ 20 లక్షల ఎకరాల్లో పంటలు వేసిన్రు
సాధారణ లక్ష్యం దాటిన వానాకాలం సాగు
కొత్త పంటల ప్లాన్‌‌లో 96 % పూర్తి

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు కోటీ 20 లక్షల ఎకరాలు దాటింది. వాతావరణం అనుకూలించడం, సరైన సమయంలో వర్షాలు పడడంతో షరతుల సాగు లక్ష్యం దిశగా సాగుతోంది. సాధారణ సాగులో వందశాతం దాటేయగా.. పంటల ప్లాన్‌‌ లో 96 శాతంతో వ్యవసాయశాఖ లక్ష్యానికి చేరువైంది. వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా రైతులు పంటలు వేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోటీ 20 లక్షల 33వేల 667 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం లక్ష్యం కోటీ 25 లక్షల 45 వేల ఎకరాలు. అంటే ఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 96 శాతం.

అగ్రి, హార్టికల్చర్‌ 1.28 లక్షల ఎకరాలు
ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించిన ప్రకారం.. వ్యవసాయ శాఖ పంటలు కోటీ 20 లక్షల ఎకరాలు, ఉద్యానశాఖ 7.82 లక్షల ఎకరాలు కలిపి కోటీ 28 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 80 లక్షల ఎకరాల్లోసాగు కాగా.. ఇప్పుడది 40 లక్షల ఎకరాలకుపైగా పెరిగింది.

వరి లక్ష్యం దాటేసింది
ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 42.28 లక్షల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. వరి సాగు లక్ష్యం 41.76 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే 50 వేల ఎకరాలు ఎక్కువ వేశారు. అత్యధికంగా 57.99 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. గతేడాది కంటే దాదాపు 15 లక్షల ఎకరాలు అదనంగా పత్తి సాగు కావడం విశేషం. అయితే ప్రతిపాదిత సాగు లక్ష్యం 60.16 లక్షల ఎకరాలుగా ఉంది. 10.14 లక్షల ఎకరాల్లో కంది పంట వేశారు.

నల్గొండ టాప్‌..
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సంగారెడ్డిలో 7.1 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 18,292 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. మూడు జిల్లాలు మినహా 29 జిల్లాల్లో సాధారణ పంటల సాగు వంద శాతం దాటింది. వనపర్తి జిల్లాలో 85%, ములుగు జిల్లాలో 95%, పెద్దపల్లి జిల్లాలో 99% పంటలు సాగయ్యాయి.

For More News..

రాష్ట్రం అడిగిన వాటి కంటే ఎక్కువే ఇచ్చిన్రు

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్

ఓటర్ల లిస్ట్‌లో సవరణకు చాన్స్

రిమ్స్ వార్డుల్లో ఎలుకలు.. రోడ్ల మీద పేషంట్లు..