
- చెడగొట్టు వానలకు పంటలు ఆగం
- నేలవాలిన వరి, మొక్కజొన్న.. రాలిన మామిడి కాయలు
- గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- పలు జిల్లాల్లో కరెంట్ సరఫరాలో అంతరాయం
- పిడుగుపడి స్టూడెంట్, పశువుల కాపరి మృతి
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. వరి, మక్క పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలి దుమారానికి చెట్లు కూలిపోగా, ఇండ్ల మీదున్న రేకులు ఎగిరిపోయాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న సామాన్లు తడిసిపోయాయి. కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, జనగామ, కామారెడ్డి జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు. మృతుల్లో ఓ స్టూడెంట్ ఉన్నాడు. చెడగొట్టు వానకు చేతికొచ్చిన వరి పంట నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన నష్టపరిహారం ఇవ్వాలని ప్ర భుత్వాన్ని కోరుతున్నారు.
సిద్దిపేటలో 9వేల ఎకరాల్లో పంట నష్టం
సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 31 గ్రామాల్లో 9,149 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొండపాక, మద్దూరు, చేర్యాల, చిన్నకోడూరు, నారాయణరావుపేట, నంగునూరు, బెజ్జంకి, ధుల్మిట్ట, సిద్దిపేట అర్బన్ మండలాల్లోని గ్రామాల్లోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6,321 ఎకరాల వరి పంట, 33 ఎకరాల మొక్కజొన్న, 1,141 ఎకరాల మామిడి, 1,654 ఎకరాల కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఈదురుగాలుల బీభత్సం
సంగారెడ్డి జిల్లాలోనూ వడగండ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, మునిపల్లి, పుల్కల్, సదాశివపేట, నారాయణఖేడ్, పటాన్చెరు, ఝరాసంఘం, కంగ్టి మండలాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఝరాసంఘంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు చెట్టు విరిగి బైక్‌లపై పడింది. కంగ్టి మండలం నాగన్ పల్లిలో పలు ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో సామాన్లు తడిసిముద్దయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో అరగంట వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిన్నచింతకుంట మండలంలో గంట పాటు ఏకధాటిగా వానపడింది. అమ్మాపూర్, కురుమూర్తి గ్రామాల్లోని వరి పంట దెబ్బతిన్నది. ఆరబెట్టుకున్న వడ్లు తడిసిపోయాయి. జనగామ జిల్లా లింగలఘనపురంలో చెట్లు కూలిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, బిచ్కుంద, జుక్కల్, బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో వర్షం కురిసింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్లో వరి నేలకొరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి మొక్కజొన్న, మామిడి రైతులు నష్టపోయారు. మాదాపూర్‌లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి కాయలు నేలరాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులో పిడుగుపడి సంతోష్ అనే స్టూడెంట్ చనిపోయాడు. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్.. సదాశివపేటలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఫ్రెండ్ అన్వేష్‌తో కలిసి టూ వీలర్‌పై ఊరికి వెళ్తుండగా వర్షం పడింది. దీంతో ఇద్దరూ చెట్టు కింద నిలబడ్డారు. వీరిపై పిడుగుపడటంతో సంతోష్ స్పాట్లోనే చనిపోయాడు. అన్వేష్‌కు గాయపడగా.. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆములూరు గ్రామానికి చెందిన మేకల చిన్న రాములు (65) పిడుగుపడి చనిపోయాడు. గొర్రెలు మేపుతుండగా వర్షం పడింది. చెట్టు కింద నిలబడగా.. కొద్దిదూరంలో పిడుగుపడింది. దీంతో రాములు స్పాట్లోనే చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరులో పిడుగుపడి మర్రికింది ఎల్లయ్య అనే రైతుకు చెందిన పాడి గేదె, రెండు కాడెట్లు మృత్యువాతపడ్డాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో పిడుగుపడి నరసింహారెడ్డి అనే రైతుకు చెందిన ఆవు, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గును కొండాపూర్ లో నేలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు చనిపోయాయి.
ఇటీవల కురిసిన వానలకు 15వేల ఎకరాల్లో పంట నష్టం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 14,956 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఫీల్డ్ లెవల్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు గ్రామాలు, రైతుల వారీగా పంట నష్టం సర్వే చేపట్టారు. ఈ నెల 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. మొత్తం 14,956 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడి, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 33% పంటకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందించనున్నారు. ఫీల్డ్ లెవల్లో ఏఈవోలు నిర్వహిస్తున్న సర్వే ఆధారంగా రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారంగా అందించనున్నారు. మార్చి 21 నుంచి 23 వరకు వడగండ్ల వానలతో రాష్ట్ర వ్యాప్తంగా 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దాదాపు 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి ఉన్నాయి. ఫీల్డ్ లెవల్ సర్వేలో 8,406 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు నిర్ధారించారు.