కామారెడ్డిలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు

కామారెడ్డిలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు
  • నేలకొరిగిన మక్క, గింజలు రాలిన వరి 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి  జిల్లాలో మరోసారి  వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిలిగ్చింది.  సోమవారం రాత్రి జిల్లాలోని పలు ఏరియాల్లో వడగండ్ల వాన పడింది.  గాంధారి, సదాశివనగర్​,  బాన్సువాడ, కామారెడ్డి  ఏరియాల్లో వడగండ్ల వాన కురిసింది.  ఆయా ఏరియాల్లో కోతకు వచ్చిన మక్క, వరి పంటలు దెబ్బతిన్నాయి.  ఏపుగా పెరిగిన మక్క పంట రాళ్ల వానకు నేలవాలింది.  వడ్ల గింజలు రాలిపోయాయి.  

సదాశివనగర్​, లింగంపల్లి, భూంపల్లి, గాంధారి, మాధవపల్లి,  బొప్పాజివాడి, హన్మాజిపేట, సంగోజిపేట తదితర గ్రామాల  శివార్లలో వడగండ్ల వాన కురిసి పంటలు నేలకొరిగాయి.  గాంధారి మండలంలో జొన్న పంట  కూడా నేలవాలింది. 20 రోజుల కింద కురిసిన వడగండ్ల వానకు  జిల్లాలో 10,328 ఎకరాల్లో  పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్ వారు పరిశీలన చేశారు.  

వరి 8,740 ఎకరాలు, మక్క 1,016,  మామిడి 223 ఎకరాలు,  కూరగాయలు 120 ఎకరాలుఎ, ఇతర పంటలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు.   మళ్లీ అకాల వర్షం కురియటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  చేతికొచ్చిన పంటలు దెబ్బతినటం వారిని ఆవేదనకు గురి చేస్తోంది.  నష్టపోయిన తమను ప్రభుత్వం అదుకోవాలని రైతులు కోరుతున్నారు.