కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ నుంచి నీళ్లొస్తున్నా చెరువులకు చేరుతలే

కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ నుంచి  నీళ్లొస్తున్నా చెరువులకు చేరుతలే
  •  నిర్వహణ లేక, రిపేర్లు చేయక శిథిలావస్థలో కాలువలు.. 
  •  నీళ్లు లేక వెలవెల బోతున్న చెరువులు 
  •  యాసంగిలో సాగునీరు అందక ఎండుతున్న పంటలు
  •  వారబందీ కింద ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల
  •  ఆందోళనలో ఆయకట్టు రైతులు

జగిత్యాల, వెలుగు: ఎస్సారెస్పీ నుంచి నీళ్లొస్తున్నా.. అవి చెరువులకు చేరడం లేదు. దీంతో యాసంగిలో రైతులకు నీటి తిప్పలు తప్పడం లేదు. కెనాల్స్‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు చేయక.. నిర్వహణ లేక నీరు చెరువులకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఎస్సారెస్పీపై ఆధారపడిన ఎండిపోతున్న వరి పొలాలను చూసి ఆందోళనకు గురవుతున్నారు. గత పదేండ్లలో రిపేర్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. 

1.70 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరు

జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు 91 కిలోమీటర్ల  మేర ఎస్సారెస్పీ నీరు వస్తున్నా చివరి భూములకు చేరడం లేదు. ముఖ్యంగా సారంగాపూర్, మల్యాల, వెల్గటూర్, ఎండపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి బుగ్గారం మండలాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక వరి ఎండిపోయే దశకు వచ్చాయి. జిల్లాలో డీ-21 నుంచి డీ- 83 వరకు 62 సబ్ కెనాల్స్ ఉన్నాయి. ఈ కెనాల్స్ ద్వారా దాదాపు 1.70 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందుతోంది. 80.5 టీఎంసీల కెపాసిటీ గల ఎస్సారెస్పీలో ప్రస్తుతం 32 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఈ పద్ధితిలో గతేడాది డిసెంబర్ 25 నుంచి వచ్చే ఏప్రిల్ 3 వరకు నీటిని అందించేలా ఆఫీసర్లు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

30 వేల ఎకరాలకు అందని సాగునీరు

జగిత్యాల జిల్లావ్యాప్తంగా 1072 చెరువులు ఉన్నాయి. వీటిలో 920 చెరువుల్లో ఎస్సారెస్పీ కెనాల్స్ ద్వారా నింపుతుండగా.. మిగతా152 చెరువులకు కెనాల్స్‌‌‌‌‌‌‌‌తో నీరు నింపే అవకాశం లేదు. మెయిన్ కెనాల్స్ తో పాటు డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్ లైనింగ్ చాలాచోట్ల దెబ్బతిన్నాయి. షెట్టర్లు శిథిలావస్థకు చేరడంతో నీటి తరలింపునకు ఇబ్బందులు తలెత్తున్నాయి. 9 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం ఉన్న కెనాల్స్ 6 వేల క్యూసెక్కులకు మించి తరలించే పరిస్థితి లేదు. ఒకవేళ తరలించినా గండ్లు పడుతుండడంతో దాదాపు 30 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందడం లేదు.  గత సర్కార్ హయాంలో రిపేర్ల కోసం నిధుల మంజూరు చేయకపోవడంతో రైతులకు తిప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.