తొమ్మిదో ప్యాకేజీని పట్టించుకోలే..

తొమ్మిదో ప్యాకేజీని పట్టించుకోలే..
  • పనులు పూర్తికాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్న పంటలు.. 
  • అడుగంటిన భూగర్భజలాలు
  • పొలాల్లో పశువులను మేపుతున్న రైతులు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. మరోవైపు భూగర్భజలాలు అడుగంటాయి. కొన్ని ఏరియాల్లో ఎండిపోయిన పంటలను రైతులు పశువుల మేతకు వదిలేస్తున్నారు. 

గత ప్రభుత్వం పట్టించుకోలే.. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా 2015లో 9వ ప్యాకేజీ పనులు స్టార్ట్‌‌ చేశారు. జిల్లా పరిధిలో 9వ ప్యాకేజీతోపాటు 10, 11,12 ప్యాకేజీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌‌‌‌కు నీటిని తరలించే ప్యాకేజీల(9వ ప్యాకేజీ మినహా)ను గత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. 9వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేసే  కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని మల్కపేట రిజర్వాయర్ పనులను పెండింగ్‌‌లో పెట్టింది. మిడ్‌‌మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి కాల్వల ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి మీదుగా  మైసమ్మ చెరువును నింపేలా, అక్కడి నుంచి గంభీరావుపేట మండలం లింగాపూర్ శివారులోని సింగసముద్రం చెరువులోకి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ పనులు పూర్తికాలేదు. 

ఎండుతున్న పంటలు

సాగునీరందక జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం అల్మస్ పూర్, రాజన్నపేట, తిమ్మాపూర్, బాకుర్‌‌‌‌పల్లి తండాల్లో పొలాలు ఎండుతున్నాయి. వీర్నపల్లి మండలంలో బాబాయి చెరువులో నీరు లేక ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి. ఇదే మండలం వన్‌‌పల్లి గ్రామంలో పొలాలకు నీరందక ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. బోయినిపల్లి మండలం తడగొండలో, కోనరావుపేట మండలంలోని మర్తనపేట, నాగారం, పల్లిమక్త, నిజామాబాద్, కోనరావుపేట గ్రామాల్లో చెరువులు, బోరు బావుల్లో నీరు లేక పొలాలు ఎండుతున్నాయి. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది, బదనకల్, గన్నెవారి పల్లె, మొర్రాపూర్ గ్రామాల్లోని పొలాలకు ఎగువ మానేరు నుంచి సాగునీరు రావాల్సి ఉంది. అక్కడి నుంచి నీరు రాకపోవడంతో పొలాలు ఎండుతున్నాయి. 

తగ్గిన భూగర్భ జలాలు

గతేడాదితో పోల్చితే భూగర్భ జలాలు స్వల్పంగా తగ్గాయి. 2024 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి లో 1.30 మీటర్లు లోతున భూగర్భ జలాలు ఉంటే ఈఏడాది 1.33 మీటర్లకు పడిపోయాయి. మార్చి, ఏప్రిల్‌‌లో భూగర్భజలాలు భారీగా తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.